ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి


Tue,April 16, 2019 01:35 AM

ఇందూరు / ఆర్మూర్, నమస్తే తెలంగాణ : రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయ సమావేశ మందిరం, ఆర్మూర్‌లోని మండల పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మార్గదర్శకాలు, సూచనల మేరకు విధులు నిర్వర్తించాలన్నారు. ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, గుర్తుల కేటాయింపులో నిబంధనలు పాటించాలన్నారు. నామినేషన్ల పరిశీలనలో రిటర్నింగ్ అధికారి పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ధేశించిన విధంగా నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, గుర్తుల కేటాయింపు సమయానుసారంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు భిన్నంగా స్థానిక ఎన్నికలు ఉంటాయన్నారు. గుర్తుల కేటాయింపు నాలుగు కేటగిరీల్లో ఉంటుందన్నారు. మొదటి కేటగిరీలో జాతీయ, రాష్ట్ర పార్టీలు, రెండో కేటగిరీలో రిజిస్టర్ కాబడిన గుర్తు, రిజర్వుడ్ పార్టీలు, మూడో కేటగిరీలో రిజిస్టరై ఎలాంటి గుర్తింపు లేని పార్టీలు, నాలుగో కేటగిరీలో స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు కొత్త గుర్తులను పంపిచే అవకాశం ఉందని ఆదేశాల మేరకు సింబల్ కేటాయించాలన్నారు. నామినేషన్ ప్రక్రియలో అర్హత ఉన్న వారిని అనర్హులుగా, అనర్హులను అర్హులుగా ప్రకటించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్ సమర్పించాలన్నారు. పోలింగ్ స్టేషన్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పోలింగ్ సిబ్బంది, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాటు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్‌లో ఎలాంటి పొరాపాట్లు జరగనివ్వకూడదన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లను చేయించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 299 ఎంపీటీసీ స్థానాలకు, 25 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వేణు, డిప్యూటీ సీఈవో గోవిందు, ఏవో కృష్ణమూర్తి, ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీడీవో టీవీఎస్ గోపిబాబు, మాస్టర్ ట్రైనీలు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...