కేబినెట్ వరాలు


Thu,July 18, 2019 04:26 AM

- పింఛన్‌దారులకు శుభవార్త
- బీడీ కార్మికుల జీవనభృతిపై తొలిగిన ఆంక్షలు.. కటాఫ్ డేట్ ఎత్తివేత
- 57 ఏండ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పింఛన్
- జాబితా సిద్ధం చేయాలని ఆదేశం
- డబుల్ పింఛన్ జూన్ నుంచే.. ఈనెల 20 తర్వాత అందజేయాలని కలెక్టర్లకు ఆదేశం

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతిభవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమైన అంశాలకు ఈ సమావేశంలో ఆమోదముద్ర లభించింది. అందరూ భావించినట్లుగానే కొత్త మున్సిపల్ చట్టానికి కీలక అడుగుపడింది. కేబినెట్ దీనికి ఆమోద ముద్ర వేసింది. ఇక ఈ బిల్లు 18,19 తేదీల్లో జరిగే అసెంబ్లీ, మండలి సమావేశాల్లో ఆమోదముద్ర వేసుకోవడమే తరువాయిగా ఉంది. ఇప్పటి వరకు లోపభూయిష్టంగా ఉండి అవినీతికి ఆలవాలంగా మారిన, బూజుపట్టిన మున్సిపల్ పాత చట్టానికి ఇక చెల్లుచీటీ పడనున్నది. 18న (నేడు) అసెంబ్లీలో, 19న (రేపు) మండలి సమావేశాల్లో కొత్త మున్సిపల్ చట్టాలని ఆమోదముద్ర పడునున్నది. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నారు. కీలకమైన ఈ అంశంతో పాటు ఆసరా పింఛన్ల రెట్టింపు అమలుపై కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా ఎదురుచూస్తున్న పింఛన్‌దారులకు తీపి కబురు వినిపించింది. జూన్ మాసం నుంచే డబుల్ పింఛన్లను అమలు చేసేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. పెంచిన పింఛన్లను అందించే క్రమంలో అంతకు ముందు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటుచేసి మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో ఈ ప్రొసీడింగ్స్ పత్రాలను పింఛన్‌దారులకు అందజేసిన తర్వాత పెంచిన మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని జిల్లాలతో పోలిస్తే నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికులు సింహభాగం ఉన్నారు. బీడీ కార్మికులకు జీవనభృతి ఇవ్వాలని ఆలోచనకు అంకురార్పణ జరిగింది కూడా ఇక్కడే. అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత, ఇప్పటి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బీడీ కార్మికులకు జీవనభృతి ఇవ్వాలని సీఎంను కోరారు.

వెంటనే ఆయన మోర్తాడ్ ఎన్నికల ప్రచార సభలో బీడీ కార్మికుల జీవనభృతిపై ప్రకటన చేశారు. దీంతో జిల్లాలో పెద్ద మొత్తంలో బీడీ పరిశ్రమపై ఆధారపడి ఉన్న కార్మికులకు ఇది ఎంతో భరోసానిచ్చింది. తాజాగా పీఎఫ్ కటాఫ్ డేట్‌ను ఎత్తివేయడంతో పీఎఫ్ ఉన్న బీడీ కార్మికులందరికీ డబుల్ పింఛన్ రానున్నది. ఈ పరిణామం బీడీ కార్మిక లోకంలో పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. అడుగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు.. కానీ, ఇక్కడి కార్మికుల దుర్భర జీవన స్థితిగతులను కళ్లారా చూసిన మన నేతలు జీవనభృతిని ప్రకటించడమే కాకుండా, ఆ ప్రకటించిన పింఛన్‌ను డబుల్ చేసి ఇచ్చేందుకు ఏర్పాటు చేయడం కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. బీడీ పరిశ్రమ నానాటికి దుర్భరంగా మారుతున్న ఈ పరిస్థితుల్లో, నెలకు రూ.2వేల జీవనభృతిని అందించి రెక్కాడితేగానీ డొక్కాడని ఆ బడుగు జీవుల బతుకుల్లో కొత్త వెలుగులను ప్రసరింపజేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈనెల 17 వరకు పీఎఫ్ ఖాతా ఉన్న బీడీ కార్మికులకు పింఛన్ అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. దీంతో పాటు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన మరో కీలకమైన అంశంపై కూడా కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వృద్ధాప్య పింఛన్ వయస్సు 65 నుంచి 57 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా వెంటనే దీనికి సంబంధించిన జాబితాను రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. త్వరలోనే కొత్తగా జిల్లాలో చాలా మందికి వృద్ధాప్య పింఛన్లు రానున్నాయి. పండుటాకుల కుటుంబాల్లో ఈ వార్త పండుగను తీసుకువచ్చింది.

168
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...