తెలంగాణలో కలపండి


Wed,September 18, 2019 01:22 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ప్రగల్భాలు పలుకుతున్న కమలనాథుల అసలు బండారం బయటపెట్టారు మరాఠా నేతలు. బీజేపీ పాలిత మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కు చెందిన మరాఠా నేతలు కొందరు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నేతృత్వంలో మంగళవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసి తమ గోడు వెలిబుచ్చారు. ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ఆ నాయకులు కొనియాడారు. తమకూ ఇవే పథకాలు అమలు చేయాలని అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకుండా పోయిందని వివరించారు. తమ ప్రాంతాన్ని తెలంగాణలో విలీ నం చేసుకోవాలని మరోమారు విజ్ఞప్తి చేశారు. నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్నివర్గాల ప్రజలతో కలిసి నిర్వహించిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి మహారాష్ట్రలోని మరాఠా ప్రజలకు కూడా చైతన్య స్ఫూర్తి నింపిందని నయాగావ్, దెగ్లూర్, బోకర్, హిమాయత్‌నగర్, కిన్వట్ నియోజకవర్గాలకు చెందిన మరాఠా నాయకులు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో త్వరలో మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదు నియోజకవ ర్గాల నుంచి టీఆర్‌ఎస్ పార్టీ తరపున తాము పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆ నియోజకవర్గాల మరాఠా నాయకులు సిఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా చర్చించారు. సానుకూలం గా స్పందించారు. త్వర లో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. తనకు మహారాష్ట్ర నుంచి ఇలాంటి ఫోన్లు వస్తున్నాయని, పార్టీలో దీనిపై చర్చ జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు.

గతం నుంచే ఈ విజ్ఞాపన..
కాగా.. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా నాందేడ్ జిల్లాకు చెందిన సర్పంచులు బాజిరెడ్డి గోవర్ధన్‌ను కలిసి తమ బాధను వెల్లడించారు. ఈ విషయాన్ని అప్పటి ఎంపీ కవిత దృష్టికి బాజిరెడ్డి తీసుకెళ్లారు. హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న సందర్భంలో ప్రస్తుతం ఉన్న నాందేడ్ జిల్లాలోని ఈ ప్రాంతాలు తెలంగాణలో అంతర్ భాగంగా ఉండేవి. భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం అయిన తర్వాత కొన్ని ప్రాంతాలను కర్ణాటకలో, మరికొన్ని ప్రాంతాల ను మహారాష్ట్రలో కలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు, సబ్బండవర్ణాల అభివృద్ధే ధ్యేయం గా వారి జీవనప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభు త్వం చేపడుతున్న సంస్కరణలపై మరాఠా నేతలు అబ్బురపడ్డారు. సరిహద్దులో ఉంటూ ఒకప్పుడు తెలంగాణలో అంతర్భాగంగా కొనసాగిన తాము ఇప్పుడు ఈ దుర్భర పరిస్థితుల్లో జీవించాల్సిన దుస్థితి వచ్చిందనే మనోవేదనకు గురయ్యారు. ఇదే విషయా న్ని బాజిరెడ్డి గోవర్ధన్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఆందోళనలు తీవ్రతరం చేశారు. అసెంబ్లీ ఎన్నిక ల్లో టీఆర్‌ఎస్ తరఫున ప్రచారం చేయడం కూడా చర్చనీయాంశమైంది. తెలంగాణ పథకాలు యావత్ దేశం దృష్టికి తీసుకువెళ్లినట్లయింది. అందరినీ ఈ పథకాలు ఆకర్షించి సర్కార్ ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ ప థకాలు, అభివృద్ధిపై సర్వత్రా చర్చకు దారితీసింది. ఎట్టకేలకు అప్పుడు దిగివచ్చిన మహా సర్కార్ ఈ ఐదు నియోజకవర్గాల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.40 కోట్లను మంజూరు చేసింది. ఇందులో రూ.12 కోట్లను వెంటనే విడుదల చేసింది. అయితే ఈ విడుదల చేసిన మొత్తాన్ని ఇంత వరకు ఖర్చు చేయలేదు. దీంతో తమ పరిస్థితి ఇకమారబోదనే కృతనిశ్చయానికి వచ్చిన ఈ ప్రాంత నాయకులు ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.

కేసీఆర్ ఎదుట భవిష్యత్ కార్యాచరణ..
సీఎం కేసీఆర్‌ను కలుసుకొని తమ బాధను చెప్పుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ కూడా ఆయన ముందుంచారు. బీజేపీకి తగిన బుద్ధి చెప్పాల్సిందేనని, టీఆర్‌ఎస్ తరపున నాందేడ్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పోటీచేసి కళ్లు తెరిపించాలనే కృతనిశ్చయం తో ఉన్నామని స్పష్టం చేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. కాగా.. నాందేడ్ జిల్లాకు సంబంధించి ఐదు నియోజకవర్గాల పరిధిలో ని ప్రజలు సైతం సీఎంను కలవాలనే ఆలోచనతో ఉన్న ట్లు తెలుస్తోంది. మరోమారు ఈ అంశం తెర మీదకు రావడం సర్వత్రా చర్చకు దారి తీసింది. బీజేపీ శ్రేణులకు ఈ పరిణామం మింగుడుపడని వ్యవహారంలా మారింది. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి కూడా మహారాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్న విషయాన్ని మరాఠా నేతలు ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతుల సంక్షేమానికి కట్టుబడి, కేంద్ర సహాయం లేకున్నా ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పంటలకు మద్దతు ధర తదితర అనేక పథకాలను అమలు చేస్తూ ప్రజల ఆశీస్సులు నిండుగా అం దుకుంటున్న సందర్భాన్ని అందరికీ తెలియజేస్తున్నా రు. బీజేపీ కళ్లు తెరిపించాలని మరాఠా నేతలు కంకణం కట్టుకున్నారు. సీఎంను కలిసిన వారిలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, టీఆర్‌ఎస్ నాయకుడు చిన్నుదొర, మరాఠా నాయకులు బాబురావు కదం, శంకర్ పటేల్, శివరాం పటేల్, బాబు పటేల్, గణేశ్ పటేల్ తదితరులు ఉన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...