కొత్త కొత్తగా..


Fri,November 1, 2019 02:04 AM

-నేటి నుంచి తెరుచుకోనున్న కొత్త మద్యం దుకాణాలు
-జిల్లాలో మొత్తం 91 షాప్‌లకు ప్రొవిజినల్ లైసెన్సులు జారీ
నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: కొత్త మద్యం దుకాణాలు శుక్రవారం (నేటి) నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త మద్యం పాలసీని అనుసరించి రెండేండ్ల కాలపరిమితి కోసం నిర్వహించిన మద్యం టెండర్ల ప్రక్రియ జిల్లాలో సజావుగా ముగిసింది. మొత్తం 91 దుకాణాలకు టెండర్లు నిర్వహించి డ్రా పద్ధ్దతిన దుకాణాలు కేటాయించారు. తక్కువగా దరఖాస్తులు వచ్చిన 8 దుకాణాలకు మళ్లీ తేదీని పొడిగించి కొత్త దరఖాస్తులను స్వీకరించారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరింది. మొత్తం దరఖాస్తుల ద్వారా, లైసెన్సు ఫీజులో పావువంతు భాగం చెల్లించడం ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వానికి జిల్లా నుంచి మొత్తం రూ. 36.22 కోట్ల ఆదాయం వచ్చింది. గురువారం ఎైక్సెజ్ అధికారులు మద్యం వ్యాపారులకు ప్రొవిజినల్ లైసెన్సులను జారీ చేశారు. బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడం కోసం మరో పదిహేను రోజుల గడువు విధించారు. గ్యారెంటీ ఇచ్చిన వారికి వెనువెంటనే పూర్తిస్థాయి లైసెన్సులు జారీ చేస్తారు. కాగా, నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభించాల్సి ఉన్నందున, ప్రొవిజినల్ లైసెన్సులు పొందిన వారికి ఐఎంఎల్ డిపో నుంచి మద్యం సరఫరా చేస్తున్నారు.

గతంలో అదే రోజు ఉదయం నుంచి మద్యం సరఫరా ఉండేది. కానీ, ఈసారి కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం రాత్రి 10 గంటల తర్వాత మద్యం సరఫరా మొదలయ్యింది. ఒక్కో దుకాణానికి 100 కేసుల లిక్కర్, 150 కేసుల బీర్‌ను సరఫరా చేస్తున్నారు. మిగిలిన వారికి శుక్రవారం ఉదయం 7గంటల నుంచి దుకాణాలు తెరిచే సమయానికి మొత్తం అనుకున్న స్టాకును సరఫరా చేయనున్నారు. గడిచిన రెండేండ్ల కాలంలో అన్ని దుకాణాలు సజావుగానే కొనసాగాయి. గడువు ముగిసిన నేపథ్యంలో పాతవారికి దుకాణాల నిర్వహణ గడువును మరో రెండు నెలలు ప్రభుత్వం పెంచింది. దీంతో కొంతమంది మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఎమ్మార్పీకి మించి మద్యం అమ్ముకున్నారు. దీంతో స్టేట్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగి రెండు దుకాణాలపై కేసులు నమోదు చేయడంతో లిక్కర్ మాఫియా దారికొచ్చింది.

కొత్త మద్యం పాలసీలో లిక్కర్ మాఫియా అక్కడక్కడా తమ ప్రతాపాన్ని చూపింది. కొన్ని దుకాణాలకు తక్కువ దరఖాస్తులు వచ్చేలా చక్రం తిప్పింది. దీన్ని ఎక్సైజ్ ఉన్నతాధికారులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. వాటికి మళ్లీ ఓపెన్ టెండర్లు పిలవడంతో ఎక్కువ మొత్తంతో దరఖాస్తులు వచ్చి ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరింది. ఈ కొత్త మద్యం పాలసీలో కూడా చాలామంది పాతవారే కొనసాగుతుండడం గమనార్హం. కొత్త వారు లక్కీ డ్రా ద్వారా దుకాణాలు దక్కించుకున్నా, గుడ్‌విల్ కింద పాత వారికే అమ్ముకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎక్కువశాతం పాతవారే ఈ మద్యం దుకాణాలు నడిపించనున్నారు. నేటి నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం కానున్నాయి.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...