ఆర్టీసీ పరుగులు


Tue,October 15, 2019 01:12 AM

-అన్ని ప్రాంతాలకు బస్సులను నడుపుతున్న అధికారులు
-ఉభయ జిల్లాల్లో సోమవారం తిరిగిన 392 బస్సులు
-త్వరలోనే బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు : డీటీసీ
-వంద శాతం బస్సులు నడపాలి : మంత్రి పువ్వాడ

నిజామాబాద్ సిటీ: నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో వందశాతం బస్సులను తిప్పేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నది. నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల్లో తాత్కాలిక సిబ్బంది నియామకం కోసం దరఖాస్తులు స్వీకరించి అర్హులను నియమిస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగులు డిపోల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. ఆర్టీసీ సమ్మె పదో రోజు సోమవారం ఉభయ జిల్లాల్లో కొనసాగింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సోమవారం 392 బస్సులు నడిచాయి. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. పలు సంఘాలు సంఘీభావం తెలిపాయి. డిపోల వద్ద సోమవారం ఆర్టీసీ కార్మికులు తమ నిరసనను తెలియజేశారు.

ఉభయ జిల్లాల్లో నడిచిన 392 బస్సులు..
ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలో సోమవారం 392 బస్సులు నడిచాయి. నిజామాబాద్ డివిజన్ పరిధిలో ఆర్మూర్ డిపో పరిధిలో 62 బస్సులు, బోధన్ డిపో పరిధిలో 65, నిజామాబాద్-1 డిపో పరిధిలో 59, నిజామాబాద్-2 డిపో పరిధిలో 59 బస్సులు... మొత్తం 245 బస్సులు నడిచాయి.

కామారెడ్డి జిల్లా పరిధిలో..
కామారెడ్డి డివిజన్ పరిధిలోని బాన్సువాడ డిపోలో 53 , కామారెడ్డి డిపో పరిధిలో 94బస్సులు.. జిల్లాలో మొత్తం 147 బస్సులు నడిచాయి. గత నాలుగు రోజులుగా ఉభయ జిల్లాల్లో అన్ని ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నారు. సమ్మె మొదటి రెండు, మూడు రోజులు కేవలం ఎక్స్‌ప్రెస్ బస్సులు కరీంనగర్, హైదరాబాద్, బోధన్, బాన్సువాడ, నిర్మల్, వరంగల్ పట్టణాలకు మాత్రమే బస్సులను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరింత మంది తాత్కాలిక సిబ్బందిని నియమించుకొని పల్లెవెలుగు బస్సులు షెడ్యూల్ ప్రకారం ప్రయాణికులకు అందుబాటులో ఉంచి నడుపుతున్నారు. ప్రయాణికులు నిత్యం రాకపోకలకు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా రవాణాశాఖ (ఆర్టీఏ) అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రయాణికులు ఏమైన ఇబ్బందులు ఎదురైతే రవాణాశాఖ కార్యాలయంలోని కంట్రోల్‌రూంకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. అన్ని బస్సులో చార్జీల పట్టికతో పాటు కంట్రోల్‌రూం ఫోన్ నంబరును ఏర్పాటు చేశారు. ప్ర యాణికులకు పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నామని, త్వరలోనే అన్ని సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ సోలోమాన్ తెలిపారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...