కొత్త చట్టం.. పల్లె ప్రగతికి పట్టం


Tue,June 18, 2019 01:15 AM

మోర్తాడ్ : రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి అమలులోక తెచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామాల్లో ఇక అభివృద్ధి పరుగులు పెట్టే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీలకు మరిన్ని విధులు,బాధ్యతలు పెరిగాయి.జీపీలకు సంబంధించి నిధుల వినియోగానికి చెక్‌పవర్‌ను ఇటీవల ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఉన్న ఆటంకాలు తొలగిపోయి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం పంచాయతీలకు ఏర్పడింది. అభివృద్ధి పనుల్లో పారదర్శకత ఉండడంతో పాటు జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతోనే సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కల్పించినట్లు పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొన్నారు. చెక్‌పవర్ కల్పించడంతో ఎట్టకేలకు గ్రామపంచాయతీల పాలనకు ఉపశమనం లభించినట్లు అయ్యింది.

జాయింట్ చెక్‌పవర్‌తో పారదర్శకత...
ఇంతకు ముందు కార్యదర్శి, సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ ఉండేది. కానీ, ఇప్పుడు అమలు చేసిన చట్టం ప్రకారం సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ ఇచ్చారు. ఈ విషయంలో సర్పంచ్‌లు కొంత అసంతృప్తితో ఉండగా, ఉపసర్పంచ్‌లు మాత్రం సంతోషంగా ఉన్నారు. ఇంతకు ముందు ఉపసర్పంచ్‌లుగా ఉన్న వారు వార్డు మెంబర్‌లతో సమానమే అన్నట్లుగా ఉండేది. కానీ, ప్రస్తుతం ఎన్నికల సమయంలో ప్రచారం జరిగనట్లుగానే ఉప సర్పంచ్‌లకు చెక్‌పవర్ అవకాశం కల్పించడంపై ఉప సర్పంచ్‌లకు గౌరవం దక్కినట్లయ్యింది. దీంతో పాటే గ్రామాభివృద్ధిలో బాధ్యత కల్పించినట్లు అయ్యింది. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు పనులు పారదర్శంగా జరగాలనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

అభివృద్ధికి అవకాశం...
నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని సంపూర్ణంగా అమలు పరచడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఊపందుకోనున్నాయి. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తరువాత చెక్‌పవర్ అవకాశాన్ని కొన్ని నెలల పాటు కల్పించక పోవడంతో చాలా పనులు పెండింగ్‌లో పడిపోయాయి. చాలా గ్రామాల్లో సర్పంచులే తమ సొంతఖర్చులతో పనులు చేయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సర్పంచ్‌గా గెలిచిన తరువాత చెక్‌పవర్ ఉన్నా.. లేకపోయినా పనులు చేయకపోతే ప్రజల్లో చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో చాలామంది సర్పంచులు సొంత ఖర్చులు పెట్టి పనులు చేయించారు. పైపులైన్ మరమ్మతులు, బోరు మోటార్ల మరమ్మతులు, మురికి కాలువలను శుభ్రం చేయడం, వీధిలైట్ల ఏర్పాటు, మరమ్మతులు వంటి పనులు సర్పంచ్‌లే తమ సొంత ఖర్చులతో చేయించిన పరిస్థితులు ఉన్నాయి. వరుస ఎన్నికలు రావడం, ఎన్నికల కోడ్ అమలుతో ప్రభుత్వం చెక్ పవర్ ఇవ్వడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఎట్టకేలకు చెక్‌పవర్ కల్పించడంతో సర్పంచులకు ఉపశమనం లభించినట్లయ్యింది. ఇకముందు గ్రామాల్లో జరిగే పనులు వేగిరంగా చేయించే అవకాశాలు ఏర్పడ్డాయి. గ్రామాలకు వచ్చే ఆర్ధిక సంఘం నిధులు, జనరల్ ఫండ్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల ఖర్చుతో అభివృద్ధి పనులు జరిగే అవకాశాలు ఏర్పడ్డాయి. హరితహారంలో భాగంగా నర్సరీల నిర్వహణ, పబ్లిక్ రోడ్లు, వంతెనలు, కాల్వల మరమ్మతులు, తాగునీటి పైప్‌లైన్ల నిర్మాణం, నిర్వహణ, మురుగు కాల్వల నిర్వహణ, వీధులు శుభ్రపరచడం, పాడుబడ్డ బావులను పూడ్చడం, పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు, చెత్త సేకరించిడం, డంపింగ్‌యార్డుల నిర్వహణ లాంటి బాధ్యతల నిర్వహణకు చెక్‌పవర్ కల్పించడంతో మార్గం సుగుమమైంది.

పారిశుద్ధ్యం, హరితహారంపై ప్రత్యేక దృష్టి...
తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేకంగా పాలకవర్గానికి మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా ఇక నుంచి ఇంటి ముందు చెత్త వేస్తే ఇంటి యజమానికి రూ.500, మురుగునీరు రోడ్డు మీదకు వదిలితే రూ.5వేల జరిమానా విధించే అవకాశాన్ని కల్పించింది. అదే విధంగా ఒక్కో కుటుంబం తప్పనిసరిగా ఆరు మొక్కలు నాటి, వాటిలో కనీసం మూడు మొక్కలు ఎదిగేలా చూడాలి. మొక్కలు పెంచని వారికి ఆస్తి పన్నుకు రెండింతలు జరిమానా విధించే అవకాశాన్ని చట్టంలో కల్పించారు. గ్రామాల్లో స్వచ్ఛతను, హరితాన్ని పెంచే బాధ్యతను కట్టబెట్టడంతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే గ్రామాల్లో స్వచ్ఛత, హరితం మెరుగుపడుతాయని తెలంగాణ ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

గ్రామాల్లో సమస్యలు పరిష్కారం..
తెలంగాణ ప్రభుత్వం చెక్ పవర్ కల్పించడంతో గ్రామాల్లో సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఏర్పడింది. కొన్ని నెలల పాటు చెక్ పవర్ లేకున్నా నీటి సమస్య రాకుండా సొంత డబ్బులు వెచ్చించా. ఇక ముందు అలాంటి ఇబ్బందులు ఉండవు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతాం. గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం. కొత్త పంచాయతీరాజ్ చట్టం గ్రామ పంచాయతీలపై మరింత బాధ్యతను పెంచింది. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి నావంతుగా కృషిచేస్తా.
-గడ్డం చిన్నారెడ్డి, సర్పంచ్, తిమ్మాపూర్

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...