జన్మ ధన్యమైంది


Wed,September 11, 2019 12:31 AM

-ఎస్సారెస్పీకి పునరుజ్జీవం పోసిన
సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకోలేనిది
- ఈ జన్మకు ఇది చాలు.. కల సాకారమైంది
-కేసీఆర్‌ లాంటి సీఎం దేశంలోనే లేరు
- నిరంతరం రైతుల గురించే ఆయన ఆలోచనలు
- రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
-ఎస్సారెస్పీ వద్ద కాళేశ్వర గంగకు పూజలు చేసి
పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి
- కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం
-సీఎం, మాజీ ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి
నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు పునరుజ్జీవం పోసిన సీఎం కేసీఆర్‌ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిదని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పునరుజ్జీవ పథకంతో ఎస్సారెస్పీకి తాకిన కాళేశ్వరం జలాలకు మంగళవారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన రైతులనుద్దేశించి ప్రసగించారు. ఎస్సారెస్పీకి పూర్వ వైభవం పోసిన సీఎం కేసీఆర్‌, మాజీ ఎంపీ కవితకు రైతుల పక్షాన రుణపడి ఉంటామన్నారు. సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. ఈ సందర్భం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని నిద్రలేని రాత్రులు గడిపానని మంత్రి పేర్కొన్నారు. పునరుజ్జీవం పథకం ద్వారా కాళేశ్వరం జలాలు శ్రీరాంసాగర్‌ ప్రాజక్టు గడపను ముద్దాడిన వేళ మరువలేనిదన్నారు. దిగువన 200 కిలోమీటర్ల దూరం నుంచి కాళేశ్వరం జలాలు ఎదురెక్కి ప్రవహిస్తూ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును తాకడం మామూలు విషయం కాదన్నారు. ఈ దృశ్యాన్ని చూస్తుంటే నోట మాట రావడం లేదని తెలిపారు. అందరి జీవితాలను, ఎన్నో కుటుంబాలను బాగుచేసే గొప్ప పథకం పునరుజ్జీవం పథకం మని మంత్రి పేర్కొన్నారు. వర్షాలు లేక, ప్రాజెక్టులోకి నీళ్లురాక రైతులు మొగులుకు ముఖం పెట్టి బీరిపోయి చూసే దుస్థితిని దూరం చేసేందుకే సీఎం కేసీఆర్‌ పునరుజ్జీవం పథకాన్ని సృష్టించి పూర్తి చేయించారన్నారు. నిజామాబాద్‌ జిల్లా రైతులకు గొప్ప వరం సీఎం కేసీఆర్‌ అందించారన్నారు. కోటి ఎకరాలకు నీరిచ్చేందుకు మూడున్నర ఏండ్ల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచనలను సీఎం కేసీఆర్‌ చేసింది మొదలుకొని, ఆయన ఏండ్ల తరబడి ఎన్నో గంటలు సాగించిన మథనాన్ని దగ్గరగా ఉండి చూడడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. రీడిజైన్ల కోసం ఎన్నో రాత్రులు సీఎం కేసీఆర్‌ నిద్రలేకుండా గడిపారని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

దేశంలో కేసీఆర్‌ లాంటి సీఎం లేరు...
రైతులు బాగుపడడానికి ఖర్చుకు వెనకాడకుండా నీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్న కేసీఆర్‌ లాంటి సీఎం దేశంలో ఎక్కడా లేరని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తామని, శ్రీరాంసాగర్‌కు పునరుజ్జీవం పథకం చేస్తామని ఎన్నికల్లో చెప్పలేదని, కేవలం రైతు అనే ఏకైక కోణంతో ఆయన సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారని తెలిపారు. రైతులను పార్టీల కోణంలో చూడడం తగదని, రైతులను విస్మరిస్తే ఏ పార్టీలు మనుగడ సాగించలేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును, ఎస్సారెస్పీకి పునరుజ్జీవం పథకాన్ని చేపట్టినప్పుడు ఎందరో, ఎన్నెన్నో విమర్శలు చేసినా.. సహనంతో భరించమే తప్ప వెనకడుగు వేయలేదన్నారు. నీళ్లు తెచ్చుకోవడం కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు అయినా ఖర్చు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులు బాగుపడే ప్రాజెక్టుల నిర్మాణాలను చూసి ఓర్వలేని వారు, ఎంత మొత్తుకున్నా ప్రాజెక్టులను మాత్రం ఆపేది లేదని, పంటలకు నీళ్లు ఇచ్చుకోవాల్సిందేనని కృతనిశ్చయంతో పనిచేశామన్నారు. ఒక నాయకుడు పునరుజ్జీవం పథకంపై చేసిన విమర్శలను చూస్తే ఆయనపై జాలి వేసిందన్నారు. మోసేటోడికే బరువు తెలుస్తుంది తప్ప, గట్టున నిలబడి చూసేటోడికి బరువు ఎలా తెలుస్తుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంటే ఓపికతో వ్యవహరించకుండా తొందరెందుకు అని సదరు నాయకుడిని విమర్శించారు.

ధర్మం గెలిచింది..
ప్రాజెక్టులను ఆపాలని, పునరుజ్జీవం పథకాన్ని అడ్డుకోవాలని ఎన్ని కుట్రలు చేసినా.. న్యాయం, ధర్మమే గెలిచిందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రివర్స్‌ పంపింగ్‌ పథకం ద్వారా కాళేశ్వరం నీళ్లు 200 కి.మీ ఎదురేగి వరద కాలువలో ఎస్సారెస్పీ గేట్లను తాకి సిద్ధంగా ఉన్నాయన్నారు. అవసరమైన విధంగా ఈ జలాలను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి ఎంత జలాలు వస్తున్నాయి అనే దాన్ని బట్టి ఈ నీటిని వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే రాజీనామా చేయమంటారా? అని విమర్శించారు. ఎన్నికలు ముగిసి ఆరునెలల దాటిందో లేదో రాజీనామా అనే మాటల వరకు వెళ్లడం హాస్యాస్పదమని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగునీటిని అందించడానికేనని స్పష్టం చేశారు. మిడ్‌మానేరుకు కాళేశ్వరం నీటిని ఇవ్వడాన్ని విమర్శించడం బుద్ధి, జ్ఞానం లేనివారి మాట్లాడే మాటలని విమర్శించారు. పునరుజ్జీవం పథకం, కాళేశ్వరం ప్రాజెక్టు ఓట్ల కోసం చేపట్టలేదని... అందరి బాగు కోసం, ఆత్మ సంతృప్తి కోసమన్నారు. ఏ నాయకుడైనా కొంత కాలమే అధికారంలో ఉంటారని, వంద ఏండ్లు అధికారంలో ఉండలేరన్నారు. ఆ కొంత కాలంలో రైతుల కోసం, ప్రజల కోసం ఎంత బాగా పనిచేశారనేదే ముఖ్యమన్నారు. 90శాతం ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నందున, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఎంతో అవసరమన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకాన్ని విజయవంతం చేసి ఎస్సారెస్పీకి నీరందించేలా సిద్ధం చేసినట్లు చెప్పారు. తన జన్మకు ఇది చాలని, జన్మ సార్థకమైందని మంత్రి పేర్కొన్నారు.

కాళేశ్వరం అద్భుత సృష్టి అని గవర్నర్‌ కొనియాడారు...
రాష్ర్టానికి నూతనంగా వచ్చిన గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ తెలంగాణ రాష్ట్రం గురించి, కేసీఆర్‌ పాలన గురించి చేసిన ప్రశంసలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌ రాష్ట్రంగా, కాళేశ్వరం ప్రాజెక్టు మనిషి సృష్టించిన గొప్ప ప్రాజెక్టు అని గవర్నర్‌ చేసిన అభినందనలను గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌ తలపెట్టిన ప్రాజెక్టులతో కాళేశ్వరం జలాలు ఉత్తర తెలంగాణ ప్రజల కళ్లముందు కనిపిస్తున్నాయన్నారు. పునరుజ్జీవం పథకంతో ఎస్సారెస్పీలో నీళ్లు నింపుకుంటూ భూములను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. ఈ పథకంతో గుత్ప, అలీసాగర్‌ కింద 90వేల ఎకరాలకు పుష్కలంగా నీరందనుందన్నారు. కాకతీయ కాలువ, వరద కాలువలు నిండుకుండల్లా ఉంటాయని తెలిపారు. ఆర్మూర్‌, బోధన్‌, బాన్సువాడ, వర్ని, కోటగిరి మండలాల్లో గుత్ప, అలీసాగర్‌ కింద పంటలకు నీటి కొరత తీరిపోతుందన్నారు. కాకతీయ కాలువ కింద ఏర్గట్ల, తాళ్ల రాంపూర్‌, బట్టాపూర్‌ వరకు సాగునీరు పుష్కలంగా ఉంటుందన్నారు. లక్ష్మి కాలువ కింద పంటలకు సాగునీరు పుష్కలంగా ఉంటుందని తెలిపారు. చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతలను ఇప్పటి వరకు 30 నుంచి 40 రోజులు మాత్రమే నడుపుకునే వాళ్లమని గుర్తు చేశారు. ఇక మీదట రెండు వందల రోజులు నడుపుకోలుగుతామని తెలిపారు. నవాబు, వేంపల్లి, బోదేపల్లి లిప్టులకు నీటి కొరత శాశ్వతంగా తీరిపోతుందన్నారు. చిట్టాపూర్‌కు ఈ పథకం నీళ్లు అందుతాయని, అవసరమైతే లిప్టు ద్వారానైనా అందిస్తామన్నారు. ఎస్సారెస్పీ కింద 1.30 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంతోన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకం పూర్తయినందున, ఇక తర్వాత మిషన్‌ కాళేశ్వరం ప్యాకేజీ -21 అని చెప్పారు. వేల్పూర్‌, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, భీమ్‌గల్‌ మండలాలతో పాటు నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి, ఆర్మూర్‌ నియోజకవర్గంలోని కొంత ప్రాంతానికి సాగునీటిని అందించే ఈ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయని తెలిపారు. ప్యాకేజీ -21 ద్వారా బాల్కొండ నియోజకవర్గంలో 78వేల ఎకరాలకు సాగునీళ్లు అందుతాయన్నారు. ఈ పథకం కోసం సీఎం కేసీఆర్‌ రూ.2,750 కోట్లు కేటాయించారన్నారు. ఇందులో బాల్కొండ నియోజకవర్గానికి రూ. 900 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పనులు సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో ఏడాదిన్నర లోపు పూర్తవుతాయని తెలిపారు.

ఉద్వేగానికి లోనైన మంత్రి...
పునరుజ్జీవం పథకం ద్వారా ఎస్సారెస్పీ గడపను తాకిన కాళేశ్వరం జలాలను చూసి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. పట్టువస్ర్తాలు, గాజులు, పసుపు, కుంకుమ సమర్పించిన అనంతరం ప్రసంగిస్తున్న సమయంలో మంత్రి ఉద్వేగానికి లోనయ్యారు. ఎన్నో రైతు కుటుంబాల బతుకులను బాగుచేసే కాళేశ్వరం జలాలు మనచెంతకు చేరిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నానంటూ దాదాపు భావోద్వేగానికి లోనయ్యారు. తరతరాలకు తరగని జల సంపదను అందించిన సీఎం కేసీఆర్‌ రుణాన్ని తీర్చుకోలేనని పేర్కొంటున్నప్పుడు ఆయన కళ్లు చెమర్చాయి. ఇంజినీర్ల కృషిని కూడా ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. కార్యక్రమం ఆద్యాంతం కాళేశ్వరం జలాలను చూస్తూ ఆయన పులకించిపోయారు. ప్రసంగంలోనూ పదేపదే సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు కేసీఆర్‌ చిత్రపటానికి ఆయన క్షీరాభిషేకం చేశారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...