నేరుగా గ్రామాలకు యూరియా సరఫరా


Mon,September 9, 2019 01:51 AM

-జిల్లాకు ఆదివారం 2,550 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా
-సింగిల్‌ విండోలను తనిఖీ చేసిన జేడీ గోవింద్‌
నిజామాబాద్‌ సిటీ : జిల్లాకు ఇఫ్కో కంపెనీకి చెందిన యూరియా వచ్చింది. ఆదివారం ఉదయం గూడ్స్‌ రైలులో 2,550 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు కావాల్సినంత యూరియా పంపించడానికి సిద్ధంగా ఉందని, రైతులకు యూరి యా కొరత లేకుండా సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. ఇంకా జిల్లాకు యూరియా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆదివారం వచ్చిన యూరియా ను వివిధ ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా జేడీ గోవింద్‌ తన సిబ్బందితో కలిసి పీఏసీఎస్‌ మాక్లూర్‌, డిచ్‌పల్లిలో నిల్వ ఉంచిన యూరియాను పరిశీలించారు.

సీఎం ఆదేశాల మేరకు...
రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియాను వెంటనే గ్రామాలకు సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. డిమాండ్‌కు తగినంత ఎరువులను సంపూర్ణంగా రైతులకు అందజేయాలని, ఇప్పటికే వివిధ నౌకాశ్రయాల్లో ఉన్న స్టాకును రైళ్లు, లారీల ద్వారా జిల్లాకు తెప్పించి, నేరుగా గ్రామాలకే పంపాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాకు కావాల్సినంత యూరియా విడతల వారీగా వస్తోంది. ఆదివారం కొంత వచ్చింది. ఇప్పటికే ఐడీఎల్‌, ఇఫ్కో, సీఐఎల్‌, క్రిబ్‌కో, ఎన్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీలకు యూరియా రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు తెలంగాణకు తెప్పిస్తున్నారు. జిల్లాలో ఏ మండలంలో ఎంత డిమాండ్‌ ఉందో వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు పంపారు. ఈ మేరకు ఆదివారం మొదటి విడతగా 2,550 మెట్రిక్‌ టన్నుల యూరియా రైళ్ల ద్వారా జిల్లాకు వచ్చింది. లారీల ద్వారా మండలాలకు యూరియాను తరలించారు.

రేపటిలోగా జిల్లాకు సరిపడా సరఫరా
- వ్యవసాయ అధికారి గోవింద్‌
జిల్లాకు మంగళవారంలోగా సరిపడా యూరియా చేరుకుంటుందని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌ తెలిపారు. ఆదివారం 2500 మెట్రిక్‌ టన్నుల యూరియా జిల్లాకు వచ్చిందని, దానిని సోమవారం 106 సహకార సంఘాల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం డిచ్‌పల్లి మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి సొసైటీని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2లక్షల ఎకరాల్లో వరి, 60వేల ఎకరాల్లో మొక్కజొన్న, 35 వేల ఎకరాల్లో సోయా పంట రైతులు వేసినట్లు తెలిపారు. ఈసారి వరి సాగు 125శాతానికి చేరిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాకు యూరియా 39,500 టన్నుల యూరియా వచ్చిందని, మరో 20,500 మెట్రిక్‌ టన్నుల యూరియా ఒకటి రెండు రోజుల్లో చేరుకుంటుందని చెప్పారు. ఆంధ్రలోని విశాఖపట్టణం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం ఓడరేవుల నుంచి నేరుగా లారీల ద్వారా జిల్లాలోని సొసైటీలకు వచ్చిందన్నారు. ఓడ రేవుల వద్దకు నలుగురు అధికారులను ప్రత్యేకంగా పంపించామన్నారు. యూరియా మొత్తం సహకార సంఘాలు, సహకార బ్యాంకుల ద్వారా మాత్రమే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీసీసీబీ డైరెక్టర్‌, సొసైటీ చైర్మన్‌ గజవాడ జైపాల్‌, పాయింట్‌పాయింట్‌ ఆఫీసర్‌ వెంకట రవీందర్‌, సీఈవో కిషన్‌ ఉన్నారు.

యూరియాకు రైతులు ఆందోళన చెందొద్దు
- భీమ్‌గల్‌ ఏడీఏ మల్లయ్య
బాల్కొండ నియోజకవర్గంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి వచ్చిందని, ఎల్లుండికల్లా యూరియా కొరత అనే మాటే తలెత్తదని భీమ్‌గల్‌ ఏడీఏ కె.మల్లయ్య తెలిపారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు బాల్కొండ నియోజకవర్గంలో రైతులందరికీ సరిపడా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. యూరియాకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆదివారం భీమ్‌గల్‌ మండలానికి 200 మెట్రిక్‌ టన్నులు, వేల్పూర్‌ మండలానికి 260 మెట్రిక్‌ టన్నులు, బాల్కొండ మండలానికి 60 మెట్రిక్‌ టన్నులు, ముప్కాల్‌ మండలానికి 40 మెట్రిక్‌ టన్నులు, ఏర్గట్ల మండలానికి 140 మెట్రిక్‌ టన్నులు, కమ్మర్‌పల్లి మండలానికి 40 మెట్రిక్‌ టన్నులు, మోర్తాడ్‌ మండలానికి 40 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. సోమవారం భీమ్‌గల్‌ మండలానికి 120 మెట్రిక్‌ టన్నులు, కమ్మర్‌పల్లి మండలానికి 160 మెట్రిక్‌ టన్నులు, మోర్తాడ్‌ మండలానికి 60 మెట్రిక్‌ టన్నులు, మెండోరా మంలానికి 60 మెట్రిక్‌ టన్నుల యూరియా వస్తుందని తెలిపారు. బుధవారం నుంచి ప్రతి మండల కేంద్రంలో 2 వేల నుంచి 3వేల యూరియా బస్తాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. దీంతో ఇక యూరియా కొరతనే ఉండదని వివరించారు.రైతులు యూరియా కోసం ఆధైర్యపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదన్నారు.క్యూ కట్టాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...