రైతన్నకు మరింత దన్ను


Thu,April 18, 2019 12:41 AM

కోటగిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం అన్నదాతకు ఆసరా ఇస్తోంది. ఆర్థిక స్తోమత లేని రైతులకు ఇది ఒక వరంలా మారింది. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకూ వానాకాలం (ఖరీఫ్), యాసంగి(రబీ) సీజన్‌లో ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి సాయం అందడంతో పంటల సాగు కోసం అప్పులు చేసే తిప్పలు తప్పిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మే నెల నుంచి రూ.2 వేలు అదనంగా పెట్టుబడి సాయాన్ని మరో రూ.2 వేలు పెంచి 2019-2020 ఆర్థిక సంవత్సరం నుంచి రూ.10 వేల చొప్పున అందిస్తామని సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. దీంతో రాబోయే వానాకాలం (ఖరీఫ్) సీజన్ నుంచి పెట్టుబడి సాయం పెరగనుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగు కోసం పెట్టుబడి పెట్టడానికి బ్యాంకుల్లో పంట రుణాలను పొందేవారు. బ్యాంకుల్లో పంట రుణాలను పొందడానికి బ్యాంకర్లు సవాలక్ష కొర్రీలు పెడుతుండడంతో కొందరు రైతులు పంట రుణాల జోలికి పోలేదు. అయితే పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాసారులు, ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించే వారు.

మరికొందరు రైతులు తాము పంటలను విక్రయించే ఆడ్తీ వ్యాపారుల వద్ద అడ్వాన్స్ తీసుకునే వారు. వడ్డీ వ్యాపారుల వద్ద చేసిన అప్పులకు ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి రావడంతో రైతులు తమ పంటల సాగుతో సంపాదించిన దానిలో ఎక్కువ శాతం వ్యాపారులకే దారబోసేవారు. వ్యాపారులు ఏ ధర నిర్ణయిస్తే అంతే ధరకు పంటలను విక్రయించడంతో పాటు తీసుకున్న అడ్వాన్స్‌కు వడ్డీ కూడా చెల్లించే వారు. దళారుల వద్ద అడ్వాన్స్‌లు తీసుకోవడంతో రైతులు రెండు విధాలుగా నష్టపోయేవారు. ఎన్నో సందర్బాల్లో రైతులు తమ కష్టార్జితంలో ఎక్కువ సొమ్మును ఇంటి కోసం కాకుండా తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లించడానికి సరిపెట్టేవారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేయడంగో రైతులకు ఈబాధలన్నీ పోయినట్లే. ప్రతి సీజన్‌కు పెట్టుబడి సాయం అందించడంతో వ్యవసాయానికి భరోసా కలిగింది.

జిల్లాలో 2,08,977 మందికి ప్రయోజనం...
రైతుబంధు పథకంతో జిల్లాలో మొత్తం 2,08,977 మంది రైతులకు వానాకాలం(ఖరీఫ్), యాసంగి(రబీ) రెండు సీజన్‌లో రూ. లబ్ధి కలిగింది. ఇందులో ఖరీఫ్ సీజన్‌కు గానూ జిల్లాలో 2,00,250 మంది రైతులకు రూ.175.11 కోట్లు రైతుబంధు కింద ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందింది. రబీ సీజన్‌కు గానూ 2,08,977 మంది రైతులకు రూ. 178.19 కోట్లు పెట్టుబడి సహాయాన్ని అందించారు. అయితే భూప్రక్షాళనలో రికార్డులు సరికాక పోవడంతో కొంతమంది రైతులకు పెట్టుబడి సాయం అందడంలో జాప్యం ఏర్పడింది. భూప్రక్షాళన కార్యక్రమం కొనసాగుతుండడంతో వచ్చే సీజన్‌లో జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రైతుబంధు లబ్ధి పొందే రైతుల సంఖ్య పెరగడంతో పాటు జిల్లాకు మంజూరయ్యే నిధుల మొత్తం కూడా పెరగనుంది.

మంచి పథకమే..
ప్రభుత్వం ప్రారంభించిన రైతుబంధు పథకం బాగుంది. పంటల సాగు కోసం పెట్టుబడి సాయం అందించడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. రైతులు పంట పెట్టుబడులకు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందిస్తుండడంతో రైతులు మరొకరి వద్ద చేతులు చాచే పరిస్థితి తంప్పిది.
-శ్రీనివాస్, రైతు, కొల్లూర్

రైతులకు ప్రయోజనకరం..
పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించడంతో పేద రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతున్నది. పేద రైతులు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే వారు, పంటలను వేయాల్సిన సమయంలో ఎంత వడ్డీ అయినా చెల్లించడానికి ముందుకు వచ్చేవారు. ఇప్పుడు పేద రైతులకు ఆ అవసరం లేకుండా పోయింది. పంటల సాగుకు ముందే పెట్టుబడి సాయం అందించడంతో రైతులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా పోయాయి.
-మేకల నర్సింహులు, రైతు, వల్లభపూర్

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...