పోతే రెండు లక్షలు.. వస్తే ఇరవై లక్షలు


Sun,October 20, 2019 04:29 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: కొత్త మద్యం పాలసీ ప్రకారం వైన్స్‌లు దక్కించుకునేందుకు టెండ్లర్లకు దరఖాస్తు రుసుం రూ.2 లక్షలకు పెంచినా.. చాలామంది షాప్ లు దక్కించుకునేందుకు పోటీపడ్డారు. ఈసారి వచ్చిన దరఖాస్తుల్లో 60శాతం మేర కొత్త వారే ఉండడం గమనార్హం. తమ అదృష్టాన్ని పరీక్షించుకొని షాపు దక్కితే వాటి వినియో గం కన్నా వచ్చే గుడ్‌విల్‌పైనే చాలామంది గంపెడాశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రతిసారి జరిగే తంతే.కానీ, ఈసారి కొత్త వారు ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకోవడంతో గుడ్‌విల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తున్నది. పేరు వారిదైనప్పటికీ దుకాణ నిర్వహణ, లాభాల ఆర్జన అంతా గుడ్‌విల్ వచ్చి కొనుకున్న వారే చూసుకుంటారు. గతంలో ఒక్క షాప్‌నకు రూ. 30లక్షల నుంచి రూ. 35లక్షల వరకు రెండేండ్ల కోసం గుడ్‌విల్ మాట్లాడుకొని షాపులు అప్పజెప్పిన ఉదంతాలు ఉన్నాయి. అయితే ఈసారి కొత్త మద్యం పాలసీలో లక్ష రూపాయిల దరఖాస్తు ఫీజును రెండు లక్షలకు పెంచారు. సీరియస్‌గా ఈ బిజినెస్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నవారు మాత్రమే ముందుకు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దరఖాస్తు ఫీజును పెంచింది. అయితే గుడ్‌విల్‌కు ఆశపడ్డ చాలామంది కొత్తవారు పోతే రెండు లక్షల రూపాయలు.. లేదంటే రూ.30లక్షల వరకు గుడ్‌విల్ ద్వారా లాభపడొచ్చనే ఉద్దేశంతో పోటీపడి టెండర్లలో పాల్గొన్నట్లు తెలుస్తున్నది. అయితే గతంలో పలికిన గుడ్‌విల్ ధరలో ఈసారి కొంత మేర తగ్గినట్లుగా తెలుస్తున్నది. రూ. 30లక్షల వరకు రెండేండ్ల కింద గుడ్‌విల్ రూపంలో వసూలు చేసుకోగా, ఈసారి ఇది రూ. 20లక్షల వరకు బేరసారాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. డ్రాలో షాపు దక్కించుకున్న వారు వెంటనే ఏడాది లైసెన్సు ఫీజులో 25శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

దీని కోసం 24గంటల సమయమిస్తారు. ఈ గడువు సమయంలోనే 25శాతం లైసెన్స్ ఫీజును చెల్లించి గుడ్‌విల్ బేరసారాలకు తెరతీస్తారు. నవంబర్ ఒకటి నుంచి కొత్త లైసెన్స్ దుకాణాలు ప్రారంభించాల్సి ఉంది. దీనికి ఇంకా పది రోజుల సమయం ఉండడంతో తెర వెనుక మద్యం వ్యాపారులకు కొత్తగా దుకాణాలు దక్కించుకున్న వారికి మధ్య బేరసారాలు జరుగుతాయి. అయితే ఇదంతా అధికారవర్గాలకు తెలిసిన వ్యవహారమే. కానీ, అధికారికంగా లైసెన్స్ హోల్డర్ మాత్రమే కాగితాల్లో ఉంటాడు. ఏదైనా కేసులు పెట్టిన సందర్భం వస్తే లైసెన్స్ దారుడుపైనే పెడతారు. దీంతో తెరవెనుక ఏ ఒప్పందాలు చేసుకున్నా పద్ధతి ప్రకారం మద్యం షాపు నిర్వహణ జరగకపోతే లైసెన్స్‌దారుడే బాధ్యత వహిస్తాడు. దీంతో గుడ్‌విల్ ఒప్పందం ముందే ఇవన్నీ విషయాలు చర్చించుకొని, ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత బినామీలు రంగంలోకి దిగుతారు. లక్కీ డ్రాలో షాపును సొంతం చేసుకున్న కొంతమంది రెండేండ్ల పాటు దుకాణాన్ని నడిపించే అనుభవం లేకపోవడం తదితర కారణాలతో ఒకేసారి వచ్చే గుడ్‌విల్ పై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. షాపు దక్కిందే తడువు ఏడాదికి రూ. 10లక్షల చొప్పున రెండేళ్లకు గాను రూ. 20లక్షల పైచిలుకు ఆయాచితంగా లాభం వచ్చే మార్గం వైపే ఉత్సాహం చూపిస్తున్నారు. మాట్లాడుకున్న గుడ్‌విల్‌ను బినామీలు రెండు, మూడు విడతలుగా, కిస్తీల పద్ధతిన చెల్లిస్తారు. పోతే రెండు లక్షలు.. వస్తే ఇరవై లక్షలు అన్న చందంగా లక్కీ బంపర్ డ్రా మాదిరిగా మద్యం దుకాణాల టెండర్లు కొందరికి ఆయాచితంగా లక్షల రూపాయలు ఆర్జించి పెడుతున్నాయి.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...