దూసుకొచ్చిన మృత్యువు


Sat,July 13, 2019 04:31 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్‌లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒకటో నెంబర్ ప్లాట్ ఫాంపైకి దూసుకొచ్చింది. ఈ సంఘటనలో ప్లాట్‌ఫాంపై కూర్చున్న గుంటి లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం ఫరీద్‌పేట్ గ్రామానికి చెందిన గుంటి లక్ష్మణ్ (35) యాదగిరి గుట్టవెళ్లడానికి ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాంపై బస్సు కోసం వేచి చూస్తున్నాడు. కామారెడ్డి డిపోకు చెందిన ఏపీ 29 జడ్ 3315 ఆర్టీసీ బస్సు జేబీఎస్ బయలు దేరేందుకు ప్లాట్‌ఫాంపైకి వచ్చింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో బస్సు ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. దీంతో ప్లాట్‌ఫాంపై కూర్చున్న లక్ష్మణ్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా బస్సును వేగంగా నడపడంతోనే ప్లాట్‌ఫాంపైకి దూసుకు వచ్చిందని ప్రయాణికులు ఆరోపించారు. యాదగిరి గుట్ట ప్రాంతంలోని ఓ ఫాంహౌస్‌లో లక్ష్మణ్ దంపతులు పని చేస్తున్నారు. స్వగ్రామమైన ఫరీద్ పేట్‌లో ఉన్న రెండు ఎకరాల 3 గుంటల భూమికి రైతు బంధు, రైతుబీమా పథకం నమోదు కోసం లక్ష్మణ్ రెండు రోజుల కింద వెళ్లాడు. గురువారం సదాశివనగర్‌లోని అత్తగారింటికి వెళ్లి శుక్రవారం తిరిగి యాదగిరి గుట్టకు వెళ్లేందుకు బస్టాండ్ చేరుకున్నాడు. బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.
బంధువుల ఆందోళన..
లక్ష్మణ్ మృతి వార్త తెలుసుకున్న బంధువులు, గ్రామస్తుల కామారెడ్డి బస్టాండ్‌కు చేరుకొని ఆందోళన నిర్వహించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఎక్కడిబస్సులు అక్కడే నిలిచిపోయాయి. పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో సంఘటన స్థలంలో బందోబస్తు నిర్వహించగా, సంఘటన స్థలానికి కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ చేరుకొని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ గణపతిరాజు హామీతో ఆందోళనకారులు రాస్తారోకోను విరమించారు. బస్సు డ్రైవర్ పి.ఇంద్రసేనారెడ్డి నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని ఆర్టీసీ అధికారులు రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. లక్ష్మణ్ భార్య గుంటి శోభకు ఆర్టీసీ తరపున వచ్చే ఆర్థికపరమైన లాభాలు అన్ని అందిస్తామని, కామారెడ్డి డిపోలో ఆమె అర్హతలు బట్టి ఔట్ సోర్సింగ్ విధానంపై ఉపాధి కల్పిస్తామని రాతపూర్వంగా రాసి ఇచ్చారు. లక్ష్మణ్ బావమరిది ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సీఐ రామకృష్ణ తెలిపారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...