వైద్యం అందక గర్భంలోనే శిశువు మృతి


Sat,October 19, 2019 02:16 AM

కమ్మర్‌పల్లి, నమస్తేతెలంగాణ : మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సేవలు నానాటికీ అధ్వానంగా మారుతున్నాయి. సర్కారు దవాఖానల్లో పేదలకు మెరుగైన సేవల కోసం ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తూ ప్రసవాలను ప్రోత్సహిస్తుంటే కమ్మర్‌పల్లిలో సిబ్బంది నిర్లక్ష్యం, సమయ పాలన పాటించకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో గురువారం రాత్రి గర్భంలోనే ఓ శిశువు మృతి చెందిన సంఘటన నెలకొంది.

కమ్మర్‌పల్లి పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన బోదాసు రజిత అనే గర్భిణిని ఆమె బంధవులు ఆదివారం కమ్మర్‌పల్లి ప్రభుత్వ దవాఖానకు తీసుకువచ్చారు.రజిత ప్రసవానికి నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పడంతో వారు రజితను ఇంటికి తీసుకెళ్లారు. తిరిగి గురువారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో నొప్పులతో బాధపడుతున్న రజితను ఇదే దవాఖానకు తీసుకొచ్చారు. ఆ సమయంలో దవాఖానలో ఎవరూ లేకపోవడంతో ఏమి చేయాలో తోచక ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో డ్యూటీలో ఉండాల్సిన స్టాఫ్ నర్సు అనితకు బదులుగా ఆమె కూతురు ఉండడంతో ఆమెను డాక్టర్‌కు, స్టాఫ్ నర్సుకు ఫోన్ చేయమని వారు వేడుకున్నా ఆమె పట్టించుకోలేదు. అరగంట గడిచాక స్టాఫ్ నర్సు జ్యోతి వచ్చి గర్భిణిని పరీక్షించింది. గర్భంలో బిడ్డ నుంచి ఎలాంటి శబ్దం వినిపించడంలేదని ఇన్‌చార్జి వైద్యురాలు అంబికకు ఫోన్ ద్వారా తెలియజేసింది. దీంతో ఆమె పేషెంటును వెంటనే మెరుగైన వైద్యానికి తరలించాలని సూచించారు. దీంతో రజితను అంబులెన్సులో జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ ప్రైవేటు దవాఖానలో సిటీ స్కాన్ చేయించడంతో గర్భంలోనే శిశువు మృతి చెందిందని తెలిపారు.

శుక్రవారం ఉదయం రజిత బంధువులు కమ్మర్‌పల్లి దవాఖానకు వచ్చి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సర్పంచ్ గడ్డం స్వామి చేరుకొని సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది ఒక్కరు కూడా లేకుండా దవాఖానను ఆయా మీద ఎలా వదిలేస్తారంటూ నిలదీశారు. ఇన్‌చార్జి వైద్యురాలితో మాట్లాడగా పేషెంటు వచ్చిన సమయానికి లేని స్టాఫ్ నర్సు తనకు సమాచారం ఇవ్వ లేదని తెలిపారు. కమ్మర్‌పల్లిలో ఆరు నెలల్లోనే ఇలాంటి రెండు సంఘటనలు చోటు చేసుకోవడంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ దవాఖానలో పోస్టింగు పొందిన వారు డిప్యుటేషన్‌పై ఇతర దవాఖానకు వెళ్తున్నారని, ఫలితంగా ఇక్కడ సేవలు సరిగ్గా అదడం లేదని రోగులు పేర్కొంటున్నారు. ఇక్కడ ఇద్దరు సూపర్‌వైజర్లు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో వారిని తిరిగి ఇక్కడికే రప్పించాలని ఇటీవల జరిగిన దవాఖాన సమీక్షా సమావేశంలో ఎంపీపీ సమక్షంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...