పూర్వవైభవం దిశగా..


Wed,September 11, 2019 12:28 AM

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆర్గానిక్‌ కెమిస్ట్రీతో 1972లో ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ పీజీ కళాశాలగా కొనసాగిన బీటీఎస్‌ కాలక్రమేణా తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్‌ క్యాంపస్‌గా రూపాం తరం చెందింది. నాటి నుంచి క్యాంపస్‌లో న్యాయ శాస్త్రం(ఎల్‌ఎల్‌బీ), ఎంఏ - తెలుగు, ఎమ్మెస్సీ - జియో ఇన్ఫర్మాటిక్స్‌, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఏ - ఇంగ్లిష్‌, ఎమ్మెస్సీ - ఫిజిక్స్‌, ఎంఏ - ఎకనామిక్స్‌, బీబీఎం కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వందలాది మంది విద్యార్థులు క్యాం పస్‌లో విద్యనభ్యసించారు. అరకొర వసతుల నడుమే ఎనిమిది కోర్సులు కొనసాగాయి. పలు కారణాలరీత్యా ఇక్కడి కోర్సులను మెయిన్‌ క్యాంపస్‌కు తరలించడంతో ప్రస్తుతం ఎంఎస్‌డబ్ల్యూ, ఫిజిక్స్‌, జియో ఇన్ఫర్మాటిక్స్‌, కెమిస్ట్రీ కోర్సులే నడుస్తున్నాయి. తరలించబడిన కోర్సులతో బోసిపోయిన సౌత్‌ క్యాంపస్‌ పరిస్థితిపై ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారు. దశాబ్దాల చరిత్ర గల ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పెద్దలతో చర్చించి తాజాగా మూడు పీజీ కోర్సులను మంజూరు చేయించారు. ఎంఏ తెలుగు, రాజనీతి శాస్త్రం, చరిత్ర విభాగాల రాకతో సౌత్‌ క్యాంపస్‌లో మొత్తం ఏడు కోర్సులు అందుబాటులోకి వచ్చినట్లు అయ్యింది. కొత్త కోర్సులు ఈ ఏడాది వి ద్యా సంవత్సరం నుంచే ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించిన కౌన్సిలింగ్‌ ప్రక్రియను ప్రత్యేకంగా చేపట్టనున్నారు. సౌత్‌ క్యాంపస్‌ అభివృద్ధితో కామారెడ్డి జిల్లాతో పాటుగా పక్కనే ఉన్న మెదక్‌, రాజన్న సిరిసిల్లా జిల్లాలకు కల్పతరువుగా మారనుంది.

సౌత్‌ క్యాంపస్‌లో ఆధునిక వసతులు...
బీటీఎస్‌కు సౌత్‌ క్యాంపస్‌ తరలించిన సమయంలో అరకొర వసతులే ఉండేవి. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లుగా భవనాలే లేకపోయేవి. యువతులకు వసతి సమస్య ఏర్పడిన సందర్భాలున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంత రం సీఎం కేసీఆర్‌ కృషితో విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి నోచుకున్నాయి. ఇందులో భాగంగా టీయూ సౌత్‌ క్యాంపస్‌లో అధునాతన భవనాలు అందుబాటులోకి వచ్చాయి. రూ.14 కోట్లతో ఎంఎస్‌డబ్ల్యూ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జియో ఇన్ఫర్మాటిక్స్‌ కోర్సులకు శాశ్వత భవనాలు నిర్మించారు. పరిపాలన భవనం కూడా అందుబాటులోకి రావడంతో అధ్యాపకులకు ఇబ్బందులు తొలగాయి. విశాలమైన గదులతో ప్రస్తుతం నూతన భవనాల్లో విద్యా బోధన సాగుతోంది. సైన్స్‌ సబ్జెక్టులకు ల్యాబ్‌లు సైతం తీర్చిదిద్దారు. ఫిజిక్స్‌, కెమెస్ట్రీ విభాగాలకు, జీఐఎస్‌ విభాగానికి ప్రత్యేకం గా ల్యాబ్‌లు ఉన్నాయి. రెండేండ్ల క్రితమే యువతీ, యువకులకు రెండు వేర్వేరు వసతి గృహాలను నిర్మించారు. సౌత్‌ క్యాంపస్‌లో ప్రస్తుతం 240 మంది ఉన్నారు. ఇందులో 170 మంది వసతి గృహాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు.

అంతా ఆగమాగం...
తెలంగాణ ప్రభుత్వం కృషితో అన్ని రకాల వసతులతో శోభిల్లుతున్న సౌత్‌ క్యాంపస్‌లో అధ్యాపకుల తీరు విమర్శలకు దారి తీస్తుంది. క్యాంపస్‌లో అకాడమిక్‌ కన్సల్టెంట్లు, ప్రొఫెసర్లు గ్రూపులుగా విడిపోయారు. మరోవైపు కొంత మంది ప్రొఫెసర్ల మధ్య ఆధిపత్య పోరుతో యూనివర్సిటీ అనుబంధ క్యాంపస్‌లో రాజకీయాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును పక్కన పెట్టి వ్యక్తిగత కుమ్ములాటలకు కొంత మంది అధ్యాపకులు దిగుతుండడంతో విద్యాబుద్ధుల కోసం వచ్చిన వారికి నిరాశ ఎదురవుతోంది. క్యాంపస్‌లో అన్ని విభాగాల్లో బయో మెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తామని గతంలో యూనివర్సిటీ పెద్దలు ప్రకటించారు. ఈ విధానం సరిగా అమలు కాకపోవడంతో పరిస్థితి ఇష్టారాజ్యంగా మారింది. బయో మెట్రిక్‌ను విద్యార్థులకు కచ్చితంగా పరిమితం చేశారు. అధ్యాపకులకు సైతం బయో మెట్రిక్‌ విధానం వారి వెసులుబాటుకు తగ్గట్లుగా మార్చుకున్నారు. ఈ విషయంపై టీయూ వీసీ, రిజిస్ట్రార్‌లకు గతంలో ఫిర్యాదులు వెళ్లాయి. అయినప్పటికీ వ్యవస్థను దారిలో పెట్టే నాథుడు కరువయ్యారు. రిజిస్ట్రార్‌ బలరాములు స్వయంగా సౌత్‌ క్యాంపస్‌ను ఒకటి రెండు సార్లు సందర్శించినా పరిస్థితి మాత్రం మారకపోవడం విడ్డూరంగా మారింది. బయో మెట్రిక్‌ విధానాన్ని విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికి తప్పనిసరిగా వర్తింపజేస్తే వ్యవస్థ అంతా దారిలోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే జవాబుదారీతనం దెబ్బతినే ఆస్కారం ఉంది.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...