ప్రాణం పోసిన వాన


Sun,July 21, 2019 01:18 AM


నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: వరుణుడు కరుణించాడు. ఎప్పట్నుంచో ఆకాశానికేసి ఆశగా ఎదురుచూస్తున్న రైతన్న మొరను ఆలకించాడు. జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారీగా కురిసిన వర్షం పంటలకు ప్రాణం పోసింది. ఆశలు సన్నగిల్లి నిరాశలో కొట్టుమిట్టాడుతున్న రైతన్నకు భారీ వర్షం కొత్త ఊపిరినిచ్చింది. పంటలకు ఊతాన్నిచ్చింది. ప్రధానంగా ఆరుతడి పంటలకు ఎంతో మేలు చేసింది. సోయాబీన్, మొక్కజొన్న పంటలకు జవజీవాలందాయి. నారుమళ్లు ఊపందుకోనున్నాయి. సుమారు 5 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంలో జిల్లా మొత్తం జలమయమైంది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. చెరువులకు జలకళ వచ్చింది. వానాకాలం శోభ దర్శనమచ్చింది. దీంతో రైతులు ఆనందంతో సాగులో బిజీ బిజీ అయ్యారు. ఇప్పటి వరకు అన్ని పంటలు కలిపి జిల్లాలో మొత్తం 52 శాతం మేర సాగయ్యాయి. ఇందులో వరినాట్లు 30శాతమే పడ్డాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నాట్లు వేయకుండా రైతులు నారుమళ్లలోనే ఉంచేశారు. శనివారం భారీ వర్షం పడడంతో ఇక నాట్లు ఊపందుకోనున్నాయి. నెలన్నర నారును కూడా నాటుకోవచ్చని, వాటి కొనలు తొలగించుకుని యథేచ్ఛగా నాట్లు వేసుకోవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంలో సాగుకు పట్టిన చీడ కూడా పోయిందని, కత్తెర పురుగులు కొట్టుకుకుపోయాయని జేడీఏ గోవింద్ తెలిపారు. మొక్కజొన్న, సోయాబీన్ ఇప్పటి వరకు 60 శాతం మేర సాగైంది. ఇది మరింత పెరగనుంది.

జిల్లావ్యాప్తంగా కుండపోత వాన ..
బాల్కొండ నియోజకవర్గంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం వేకువజామున వరకు భారీ వర్షం కురిసింది. కమ్మర్‌పల్లి, మోర్తాడ్, వేల్పూర్, ముప్కాల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఏర్గట్ల మండలంలో ముసురు వర్షం కొనసాగింది. ఆర్మూర్ మండలంలో శనివారం ఉదయం భారీ వర్షం నమోదైంది. లోతట్టు ప్రాం తాలన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షం రైతాంగానికి సంతోషం కలిగించి, పంటలకు జీవం పోశాయి. అంతే కాకుండా ఆర్మూర్‌లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. రూరల్ మండలాల్లో శుక్రవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నియోజక వర్గంలోని రైతుల ఆరుతడి పంటలకు కొంచెం ఊరట లభించినట్ల్లు అయ్యింది. ఈ నేపథ్యంలో వరి సాగు చేసుకునే రైతులకు ఇంకా నాలుగు, ఐదు వర్షాలు కురిస్తే వానాకాలం పంటలకు ఢోకాలేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బోధన్ నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షం కారణంగా ఆయా మండలాల పరిధిలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఠాణాకాలన్‌లో గోడ కూలి పక్కనే నిలిపి ఉంచిన రెండు బైకులు ధ్వంసమైయ్యాయి. బోధన్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

తడిసిముద్దయిన నగరం..
నగరంలో శుక్రవారం రాత్రినుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం పడింది. నగరంలోని కంఠేశ్వర్, ముబారక్‌నగర్, తిరుమల టాకీస్ రోడ్, గూపన్‌పల్లి, గంగాస్థాన్, ఆటోనగర్, మాలపల్లి ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. నగరంలో 71.2 మీ.మీ వర్షపాతం నమోదైంది.

జిల్లాలో 75.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం వేకువజామున వరకు భారీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా సరాసరి 75.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బోధన్ మండలంలో అత్యధికంగా 126.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా మోస్రా మండలంలో 21.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మోపాల్ 35, రుద్రూర్ 70.2, నిజామాబాద్ రూరల్ 59, మెండోరా 44.3, కోటగిరి 51.4, ముప్కాల్ 46.5, ఏర్గట్ల 62.8, బాల్కొండ 52.7, వర్ని, డిచ్‌పల్లి 69.8, నందిపేట్ 60.5, ధర్పల్లి 102.0, సిరికొండ 84.2, మోర్తాడ్ 65.7, కమ్మర్‌పల్లి 81.9, ఆర్మూర్ 104.8, రెంజల్ 117.0, చందూర్ 86.0, వేల్పూర్ 69.7, భీమ్‌గల్ 116.6, ఇందల్వాయి 71.5, జక్రాన్‌పల్లి 82.6, మాక్లూర్ 82 నిజామాబాద్ నార్త్ 90.3, నవీపేట్ 92.9, ఎడపల్లి 110.3 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది.

141
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...