సంతల వేలం వాయిదా


Tue,June 18, 2019 01:12 AM

నవీపేట: మండల కేంద్రంలోని జీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మేకల, కూరగాయల సంత వేలం పాటలో గందర గోళం నెలకొంది. సంతలను గతంలో దక్కించకున్న కాంట్రాక్టర్లు తమకు నష్టం వాటిల్లిందంటూ సర్పంచు ఏటీఎస్ శ్రీనివాస్‌పై అసహనం వ్యక్తం చేశారు. గంటపాటు వేలంలో తీవ్ర గందర గోళం నెలకొంది. జీపీ కార్యదర్శి విజయ్‌కుమార్ వేలానికి సంబంధించిన వివరాలు చెప్పేందుకు ప్రయత్నించగా గుత్తేదారులు ఆందోళన చేశారు. ఈ ఎడాది మార్చిలో నిర్వహించిన మేకల సంత వేలంను సలీమ్ అనే కాంట్రాక్టర్ రూ.36.40 లక్షలకు, కూరగాయల సంతను నవీపేటకు చెందిన రాము రూ.12 లక్షలకు దక్కించుకున్న విషయం తెలిసిందే. సంత వేలం దక్కించకున్న సదరు కాంట్రాక్టర్లు సమయానికి మూడో వంతు డబ్బులు జీపీకి చెల్లించలేదు. దీంతో సదరు కాంట్రాక్టర్లకు జీపీ నోటీసులు జారీ చేసింది. నెల రోజుల పాటు జీపీ సిబ్బంది సంతలో తైబజార్‌ను వసూలు చేశారు. గ్రామస్తుల ఒత్తిడి కారణంగా మేకలు, కూరగాయల సంతల వేలం సోమవారం నిర్వహించారు. మేకల సంతలో 14 మంది గుత్తేదారులు పాల్గొన్నారు. కూరగాయల సంతలో 8 మంది పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే సదరు గుత్తేదారులు సిండికేట్‌గా ఏర్పడి సంత వేలంను రూ.10 లక్షలకు దాటకుండా ఒప్పందం కుదుర్చుకున్నారు. మేకల సంతలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ రూ.8 వేలు, కూరగాయల సంత వేలంలో పాల్గొన్న వారికి రూ.5 వేలు ముట్ట జెప్పేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే పాత కాంట్రాక్టరే రూ.10 లక్షల వేలం పాట పాడి సంతను దక్కించకునేందుకు ప్రయత్నించాడు. మేకల సంతను రూ.2 లక్షలకే పాడి పాటను నిలుపుదల చేశారు. దీంతో మార్చిలో నిర్వహించిన రూ.36.40 లక్షల కంటే ధర తక్కువ రావడంతో ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు జీపీ కార్యదర్శి విజయ్‌కుమార్ పేర్కొన్నారు. నవీపేట మేకల, కూరగాయల సంతలో లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ కాంట్రాక్టర్లు జీపీ సిబ్బందితో కుమ్మకై జీపీ ఆదాయానికి గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారి జయసుధ సైతం నవీపేట మేకల సంతలో జీపీ సిబ్బంది అనుసరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కరిపే మల్లేశ్, వార్డు మెంబర్లు నవీన్‌రాజ్, గుర్రపు రవి, గ్రామ మాజీ ఉప సర్పంచులు తెడ్డు పోశెట్టి, పట్టనాతి శ్రీనివాస్, గ్రామ పెద్దలు ఇయం గంగాధర్, లోకం నర్సయ్య, కాంట్రాక్టర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...