పల్లెల ముందడుగుకు..


Fri,September 13, 2019 04:02 AM

-ఊరూరా 30రోజుల ప్రణాళిక అమలు
-పర్యవేక్షిస్తున్న అధికారులు
-భాగస్వాములవుతున్న ప్రజాప్రతినిధులు

వర్ని : 30 రోజుల గ్రామ పంచాయతీ కార్యాచరణలో భాగంగా రోజువారీ కార్యక్రమాలను నిర్ణీత కాలంలో పూర్తి చేసేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. గురువారం ఆయన చందూర్ మండలంలోని ఘన్‌పూర్, చందూర్, వర్ని మండలంలోని వకీల్‌ఫారంలో చేపడుతున్న గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దీని కోసం గ్రామస్తులకు పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. చెత్తను ఇష్టానుసారంగా వేసేవారికి జరిమానాలు విధించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు, కో-ఆప్షన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు అందరూ కలిసి గ్రామంలోని సమస్యలను గుర్తించి గ్రామస్తుల సహకారంతో పరిష్కార మార్గానికి కృషి చేయాలని అన్నారు. మురుగు కాలువలలో నీరు నిలవకుండా, రోడ్డుపై నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. ప్రత్యేక ప్రణాళికలో రోజువారీ కార్యక్రమాలను అదేరోజు పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక అవసరం అని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామాల్లో గుర్తించిన సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

-గ్రామాలు అపరిశుభ్రంగా ఉంటే షోకాజ్ నోటీసులు..
చందూర్‌లో పర్యటించిన కలెక్టర్ రామ్మోహన్ రావు గ్రామంలో పరిసరాలు అపరిశుభ్రంగా కనిపించడంతో గ్రామ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏ గ్రామంలో పరిసరాలు అపరిశుభ్రంగా కనిపించినా సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చే యాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ భవనాలు, పాఠశాలల వద్ద అపరిశుభ్రం ఉండకూడదని, గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులో వేయాలని సూచించారు. గ్రామంలో వంగిన, శిథిలావస్థలో ఉన్న కరెంట్ స్తంభాలు తొలగించి వెంటనే కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాన్ని శుభ్రం చేసి ఫొటోలు ఎప్పటికప్పుడు పంపించాలన్నారు. కలెక్టర్ వెంట వర్ని స్పెషల్ అధికారి ఉప కమిషనర్ లేబర్ చతుర్వేది, ఎంపీడీవో వేణుగోపాల్, తహసీల్దార్ నారాయణ, స్పెషల్ అధికారులు ఉన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...