స్థానిక పోరుకు సన్నద్ధం


Wed,April 17, 2019 01:51 AM

ఇందూరు : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిసారించారు. జిల్లాలో 25 జడ్పీటీసీ, 299 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఆయా స్థానాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ ప్రణాళిక రూపొందించుకొని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 7,79,112 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 3,63,267 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 4,15,833 మంది ఉన్నారు. నిజామాబాద్ డివిజన్‌లో 538 పోలింగ్ కేంద్రాలు , బోధన్ డివిజన్‌లో 412, ఆర్మూర్ డివిజన్ పరిధిలో 632 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.

దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తులను సిద్ధం చేసింది. ఓటర్ లిస్టును పూర్తి చేసింది. జిల్లాలోని ఆయా స్థానాలకు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. నోటిఫికేషన్ విడుదల తర్వాత మూడు విడుతల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. అభ్యర్థుల గుర్తులను పార్టీల ఆధారంగా కేటాయిస్తామని అధికారులు తెలిపారు. స్వతంత్య్ర అభ్యర్థులకు కూడా గుర్తులను కేటాయించామని అధికారులు తెలిపారు. కాగా, జిల్లా యంత్రాంగం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను అసెంబ్లీ, పార్లమెంట్, సర్పంచ్ ఎన్నికలను నిర్వహించినట్లుగానే పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నామినేషన్లను స్వీకరణ ప్రక్రియను చేపడతామని అధికారులు తెలిపారు.

అధికారులకు శిక్షణ..
ఇదే అంశమై ఇటీవల జరిగిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ రామ్మోహన్ రావు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తించాలని దిశానిర్దేశం చేశారు. నామినేషన్ల పరిశీలనలో రిటర్నింగ్ అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సూచించారు. గుర్తుల కేటాయింపు సమయానుసారంగా పూర్తి చేయాలన్నారు. గుర్తుల కేటాయింపులో నాలుగు కేటగిరీలు ఉంటాయని, మొదటి కేటగిరీలో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలు ఉంటాయని, రెండో కేటగిరీలో రిజిష్టరు గుర్తు, రిజర్వు పార్టీలు ఉంటాయన్నారు. మూడో కేటగిరీలో రిజిష్టర్, ఎలాంటి గుర్తింపు లేని పార్టీలు, నాలుగో కేటగిరీలో స్వతంత్ర అభ్యర్థుల గుర్తుల కేటాయింపు ఉంటుందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు కొత్తగా గుర్తులను కేటాయించే అవకాశం ఉన్నందున, దాని ప్రకారం గుర్తులను కేటాయించాలన్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సిబ్బందికి సందేహాలు ఉంటే తమ పై అధికారులతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలని సూచంచారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు.

పార్టీల్లో సందడి..
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ ముగియడంతో నోటిఫికేషన్ కోసం ఆయా పార్టీల నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు సిద్ధమయ్యారు. నోటిఫికేషన్ వెలువడగానే నామినేషన్ వేసి ప్రచారం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గుర్తింపు పొందిన పార్టీల నుంచి పోటీచేస్తే గుర్తు కలిసి వస్తుందని వారు భావిస్తున్నారు. పార్టీల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న నాయకులు తమకు జడ్పీటీసీ, ఎంపీటీసీగా పోటీ చేసే అవకాశం వస్తుందని వారివారి అంచనాల్లో ఉన్నారు. తమవంతు ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించారు. అధికారులు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...