క్రీడా సంబురం


Sun,September 15, 2019 01:59 AM

-చందూర్‌లో జాతీయస్థాయి టార్గెట్ బాల్ క్రీడాపోటీలు ప్రారంభం
-పాల్గొన్న 17 రాష్ర్టాల క్రీడాకారులు
-దేశంలో తొలిసారి పల్లెటూరిలో టోర్నీ నిర్వహణ
-గ్రామస్తుల సహకారంతో పోటీలు
-అలరించిన నృత్య ప్రదర్శనలు
-ప్రారంభించిన జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు

వర్ని: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన క్రీడాకారులు నిరాశ చెందకుండా మళ్ల్లీ గెలవడానికి ప్రయత్నించాలని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. నిజామాబాద్ జిల్లా చందూర్ గ్రామంలో శనివారం 7వ జాతీయస్థాయి జూనియర్ టార్గెట్ బాల్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొదటిసారి ఒక పల్లెటూరిలో టార్గెట్ బాల్ పోటీలు నిర్వహించడం గొప్ప విషయం అని అన్నారు. చందూర్‌లో నిర్వహించడానికి కారణమైన గ్రామానికి చెందిన టార్గెట్ బాల్ క్రీడాకారుడు సాయితేజ, సర్పంచ్ కర్లం సాయిరెడ్డి, గ్రామస్తులను ఆయన అభినందించారు. క్రీడల్లో ఓడినవారు అధైర్య పడవద్దని, భవిష్యత్తులో విజయం కోసం పాటుపడాలని క్రీడాకారులను పిలుపునిచ్చారు. క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. ఇలాంటి టోర్నీలతో క్రీడాకారులు, ప్రాంతాల మధ్య స్నేహపూర్వక వాతావరణం, మంచి సంబంధాలు ఏర్పడతాయని తెలిపారు. ఈ సందర్భంగా దేశభక్తి గీతాలు, కార్గిల్ యుద్ధ్దం, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా విద్యార్థులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. వారిని జడ్పీ చైర్మన్ విఠల్‌రావు అభినందించారు.

దేశంలోనే మొదటిసారి...
జాతీయస్థాయి టార్గెట్ బాల్ క్రీడాపోటీలు ఒక పల్లెటూరిలో నిర్వహించడం దేశంలోనే మొదటిసారి అని తెలంగాణ టార్గెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి రేవంత్‌కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాకేంద్రాలు, రాజధానుల్లో మాత్రమే నిర్వహించారని, తొలిసారిగా ఒక పల్లెటూరిలో జాతీయ స్థాయి టోర్నీ నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఆ గ్రామానికి చెందిన సాయితేజ అంతర్జాతీయ టార్గెట్ బాల్ క్రీడాకారుడు కావడం.. తను అంతర్జాతీయ స్థాయిలో భూటాన్, నేపాల్‌లో దేశం తరపున అంతర్జాతీయ క్రీడా పోటీల్లో ప్రాతినిధ్యం వహించాడు. సాయితేజ నిజామాబాద్ టార్గెట్ బాల్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ క్రీడా పోటీలను తన స్వగ్రామంలో నిర్వహిస్తానని అసోసియేషన్‌ను ఆయన కోరగా.. గ్రామ సర్పంచ్ కర్లం సాయిరెడ్డి, గ్రామస్తుల సహకారంతో చందూర్‌లో 7వ జాతీయ స్థాయి జూనియర్ టార్గెట్ బాల్‌పోటీలు నిర్వహించారు. మూడు రోజుల పాటు గ్రామంలో ఈ టోర్నీ కొనసాగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యాన, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, సీబీఎస్సీ ప్రాంతాలు పాల్గొన్నాయి. 17 బాలుర జట్లు, 14 బాలికల జట్లు టోర్నీలో పాల్గొన్నాయి. ఒక్కో జట్టులో 14 మంది క్రీడాకారులు ఉంటారు. వీరికి గ్రామస్తులు వసతి, సౌకర్యాలు కల్పించారు.

కార్యక్రమంలో టీఆర్‌ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ మేక శ్రీలక్ష్మి, జడ్పీటీసీలు గుత్ప విజయభాస్కర్‌రెడ్డి, నారోజి గంగారం, హరిదాసు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పిట్ల శ్రీరాములు, సర్పంచులు కర్ల సాయిరెడ్డి, సత్యనారాయణ, నాయకులు మేక వీర్రాజు, గోవూర్ హన్మంత్‌రెడ్డి, టార్గెట్ బాల్ ఫౌండర్ ఇండియా సెక్రటరీ సోను శర్మ, తెలంగాణ టార్గెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి రేవంత్ కుమార్, జిల్లా సెక్రటరీ సాయితేజ, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...