వడివడిగా


Thu,April 18, 2019 12:42 AM

- రూరల్‌లో సమగ్ర ఆరోగ్య సర్వే డేటా పూర్తి
- అర్బన్‌లో కొనసాగుతున్న కుటుంబ వివరాల సేకరణ
- ఇంటింటికీ వెళ్లి సర్వే చేపడుతున్న వైద్యబృందాలు
- ఇప్పటి వరకు 75 శాతం వివరాల సేకరణ పూర్తి
- కుటుంబ సభ్యుల మార్పులు ,చేర్పులను చేస్తూ సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఆరోగ్య తెలంగాణ దిశగా తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఇప్పుటికే వైద్యరంగంలో కీలక సంస్కరణలకు నాంది పలికిన సర్కారు.. మరిన్ని కార్యక్రమాలతో ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలిచేందుకు సిద్ధ్దమవుతున్నది. ఇప్పటికే ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ద్వారా పరీక్షలు, కళ్లద్దాలు, సర్జరీలు చేయిస్తున్నది. త్వరలో దంత పరీక్షలు, ఈఎన్‌టీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. వీటితో పాటు సమగ్ర ఆరోగ్య సర్వేకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. దీనిద్వారా ఏ జిల్లాలో ఎలాంటి వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారు? వారి కోసం ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పించాలనే విషయాలపై జాగ్రత్తలు తీసుకోనున్నది. సమగ్ర హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించనున్నది.

దీని ద్వారా ఎవరికి ఏ సమయంలో ఏం కావాలన్నా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనికోసం కుటుంబాల వారీగా మొదట సర్వే చేపడుతున్నారు. ఈ ప్రక్రియ జిల్లాలో ఇప్పటికే మొదలైన విషయం తెలిసిందే. 2011 జనాభా లెక్కలను అనుసరించి సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఇంటింటి వివరాల సేకరణ వేగిరంగా జరుగుతున్నది. జిల్లావ్యాప్తంగా 75శాతం మేర ఈ వివరాల సేకరణ పూర్తి చేశారు. అర్బన్‌లో జనాభా ఎక్కువగా ఉండడం మూలంగా ఈ ప్రక్రియలో కొంత జాప్యం జరుగుతున్నది. నిజామాబాద్ నగరంలోని డివిజన్‌లలో ఇంటింటి సర్వే చేపడుతున్నారు. దీన్ని కూడా త్వరితగతిన పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిమగ్నమై ఉన్నది. తదనంతరం కుటుంబాల వారీగా వారి ఆరోగ్య వివరాలను సేకరించే పనికి శ్రీకారం చుడతారు.

ఇదంతా ఓ క్రమ పద్ధతిలో నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. 2011 జనాభా లెక్కలను అనుసరించి జిల్లాలో మొత్తం 15లక్షల పైచిలుకు జనాభా ఉన్నది. ఇప్పటి వరకు చూసుకుంటే 16లక్షల పైచిలుకు జనాభా పెరిగింది. వీరందరినీ పరిగణలోకి తీసుకొని కుటుంబాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. కొత్తగా జనవరి మాసం నుంచి జనన, మరణ వివరాలు కూడా ఈ నివేదికలో పొందుపరుస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి స్పష్టంగా కుటుంబాల సంఖ్య, ఆ కుటుంబలో కుటుంబ సభ్యుల వివరాలు తెలుస్తాయి. అనంతరం సేకరించిన ఆరోగ్య వివరాలను వీటికి క్రోడీకరించి హెల్త్ ప్రొఫైల్‌ను ప్రభుత్వం రూపొందిస్తున్నది. అర్బన్‌లో వలసలు ఎక్కువగా ఉండడంతో సమగ్ర ఇంటింటి సర్వే చేపట్టడంలో కొంత సమయం తీసుకుంటున్నారు. దీనికోసం ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు బృందాలుగా ఏర్పాటు చేసి ఒక్కో కుటుంబం వివరాలను సేకరిస్తున్నారు. వీటిని ప్రభుత్వానికి నివేదించిన తర్వాత .. అక్కడ నుంచి ఆదేశాలు రాగానే వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని పూర్తి సమాచారాన్ని హెల్త్ ప్రొఫైల్‌లో నిక్షిప్తం చేయనున్నారు

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...