పక్కాగా ధాన్యం సేకరణ


Fri,November 1, 2019 02:03 AM

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: పక్కాగా ధాన్యం సేకరించేందుకు ఐదు శాఖల సమన్వయంతో ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఐదు శాఖలు బృందంగా ఏర్పడి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ సజావుగా నిర్వహించడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోనున్నారు. క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వాటిని పరిష్కరించేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు ప్రతీసారి సీజన్ ఆరంభంలో నకిలీ విత్తనాల సరఫరా మోసాలు షరా మామూలుగా మారాయి. దీనిపైనా యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. నకిలీ విత్తనాలు సరఫరా చేయడం, లైసెన్సు లేకుండా ఇష్టానుసారంగా విత్తనాలను రైతులకు అంటగట్టి, ఆ తర్వాత ముఖాలు చాటేసే వ్యాపారులపైనా సీరియస్‌గా దృష్టిసారించింది బృందం.

ప్రధానంగా ఐదు శాఖలు ఇందులో భాగస్వాములవుతున్నాయి. వీరంతా ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ సమస్య ఏదైనా వాటిని వెంట నే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆర్మూర్, ఆలూర్‌లో ఇద్దరు నకిలీ విత్తన వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతంలో కన్నా ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వస్తుందని అంచ నా వేశారు. 7.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో కన్నా ఈసారి కేంద్రాలను పెంచారు. మొత్తం 310 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటికే 200 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే ధాన్యం వస్తున్నది. ఇప్పటి వరకు 15వేల క్వింటాళ్ల వరకు ధాన్యం సేకరించారు.
ఐదు శాఖలు..

నిరంతర పర్యవేక్షణ..
ఐదు శాఖలు సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షణ చేసుకునేలా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వ్యవసాయశాఖతో పాటు జిల్లా కో- ఆపరేటీవ్ శాఖ, మార్కెటింగ్, జిల్లా పౌర సరఫరాల శాఖ, పోలీసు శాఖలు ఎప్పటికప్పుడు ధాన్యం సేకరణ నిర్వహణ, నకిలీ విత్తనాల సరఫరాపై పర్యవేక్షణ చేస్తాయి. దీనికోసం ప్రత్యేకంగా ఈ శాఖల ముఖ్య అధికారులతో ఓ వాట్సప్ గ్రూపును క్రియేట్ చేశారు. జాయింట్ కలెక్టర్ అడ్మిన్‌గా ఉన్న ఈ గ్రూపు పేరును నిజామాబాద్ ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ గా పెట్టుకున్నారు. ఇందులో జేసీతో పాటు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పీఏలు, వ్యవసాయశాఖ అధికారులు, జిల్లా కో ఆపరేటీవ్ అధికారి, ఆ శాఖ ముఖ్య సిబ్బంది, మార్కెటింగ్ మేనేజర్, జిల్లా సివిల్ సైప్లె అధికారి, సివిల్ సైప్లె సంస్థ మేనేజర్, పోలీస్ శాఖ నుంచి డీసీపీ, నిజామాబాద్ ఏసీపీ, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ఉంటారు. వీరితో పాటు కలెక్టర్ సీసీ, జేసీ సీసీ ల నంబర్లను చేర్చారు.

ఇలా జిల్లా యంత్రాంగంలోని ముఖ్యమైన శాఖలు, అధికారులతో కలిపి ఓ వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితులు మంత్రి, కలెక్టర్ తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి ధాన్యాన్ని తీసుకువచ్చి ఇక్కడ అమ్ముకునే అవకాశం ఉందని గ్రహించిన యంత్రాం గం, దీన్ని కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. పోలీసులతో దీనిపై నిఘా ఏర్పాటు చేయించింది. అక్కడ ధాన్యం సేకరణ 40శాతానికి మించి జరగదు. దీంతో జిల్లా సరిహద్దు ప్రాంతాలకు మహారాష్ట్ర రైతులు ధాన్యా న్ని తీసుకువచ్చి అమ్ముకుంటారనే సమాచారం ఉంది. దీన్ని అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నకిలీ విత్తనాల సరఫరాపై ఉదాసీన వైఖరి వీడాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇటీవల జరిగిన సమావేశంలో అధికారులకు చురకలంటించారు. వ్యవసాయాధికారులు, పోలీసులు నకిలీ విత్తనాలపై సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించారు. జిల్లాలోని రైతులందరి వద్ద చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...