నుడా సేవలు మరింత విస్తృతం


Mon,July 22, 2019 01:58 AM

ఇందూరు : నిజామాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(నుడా)ను 2017 అక్టోబర్‌లో ఏర్పాటు చేసింది. నుడాకు కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. నిజామాబాద్ నగర పరిధిని పెంచుతూ 61 గ్రామాలను నుడాలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ నగరంతో పాటు ఆయా గ్రామాల్లో అభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పన మెరుగు పర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నుడాను ఏర్పాటు చేసింది.

చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌గా డీసీపీ...
నిజామాబాద్ నగర పాలక సంస్థలో డీసీపీగా విధులు నిర్వహిస్తున్న జలందర్‌రెడ్డిని నుడాకు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. కాగా, కార్యాకలాపాలు మరింత విస్తృతం చేయడం, సేవల్లో జాప్యం లేకుండా చూసేందుకు గాను తహశీల్దార్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ను నియమించాలని కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి. వీటితో పాటు ఒక ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్, ఒక అసిస్టెంట్ ఇంజినీర్‌ను నియమించాలని నుడా తరపున చైర్మన్ లేఖ రాశారు. మరింత మంది సిబ్బందిని కేటాయిస్తే నిజామాబాద్ నగరంతో పాటు నుడా పరిధిలోని గ్రామాల అభివృద్ధి వేగంగా జరుగనుంది.
ఆదాయం పెంచేందుకు కసరత్తు..
నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(నుడా) పరిధిలోని గ్రామాల్లో అక్రమంగా ఉన్న ఫ్లాట్లను రెగ్యులరైజ్ చేస్తే ఆదాయం పెరుగుతుందని భావించిన అధికారులు, ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని నుడా పరిధి గ్రామాల్లో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. హరితహారం కార్యక్రమాన్ని సైతం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్నారు. నుడాకు రూ.300 కోట్లు కేటాయించాలని ఇప్పటికే రాష్ట్ర మున్సిపల్ సెక్రటరీ, సీఎంకు చైర్మన్ చామకూర ప్రభాకర్‌రెడ్డి లేఖ రాశారు. రెవెన్యూ పెంచేందుకు ఉన్న అవకాశాలను గురించి మరింత అధ్యయనం చేస్తున్నారు. ఆదాయం పెరిగితే అభివృద్ధిని కూడా వేగంగా చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

సిబ్బందిని నియమిస్తే పారదర్శక పాలన..
నుడాకు పూర్తి స్థాయిలో సిబ్బందిని కేటాయిస్తే పరిపాలన పారదర్శకంగా జరగనుంది. నుడా పరిధిలో రెవెన్యూ పెంచేందుకు కృషిచేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుడాకు కొత్తగా తహసీల్దార్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ను కేటాయించనుంది. అభివృద్ధి మరింత వేగంగా జరిగేందుకు గాను వివిధ శాఖల అధికారులను ఇన్‌చార్జిలుగా నియమిస్తే బాగుంటుంది. టౌన్‌ప్లానింగ్ నుంచి నుడాకు ఆదాయం పెంచేందుకు కసరత్తు చేస్తున్నాం.
-జలందర్‌రెడ్డి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ నుడా
నిధులు, సిబ్బందిని కేటాయిస్తే మరింత అభివృద్ధి
నుడాకు పూర్తి స్థాయిలో సిబ్బంది, నిధులు కేటాయిస్తే మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. నుడా కార్యకలాపాలు విస్తృతం చేయడంలో భాగంగా తహసీల్దార్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఇంజినీరింగ్ అధికారులు, డెలిగేషన్ పవర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. రాష్ట్ర ప్రభుత్వం తహసీల్దార్, ఎఫ్‌ఆర్‌వోలను నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. రూ.300 కోట్ల నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్‌కు వినతి పత్రం అందజేశాం. నుడా పేరిట నగరంలో 2వేల ట్రీగార్డులు ఏర్పాటు చేయనున్నాం. ఇందుకు కసరత్తు చేస్తున్నాం.
-చామకూర ప్రభాకర్‌రెడ్డి, నుడా చైర్మన్

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...