సబ్సిడీల రుణాల కింద రికవరీ తగదు


Thu,June 20, 2019 03:06 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ప్రభుత్వాలు పేదల కోసం మంజూరు చేసే సబ్సిడీ మొత్తాలు రుణ బకాయిల కింద రికవరీ చేయడం మంచి పద్ధతి కాదని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు తెలిపారు. బుధవారం ప్రగతిభవన్ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేద ప్రజలు, రైతుల కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా పథకాలు లబ్ధి చేయడానికి, వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి రైతుబంధు తదితర పథకాల ద్వారా ఆ సబ్సిడీలను మంజూరు చేస్తున్నదని, దానిని బ్యాంకులు రుణ బకాయిల కింద తగ్గించుకోవడం పథకాల స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. రాష్ట్ర, జిల్లా స్థాయి బ్యాంకు అధికారులు కానీ, రిజర్వు బ్యాంకు నిబంధనలు కానీ, ఆ విధంగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయలేదని అన్నారు. క్షేత్రస్థాయిలో కొన్ని బ్యాంకు శాఖలు, ఆ విధంగా సబ్సిడీ మొత్తాలు రుణ బకాయిలు కింద వసూలు చేసుకుంటున్నట్లు పలు సందర్భాల్లో రైతులు, ఇతర స్కీమ్‌ల లబ్ధిదారులు ఫిర్యాదు చేస్తున్నారని, పలు సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకు వస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు జిల్లా అధికారులు, వారి కింద పనిచేసే శాఖల అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసిందని సబ్సిడీ మొత్తాలను రైతులకు తప్పనిసరిగా చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని సూచించారు.

రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి..
రైతులు, ప్రజలు బ్యాంకులకు రుణాలు తీసుకున్నప్పుడు రుణ లక్ష్యాలు, వాటిని సద్వినియోగం చేసుకునే విధానంపై అవగాహన కల్పించాలని, తద్వారా వారు సరైన పద్ధతిలో ఉపయోగించుకొని లబ్ధి పొందడానికి వీలవుతుందని, అదే విధంగా రుణాలు చెల్లించడానికి అవకాశం ఏర్పడుతుందని కలెక్టర్ తెలిపారు. గత మార్చి వరకు బ్యాంకుల ద్వారా అందజేసిన రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ప్రైవేట్ రంగ బ్యాంకులు లక్ష్యాలను మించి రుణాలు మంజూరు చేశాయని, ఈ విషయమై ప్రభుత్వరంగ బ్యాంకులు ఆలోచించాలని సూచించారు. జీవనోపాధి కింద రుణాలకు సంబంధించి చాలా దరఖాస్తులు బ్యాంకుల వద్ద పెండింగులో ఉన్నాయని, వీటన్నింటిని రుణాల మంజూరుకు పరిశీలించాలని కోరారు.

బ్యాంకు లింకేజీ కింద ఒక గ్రూపు రుణాలు చెల్లించకుంటే, మరో గ్రూపు బకాయిలు లేనప్పటికీ రుణాలు మంజూ రు చేయకపోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. రైతుబీమాను అర్హులు ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కరపత్రాలు, బీమా పుస్తకాలను, 2019-20 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ రుణ ప్రణాళికా ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యతా రంగాలకు 2,74,341 మందికి రూ. 5,454.18 కోట్లు, ఇతర రంగాలకు రూ. 150 కోట్లు మొత్తం కలిపి రూ. 5,604.18 కోట్లు మంజూరు చేయడానికి ఆమోదం తెలిపారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ సురేశ్‌రెడ్డి, ఆర్బీఐ ఏజీఎం వెంకటేశ్, ఎస్‌బీఐ ఏజీఎం నాయక్, నాబార్డు ఏజీఎం, డీఆర్డీవో రమేశ్, వ్యవసాయ బీమా కంపెనీ ప్రాంతీయ మేనేజర్ భారతి, సంక్షేమ శాఖల అధికారులు ఉదయ్ ప్రకాశ్, సంధ్యారాణి, శశికళ, జేడీఏ గోవింద్, మెప్మా పీడీ రాములు, బ్యాంకుల అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...