బదిలీలకు వేళాయె..


Wed,June 19, 2019 02:09 AM

నిజామాబాద్ సిటీ: జిల్లాలో వరుస ఎన్నికల ప్రక్రియ మొత్తంగా ముగిసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా ముగిసింది. ఇక ఉద్యోగుల బదిలీలకు వేళయ్యింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ బదిలీలపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. ఏ ఒక్కరినీ కదిపినా..ఉండేదెవరు, వెళ్లేదెవరు..? ఇవే మాటలు వినిపిస్తున్నాయి. పని చేయడానికి ఎక్కడైతే బాగుంటుందన్న ఆలోచనల్లో కూడా ఉద్యోగులు నిమగ్నమయ్యారు. కొందరైతే తాము ప్రయత్నాల్లో ఉన్నామన్న సంకేతాలు ఇస్తున్నారు. మరికొందరు ఇక్కడి నుంచి బదిలీ కాకుండా యత్నిస్తుంటే, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు రావడానికి కొందరు మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్, పోలీసు కమిషనర్‌తో పాటు అధికారులు, ఉద్యోగుల బదిలీలు చేసే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో బదిలీల కోలాహలం ప్రారంభం కానున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి.

పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వ నిర్ణయం...
అధికారులు, ఉద్యోగుల బదిలీలు కూడా పారదర్శకంగా చేయాలని, అవినీతి అధికారులకు స్థానచలనం తప్పదన్న సంకేతాలు ప్రభుత్వం నుంచి రావడంతో బదిలీల ప్రక్రియ తప్పదని తెలుస్తున్నది. ఇప్పటికే జిల్లాలో అధికారులు, ఉద్యోగుల్లో బదిలీల కలవరం మొదలైంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు, ఉద్యోగులను మార్చాలనే యోచనలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఉద్యోగా వర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో ఎవరికి వారే తమకు స్థాన చలనం జరుగుతుందని ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలు ముగిసినప్పటికీ, అధికార యంత్రాంగం ఇంకా అందులో నుంచి బయటపడలేదు. పాలనా అంతా నీరసంగానే సాగుతోంది. పలువురు అధికారులు ఇంకా సీట్లలో కూర్చునేందుకు సైతం ఇష్టం చూపడం లేదు. ఏ కార్యాలయం చూసినా ఖాళీగానే దర్శనమిస్తున్నది.

అన్ని కేడర్లలోనూ స్థాన చలనాలు...
జిల్లాలో ప్రధానమైన రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు శాఖల్లో భారీగా స్థాన చలనాలు ఉండవచ్చు అని తెలుస్తున్నది. జిల్లా నుంచి పలువురు పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులపై రాష్ట్ర అధికారులకు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే ఆర్‌అండ్‌బీ ఈఈగా విధులు నిర్వహించిన హన్మంత్‌రావును మహబూబ్‌నగర్‌కు ఉద్యోగన్నతిపై డిప్యూటీ ఎస్‌ఈగా ప్రభుత్వం బదిలీ చేసింది. హన్మంత్‌రావు స్థానచలనంతో ప్రధాన శాఖల్లో పనిచేస్తున్న వారితో పాటు జిల్లాలోని ప్రధానమైన శాఖల్లో అన్ని కేడర్లలోని ఉద్యోగలకు స్థానచలనం తప్పదని అంటున్నారు. ఉపాధ్యాయులు మినహా ఇతర శాఖల్లో వివిధ కేడరల్లో పనిచేస్తున్న వారికి బదిలీ నియమ నిబంధనలను అనుసరించి బదిలీలు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రధాన పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ వంటి శాఖలతోపాటు మున్సిపాలిటీలు, నగర పాలకసంస్థలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగే అవకాశం ఉంది.

జిల్లాలో ఒక శాఖలోని ఉద్యోగులు ఇతర శాఖల్లో పనిచేస్తున్నారు. రెవెన్యూ శాఖలోని వారు పౌరసరఫరాల శాఖలో డిప్యూటీ తహసీల్దార్లు (డీటీలు), ఎఫ్‌ఐలుగా పనిచేస్తున్నారు. రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత ఉంది. రెవెన్యూ నుంచి ఆ శాఖకు వెళ్తున్న ఆనవాయితీ కొన్నేళ్లుగా సాగుతున్నది. జాయింట్ కలెక్టర్ పౌరసరఫరాల శాఖకు అధికారిగా ఉన్నందున, వారి ద్వారా ఇతర శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో రెవెన్యూలోని అన్ని విభాగాల్లో పనులు కుంటుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ దఫా ఇతర శాఖల సర్వీసులకు పుల్‌స్టాప్ పెట్టే యోచనలో అధికారులు ఉన్నారు. జిల్లా అధికారులకు స్థానచలనం ఉన్నందున, జిల్లాలో ఎక్కువ కాలం పనిచేసిన అధికారులు ఉన్నారు. వీరు తమ ప్రయత్నాలను ప్రారంభించినట్లుగా సమాచారం.

మంచి పేరున్న వారికి తగిన గర్తింపు...
ప్రజల్లో మంచి పేరున్న అధికారులు, ఉద్యోగులకు తగిన గుర్తింపు లభించనుందన్న సంకేతాలు ఉన్నాయి. ఐదేళ్లు ఎలాంటి లోకల్ పోస్టింగ్‌లో లేకుండా ఎక్కడికి వేస్తే అక్కడ ఉద్యోగం చేసిన వారు పదుల సంఖ్యల్లోనే ఉన్నారు. అలాంటి వారికి ఈ ఎన్నికల్లో తగిన గుర్తింపు వచ్చింది. పైఅధికారులకు ఇబ్బంది కలిగించకుండా ఏ విధంగా పనిచేశారో వారి పనితనం చూశారు. అలాంటి వారికి ఈ బదలీల్లో తగిన గుర్తింపు లభించనున్నట్లు ఉద్యోగవర్గాల ద్వారా తెలిసింది. ప్రజలతో ముఖ్యంగా మంచి సంబంధాలు, ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేని వారికి ఈ బదిలీల్లో తగిన గుర్తింపు లభిస్తుందని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో నూరు శాతం అమలు కాని పక్షంలో ఇబ్బందులు తప్పవని అధికారులు అంటున్నారు. చిత్తశుద్ధితో పనిచేసే ఉద్యోగులకు తగిన లోకల్ సీట్లు అడక్కుండానే అవి వారిని వరిస్తాయంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రెవెన్యూ శాఖలో అన్ని విభాగాల అధికారుల వివరాలను సేకరిస్తున్నది. ఈ మేరకు ఈ శాఖలో త్వరలో భారీగా బదిలీలు జరిగే అవకాశం కనబడుతున్నది. రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా బదిలీల అంశాన్ని కూడా ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది.

126
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...