అల్పాహారంతో పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదల


Sun,June 16, 2019 03:01 AM

నిజామాబాద్‌ రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందిస్తే వారిలో మానసిక, శారీరక ఎదుగుదలకు దోహదపడుతుందని సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌ రాష్ట్ర ఇన్‌చార్జి నర్సింహారెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్‌ మండలంలోని ఖానాపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామస్తుల సహకారంతో ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిత్య అల్పాహారం కార్యక్రమాన్ని గ్రామపెద్దలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థుల తల్లిదండ్రులు కూలీ పని మీద ఆధారపడడంతో ఆర్థిక స్థోమత లేక ఆశించిన రీతిలో తమ పిల్లలకు పోషకాలు అందించలేరని అన్నారు. కొంతమంది పిల్లలు ఉదయం కనీసం అన్నం కూడా తినకుండానే స్కూళ్లకు వచ్చి చదువుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారాన్ని అందించి వారి ఆరోగ్యాభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిత్య అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. కర్ణాటకలో 35 మందితో ప్రారంభించిన కార్యక్రమాన్ని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2 లక్షల 50 వేల మంది విద్యార్థులకు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అల్పాహారం అందజేస్తున్నట్లు తెలిపారు.

పాఠశాలలో ప్రభుత్వం అందజేస్తున్న మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం అమలు చేస్తే విద్యార్థుల హాజరు శాతం మరింత పెరుగుతుందన్నారు. వంటలు చేసేటప్పుడు పరిశుభ్రత పాటించాలని సూచించారు. గ్రామస్తులు ఐక్యంగా బాధ్యతతో ముందుకొస్తే మరికొన్ని పాఠశాలల్లో నిత్య అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తమ ట్రస్ట్‌ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. హరితహారం కింద మొక్కలు నాటడం గొప్ప సామాజిక కార్యక్రమమని, అందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. గ్రామపెద్దలు అతిథులకు మొక్కల కుండీలను అందజేశారు. అంతకుముందుగా సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. కార్యక్రమంలో ట్రస్ట్‌ ప్రతినిధి మూర్తి, మాజీ సర్పంచ్‌ కొర్వ గంగాధర్‌, దాతలు పవన్‌సేట్‌, ఫణి, సింగిల్‌విండో చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, వీడీసీ చైర్మన్‌ కొర్వ సాయికుమార్‌, కాంప్లెక్స్‌ స్కూల్‌ హెడ్మాస్టర్‌ వనిత, ఎంపీటీసీ సాయన్న, హెడ్మాస్టర్‌ రత్నాకర్‌, గ్రామపెద్దలు కొర్వ గంగాధర్‌, సాలుగారి మోహన్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌, రిటైర్డ్‌ డీఈవో పోచయ్య, సిరివెన్నెల గ్రీన్‌ సొసైటీ వ్యవస్థాపకుడు రావుట్ల జనార్ధన్‌, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...