కాళేశ్వరం ప్రారంభోత్సవ సంబురాలు జరుపుకోవాలి


Thu,June 20, 2019 03:04 AM

ఇందూరు: తెలంగాణలో కోటి ఎకరాల మాగాణిని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈనెల 21న అట్టహాసంగా ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు ముఖ్య అతిథులుగా రానున్నారు. వీరితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. చారిత్రాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును ఈనెల 21న సీఎం కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ ప్రారంభించనుండగా.. ఆ రోజున టీఆర్‌ఎస్ శ్రేణులు జిల్లాలోని అన్ని గ్రామాల్లో పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. జిల్లా నుంచి ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీజీగౌడ్, రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తారీఖ్ అన్సారీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయా జిల్లాల నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్‌రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరవుతారన్నారు. ఆ రోజున మండల, జిల్లా కేంద్రాల్లో పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలోని కోటి ఎకరాల మాగాణిని సస్యశ్యామలం చేసేందుకు గాను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సం సందర్భంగా ఆయా మండలాల్లో పార్టీ నాయకత్వం సంబురాలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకు 80శాతం సాగు, తాగునీరు తీరుతుందన్నారు. 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర ఇలాంటి ఎత్తిపోతల ప్రాజెక్టు ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలవనుందని తెలిపారు. ప్రతి జిల్లాలో ఈనెల 24న టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలకు భూమి పూజ కార్యక్రమంలో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలన్నారు. టీఆర్‌ఎస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో భాగంగా ఈనెల 27 నుంచి జూలై 7 వరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. గతేడాది రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టగా.. ఈ ఏడాది కూడా సభ్యత్వ నమోదు కోసం పార్టీ నాయకత్వం పకడ్బందీగా పనిచేయాలని సూచించారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జూలై 16 నుంచి 31 వరకు పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...