హెల్మెట్...డూప్లికేట్...


Thu,September 12, 2019 04:50 AM

- కొత్త రవాణా చట్టం అమలుతో పెరిగిన గిరాకీ
-నాసిరకం హెల్మెట్లు అంటగటుతున్న వ్యాపారులు


నిజామాబాద్ క్రైం : కొత్త రవాణా చట్టం అమలులోకి రావడంతో వాహనదారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు కట్టాల్సి ఉండడంతో జాగ్రత్తలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హెల్మెట్ల విక్రయాలకు గిరాకీ ఏర్పడింది. దీనిని అనువుగా మార్చుకొని వ్యాపారులు నాసిరకం హెల్మెట్లు వాహనదారులకు అంటకట్టి సొమ్ముచేసుకుంటున్నారు. ఐఎస్‌ఐ గుర్తింపు కలిగి నాణ్యమైన బ్రాండెడ్ హెల్మెట్ ధర మార్కెట్‌లో రూ.1000 నుంచి రూ.1600 ధరల్లో లభిస్తున్నాయి. రోడ్ల వెంట విక్రయించే వ్యాపారులు ఐఎస్‌ఐ పేరు చెప్పి నాసిరకం హెల్మెట్లు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇవి కొనుగోలు చేసిన వాహనదారులు మోసపోవడంతో పాటు ప్రమాదాల సమయంలో రక్షించలేక పోతున్నాయి.

హెల్మెట్ తప్పక అవసరం...
రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న వారిలో తలకు బలమైన గాయాలు కావడంతోనే మృతి చెందినట్లుగా పలు సర్వేలు, వైద్యుల నిర్ధారణలో తేలాయి. రోడ్డు ప్రమాద ఘటనలపై పంచనామా నిర్వహించిన పోలీస్ అధికారులు సైతం తమ రిపోర్టుల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు తలకు దెబ్బతగలడం కారణంగానే దుర్మరణం చెందినట్లు పేర్కొన్నారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం, కోర్టులు ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధన విధించాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీవో ఆధికారులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు. హెల్మెట్ ధరించిన వ్యక్తి రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో క్షేమంగా బయటపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త వాహన చట్టంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపిన వారికి రూ.1000 జరిమానా విధించాలని పొందుపరిచింది. దీంతో ద్విచక్ర వాహనదారులు జరిమానాల బారి నుంచి తప్పించుకునేందుకు తప్పనిసరి పరిస్థితిలో హెల్మెట్లను కొనుగోలు చేస్తున్నారు.

సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు...
వేయి రూపాయల జరిమానా నుంచి తప్పించుకునేందుకు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో హెల్మెట్లకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకొని ఉత్తరాదికి చెందిన ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు జిల్లాకు వచ్చి రోడ్లపక్కన, ప్రధాన కూడళ్లలో హెల్మెట్లు విక్రయిస్తున్నారు. ఎలాంటి గుర్తింపు లేని కంపెనీల పేరుతో నాసిరకం హెల్మెట్లను తెచ్చి జిల్లాలో జోరుగా విక్రయిన్నారు. ఇప్పటి వరకు ఎన్నడూ వినపడని కంపెనీల పేరుతో తయారుచేసిన హెల్మెట్‌లకు ఐఎస్‌ఐ ముద్రవేసి, వాటినే అసలైన కంపెనీ హెల్మెట్లుగా విక్రయిస్తున్నారు. నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూర్, బోధన్ డివిజన్‌ల పరిధిలో రోడ్ల పక్కన విక్రయిస్తున్నారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. వీరు విక్రయించే హెల్మెట్‌కు సంబంధించి కొనుగోలు సమయంలో ఎలాంటి బిల్లు, రశీదు ఇవ్వడం లేదు. ఐఎస్‌ఐ గుర్తింపు కలిగి నాణ్యమైన బ్రాండెడ్ హెల్మెట్ ధర మార్కెట్‌లో రూ.1000 నుంచి రూ.1650 ధరల్లో లభిస్తుండగా.. ఈ వ్యాపారులు మాత్రం రూ.450 నుంచి రూ.600 ధరల్లో ఐఎస్‌ఐ పేరు చెప్పి నాసిరకం హెల్మెట్లు విక్రయిస్తున్నారు. ఈ హెల్మెట్లు ఎంత వరకు నాణ్యతతో కూడివనో పరిశీలించకుండానే వాహనదారులు తక్కువ ధరకు వస్తుందని ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. హెల్మెట్ నాసిరక కావడంతో ఏదైనా ప్రమాదం జరిగితే తలకు దెబ్బతగలదనే గ్యారెంటీ లేకుండా పోయింది. దీని గురించి వాహనదారులు ఆలోచించడంలేదు. తక్కువ ధరకు వస్తుందని అనామక బ్రాండ్ల పేరిట విక్రయిస్తున్న హెల్మెట్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వాహనదారుల ప్రాణాలకు భద్రత లేకుండా పోతున్నది.

రోడ్ల వెంట వ్యాపారులు విక్రయిస్తున్న ఐఎస్‌ఐ మార్క్‌తో తయారుచేసిన హెల్మెట్ కేవలం రూ.450 నుంచి 600 ధరల్లో లభిస్తున్నాయి. అసలైన ఐఎస్‌ఐ బ్రాండెండ్ కంపెనీ హెల్మెట్ రూ.1600 నుంచి 1650 ధరల్లో లభిస్తున్నాయి. రోడ్ల వెంట విక్రయించే ఒక్కో హెల్మెట్‌కు.. షాపుల్లో విక్రయించే బ్రాండెడ్ ఐఎస్‌ఐ హెల్మెట్‌కు రూ.1,000 వరకు ధరలో వ్యత్యాసం ఉందంటే ఆలోచించాల్సి విషయం. రోడ్ల వెంట విచ్చలవిడిగా నాసిరకం హెల్మెట్లను విక్రయిస్తుంటే సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాహనదారులకు హెల్మెట్ కొనుగోలుకు సంబంధించి పోలీస్, రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...