రైతులు పరేషాన్‌ కావొద్దు


Wed,September 11, 2019 12:28 AM

నిజామాబాద్‌ సిటీ / భీమ్‌గల్‌ : జిల్లాలో రైతులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.గోవింద్‌ తెలిపారు. మంగళవారం జిల్లాకు చేరుకున్న యూరియాను జేడీఏ గోవింద్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున ఫర్టిలైజర్స్‌ కంపెనీకి చెందిన 1050 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందన్నారు. వీటిని లారీల ద్వారా జిల్లాలోని అన్ని మండల కేంద్రంలో ఉన్న పీఏసీఎస్‌కు తరలించి రైతులకు సరఫరా చేస్తామని తెలిపారు. రైతులందరికీ యూరియాను సరఫరా చేస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విడుతల వారీగా యూరియాను ప్రభుత్వం పంపిస్తోందని తెలిపారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

రైతులకు కావాల్సినంత యూరియా నిల్వలు
రైతులకు నేరుగా యూరియా సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారని, రైతులకు కావాల్సినంత యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌ అన్నారు. భీమ్‌గల్‌ సహకార సంఘంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు యూరియా గురించి ఆందోళన చెందవద్దన్నారు. ఈ వర్షాకాలం జిల్లాలో వేసిన పంటలకు 60వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉందన్నారు.

అందులో ఇప్పటి వరకు సొసైటీ, ప్రైవేటు డీలర్ల ద్వారా 58వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అందజేశామన్నారు. రైతులు యూరియాను ఎక్కువ మోతాదులో ఉపయోగించడంతో తెగుళ్ల ఉధృతి ఎక్కువయ్యే అవకాశాలున్నాయన్నారు. రైతులు వ్యవసాయశాఖ అధికారుల సూచనల ప్రకారం యూరియాను ఉపయోగించుకోవాలన్నారు. ఎకరాకు వందకేజీల యూరియాను మాత్రమే చల్లుకోవాలని సూచించారు. భీమ్‌గల్‌ మండలానికి ఇప్పటి వరకు 2224 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని, మరో 700 మెట్రిక్‌ టన్నుల యూరియా రావాల్సి ఉందన్నారు.

రైతులు అవసరం మేరకే యూరియాను కొనుగోలు చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఈ సారి వరి సాగు రెండున్నర లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు వెల్లడించారు. ఇది గతంలో కంటే 120శాతం ఎక్కువ అన్నారు. మొక్కజొన్న సాగు 36వేల ఎకరాలు కాగా, సోయా ఈసారి తగ్గి కేవలం 30వేల ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఏడీఏ వెంకటరవీందర్‌, ఏవో సంజీవ్‌కుమార్‌, సీఈవో కేసరి అశోక్‌గౌడ్‌, ఏఈవోలు లక్‌పతి, అరవింద్‌ ఉన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...