శ్రీరాంసాగర్‌కు పునరుజ్జీవం


Tue,September 10, 2019 12:55 AM

-జీరో పాయింట్‌కు చేరిన కాళేశ్వరం జలాలు
-నేడు పూజలు చేయనున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
-రైతుల్లో హర్షాతిరేకాలు

కమ్మర్‌పల్లి/నమస్తే తెలంగాణ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టును కాళేశ్వరం జలాలతో నింపి పూర్వ వైభవం కల్పించడం కోసం, దశాబ్దాలుగా ఎస్సారెస్పీ కింద ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలను శాశ్వతంగా తీర్చడం కోసం రూ.1080 కోట్లతో చేపట్టిన ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకం లక్ష్యానికి చేరుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ -1 నుంచి గాయత్రి సర్జిపూల్‌లో బాహుబలి మోటార్ల ద్వారా వరద కాలువకు ఎత్తిపోసిన కాళేశ్వరం జలాలు మొదటి పంపుహౌస్ అయిన రాంపూర్ పంపుహౌస్‌కు ఐదు రోజుల క్రితం చేరుకున్నాయి. రాంపూర్ పంపుహౌస్‌లో మోటార్లకు వెట్న్ నిర్వహించడంతో గత శనివారం రెండో పంపుహౌస్ అయిన రాజేశ్వర్‌రావుపేట్ పంపుహౌస్‌కు జలాలు చేరాయి. దీంతో శనివారం రాజేశ్వర్‌రావుపేట్ పంపుహౌస్‌లో నాలుగు మోటార్లకు విజయవంతంగా వెట్న్ పూర్తి చేశారు.

శనివారమే నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన జలాలు వరద కాలువలో ఉల్టా ప్రవహిస్తూ ఎస్సారెస్పీకి 5 కి.మీ దూరంలో వేంపల్లి గ్రామం వరకు చేరాయి. సోమవారం మరోసారి రాజేశ్వర్‌రావుపేట్ పంపుహౌస్‌లో మరో రెండు మోటార్లను మధ్యాహ్నం నుంచి నడపడం ప్రారంభించారు. దీంతో వరద కాలువలో మరోసారి జలాల వరద మొదలైంది. సాయంత్రానికల్లా వరద వేగం పుంజుకున్నది. చీకటి పడే సమయానికి ఎస్సారెస్పీ వద్ద జీరో పాయింట్‌కు నీళ్లు తాకాయి. రైతులు పునరుజ్జీవం పథకంపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. నీళ్లు జీరో పాయింట్ వద్ద గేట్లను తాకి క్రమంగా నిండుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్సారెస్పీ నిర్మాణ సమయంలో ఎన్నో జిల్లాల్లో గ్రామాలు ముంపునకు గురయ్యాయి. కానీ ఎస్సారెస్పీ ద్వారా జిల్లాకు ఆశించిన సాగునీటి ప్రయోజనం అందలేదు. జిల్లాలో ప్రధాన కాలువలైన కాకతీయ, లక్ష్మీ కింద, ఎత్తిపోతల కింద 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. లక్ష్యం మేరకు సాగునీరు అందని పరిస్థితినే రైతులు ఎదుర్కొంటూ వచ్చారు. ఎగువన మహారాష్ట్రలో తరచూ తలెత్తే వర్షాభావ పరిస్థితులు, గోదావరిపై మహారాష్ట్ర సర్కారు వరుస పెట్టి నిర్మించిన డ్యాంల కారణంగా ఎస్సారెస్పీకి నీటి లభ్యత తగ్గిపోతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆయకట్టు రైతుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొన్నది. ఎస్సారెస్పీకి పూర్వ వైభవం తీసుకొస్తే తప్ప ఆయకట్టు కష్టాలు తీరవని సీఎం కేసీఆర్ గుర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జలాలను ఎస్సారెస్పీకి అందించడమే ఏకైక మార్గమని గుర్తించిన కేసీఆర్ 2017లో ఇందుకు శ్రీకారం చుట్టారు. కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీకి తీసుకురావాలంటే జలాలను పళ్లం నుంచి ఎత్తుకు ఎక్కించాలి.

ఇలా సుమారు 200 కి.మీ దూరంలోని ఎస్సారెస్పీకి నీటిని పైపైకి ప్రవహింపజేయాలి. రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఎత్తిపోతలే శరణ్యమని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సారెస్పీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కూడా ఎత్తిపోతలే మార్గమని భావించి పునరుజ్జీవం (రివర్స్ పంపింగ్) పథకాన్ని రూపొందించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో తన ఆలోచనలను పంచుకుంటూ పునరుజ్జీవం పథకానికి రూపకల్పన చేసి రూ. 1080 కోట్లతో 2017, ఆగస్టు 10న ఎస్సారెస్పీ వద్ద శంకుస్థాపన చేశారు. ఆయకట్టు కింద రైతులు దశాబ్దాలుగా సాగునీరు రామచంద్ర అంటూ ఎదురుచూస్తున్న వైనాన్ని గమనంలో ఉంచుకున్న సీఎం కేసీఆర్ ముందుగా వీలైనంత నీటిని ఎస్సారెస్పీకి అందించాలని భావించారు. పునరుజ్జీవం పథకం ద్వారా రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఏటా 60 టీఎంసీలు అందించడం లక్ష్యమైనప్పటికీ రైతులకు ముందుగా నీరందించడం కోసం అర టీఎంసీ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని గత జనవరిలో ఆదేశించారు. ఈ మేరకు పనులు పూర్తి చేయించే బాధ్యతను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి అప్పగించారు. నాటి నుంచి మంత్రి ప్రశాంత్‌రెడ్డి పునరుజ్జీవం పథకం పనులను, పంపుహౌస్‌లను స్వయంగా సందర్శించి పరిశీలిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి లక్ష్యం మేరకు అనుకున్న విధంగా రాంపూర్ పంపుహౌస్‌లో, రాజేశ్వర్‌రావు పేట్ పంపుహౌస్‌లో కలిపి రోజుకు అర టీఎంసీ చొప్పున జలాలను ఎత్తిపోసేలా పనులు పూర్తి చేయించారు. దీంతో కాళేశ్వరం జలాలు జిల్లాకు చేరి ఎస్సారెస్పీ జీరో పాయింట్‌ను తాకాయి.

నేడు ప్రత్యేక పూజలు చేయనున్న మంత్రి..
రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం జీరో పాయింట్ వద్ద జలాలకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. దీంతో అధికారులు జీరో పాయింట్ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈఈ సుధాకిరణ్ సోమవారం సాయంత్రం జీరో పాయింట్ వద్ద పరిస్థితిని పరిశీలించారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...