గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లుపూర్తి చేయాలి


Tue,September 10, 2019 12:49 AM

నిజామాబాద్ సిటీ/నిజామాబాద్ క్రైం: నగరంలో ఈ నెల 12న నిర్వహించే గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. శాంతియుత వాతావరణంలో, మత సామరస్యంతో గణేశ్ నిమజ్జనం పూర్తయ్యేలా అందరూ సహకరించాలని అన్నారు. నగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని సోమవారం పోలీస్ కమిషనర్ కార్తికేయ, మున్సిపల్ కమిషనర్ జాన్‌సాంసన్ ఇతర శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. శోభాయాత్ర రథం ప్రారంభించే దుబ్బా ప్రాంతం నుంచి హమాల్‌వాడీ చౌరస్తా, గోశాల, గంజ్, గాంధీ చౌక్, నెహ్రూపార్క్, గాజుల్‌పేట్, గురుద్వార్, పెద్దబజార్‌చౌరస్తా, గోల్‌హనుమాన్ చౌరస్తా, పూలాంగ్ చౌరస్తా మీదుగా వినాయకుల బావి వరకు శోభాయాత్ర కొనసాగే రోడ్లను పరిశీలించి రోడ్లపై గుంతలు పూడ్చాలని, రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాలని సంబంధిత మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. చివరిగా వినాయక నగర్ ప్రాంతంలోని గణపతుల బావిలో పూడిక తీసే పనులను ఆయన పరిశీలించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయకుల రథం వెళ్లేదారిలో అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించడం, గుంతలు పూడ్చడం, శోభాయాత్రలో పాల్గొనే ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం, అవసరమైన చోట జనరేటర్ ఏర్పాటు చేయడం, విద్యుత్ దీపాలు తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మూడు అడుగులలోపు ఎత్తున్న గణేశ్ విగ్రహాలనే వినాయకుల బావిలో నిమజ్జనం చేయాలని సూచించారు. అంతకంటే పెద్ద విగ్రహాలను బాసర గోదావరిలో నిమజ్జనం చేయాలని ఆయన గణేశ్ మండళ్ల ప్రతినిధులకు సూచించారు. బాసరలో అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, అదనపు సీపీ శ్రీధర్ రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్ కుమార్, సార్వజనిక్ గణేశ్ మండలి అధ్యక్షుడు గణేశ్, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, ట్రాన్స్‌కో ,పోలీసు, ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...