అగ్నిమాపక శాఖకు ఆధునికపరికరాలు


Mon,April 15, 2019 02:19 AM

-ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు
-ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు
-అందుబాటులో అత్యాధునిక పరికరాలు
నిజామాబాద్ క్రైం: మహారాష్ట్రలోని ముంబయి మహానగర అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న వారిలో 66మంది అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా ఓ భారీ అగ్నిప్రమాదంలో మంటలు ఆర్పేందుకు వెళ్లి తమ ప్రాణాలు కోల్పోయారు. 1944 ఏప్రిల్ 14న ముంబయి విక్టోరియా డాక్‌యార్డ్ నుంచి స్కలైన్ షిప్ లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వ విదేశాలకు మందుగుండు సామగ్రిని తరలిస్తుండగా ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది మంటలను ఆర్పేందుకు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే మంటలు భారీగా ఎగిసి పడుతుండడంతో వాటిని ఆర్పేందుకు రంగంలోకి దిగారు. విధివశాత్తు అక్కడ విధులు నిర్వహించేందుకు వచ్చిన సిబ్బంది 66మంది ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు. వీరితో పాటు మరో 230 మంది సామాన్య ప్రజలు సైతం ఆ ప్రమాదంలో తగలబడిపోయారు.

ఆ రోజు జరిగిన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక శాఖ అధికారులు,సిబ్బందిని స్మరిస్తూ ఏటా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20 వరకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అమరులైన ఉద్యోగులకు శ్రద్ధ్దాంజలి ఘటించి మౌనం పాటిస్తారు. అనంతరం వారం పాటు అగ్నిప్రమాదాల నుంచి ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలో జనానికి సూచిస్తూ అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రభుత్వం అగ్నిమాపక శాఖకు అత్యాధునిక సామగ్రి, పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు వీటి ద్వారా సత్వరం చర్యలు చేపట్టవచ్చు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఆ శాఖ వద్ద అందుబాటులో ఉన్న పరికరాల గురించి అందిస్తున్న ప్రత్యేక కథనమిది.

ప్రమాదాల నియంత్రణకు వినియోగిస్తున్న పరికరాలు, వాటి ఉపయోగాలు:

మిస్ట్ జీప్: ఇరుకైన ప్రాంతాల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఈ మినీ జీప్‌ను వినియోగిస్తుంటారు.

ఎంటీపీ (మల్టీ పర్పస్ టెండర్) : ఈ వాహనంలో మంటలు ఆర్పేందుకు ఉపయోగపడే (వాటర్, ఫోమ్, డ్రై కెమికల్ పౌడర్) అనే మూడు రకాల పదార్థాలు ఉంటాయి.

డీటీపీ(డ్రై కెమికల్ పైప్‌లు) : ఫోమ్ అత్యంత త్వరగా మంటలు ఆర్పేందుకు ఈ ఫోమ్ దోహదపడుతుంది.

హ్యాండ్ కంట్రోల్: లండన్ బ్రాంచ్‌కు చెందిన దీనిద్వారా తమ చేతి నుంచే అవసరమైన మేరకు నీటిని వదలడానికి వినియోగిస్తారు.

రివాలింగ్ బ్రాంచ్: గాలి రాకుండా పొగ కమ్ముకుపోయిన గదిలో దీనిని వినియోగించి మంటలను ఆర్పుతారు.

ఓజ్‌రిల్ : చిన్నపాటి అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు దీనిని వాడుతారు.

ఫోమ్ మేకింగ్ బ్రాంచ్ (ఎఫ్‌ఎమ్‌బీ): నురగలు, వాటర్ కలిసిన బ్లాంకెటింగ్. దీనిని పెట్రోల్ ప్రమాదాల నియంత్రణకు ఉపయోగిస్తారు.

షటర్ లాక్ కట్టర్: పెద్ద షటర్‌లు ఉన్న గోదాములు, ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు వాటికి సంబంధించిన తాళాలు అందుబాటులో లేని సమయంలో దీని ద్వారా ఆ షటర్లను కత్తిరించి లోనికి వెళ్లేందుకు ఉపయోగిస్తారు.

లేటెస్ట్ హ్యాండ్ కంట్రోల్ : త్రిబుల్ పర్పస్.. దీనిలోంచి ఫాగ్ మంచులాంటి స్ప్రేతో కూడిన కెమికల్‌తో మంటలు ఆర్పుతారు.

డివైడింగ్ బ్రాంచ్; ఎక్కడైనా రెండువైపుల మంటలు వ్యాపించిన సమయంలో దీని ద్వారా ఒకే సమయంలో రెండువైపులా నీటిని విడుదల చేసి మంటలు అదుపుచేస్తారు.

ఓస్ పైప్: వీటితో నీటిని విడుదల చేస్తారు.

బ్యాక్ రిమోటెడ్ పంప్ : అధిక ప్రెషర్‌తో నీటిని బయటకు విడుదల చేస్తుంది.

అస్కలైట్: అటవీ ప్రాంతాలు, చీకటి ప్రదేశాల్లో అగ్నిప్రమాదాలు సంభవించిన సమయంలో అక్కడ ఈ లైట్‌ను వినియోగిస్తారు. ఇది బెలూన్‌ల పైకి లేచి వెలుతురు ఇస్తుంది.

పోర్ట్టబుల్ పంప్: మంటలు ఆర్పుతున్న సమయంలో వాహనంలో నీళ్లు అయిపోయిన సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా నీరు అందుబాటులో ఉంటే, దీనిద్వారా ఆ నీటికి వాహనంలోకి ఎక్కించుకొనేందుకు ఉపయోగపడుతుంది.

లైఫ్ జాకెట్ : నీటి ప్రవాహంలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు దీనిని ధరిస్తారు.

అజ్ బెస్టస్ సూట్: మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు దీని ధరించి లోనికి వెళ్తారు. దీనిని ధరించడంతో విద్యుత్ షాక్ తగలదు.

బీఏ సెట్: బ్రీత్ ఆపరేటింగ్.. ఎక్కడైనా లోతైన బావులు, ఇతర ప్రదేశాల్లో విష వాయువులు ఉన్నట్లయితే, దీనిని ధరించి లోనికి వెళతారు. దీని నుంచి వచ్చే ఆక్సిజన్ సిబ్బందికి రక్షణగా పనిచేస్తుంది.

లైఫ్ బాయ్ : నీటిలో ఉన్న వారిని రక్షించేందుకు దీనిని వినియోగిస్తారు.

ఏబీ ఫైర్ యాక్టింగ్ విహార్: ఇందులోంచి నురగలతో కూడిక కెమికల్ వస్తుంది. దీంతో మంటలు ఆర్పవచ్చు.

డీసీపీ: డ్రై కెమికల్ పౌడర్ ఉంటుంది. దీనిని ప్రధానంగా విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగిన సమయంలో ఉపయోగిస్తారు.

వాటర్ టైప్: నీటితో కలిసిన పదార్థం వస్తుంది.

డ్రాగన్ లైట్ : చీకటిగా ఉన్న ప్రదేశాల్లో దీని ఉపయోగం చాలా ఉంటుంది.

సిబ్బంది కొరత ఉంది..
రాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాపక శాఖకు సరిపడా నిధులు మంజూరు చేస్తున్నది. ప్రస్తుతం జిల్లాలో సిబ్బంది కొరత ఉంది. ఖాళీలు భర్తీ అయితే మరింత మెరుగైన సేవలు అందిస్తాం. అగ్నిప్రమాదాలు సంభవించకుండా ప్రజలు జాగ్రత్త వహించాలి. నిర్లక్ష్యంతోనే ఎక్కువగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.అగ్నిమాపక శాఖ వారోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రజలు సహకారం అందించాలి. వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అగ్నిప్రమాదాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
-జి.మురళీమనోహర్‌రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి
ఉమ్మడి జిల్లాలో 10 అగ్నిమాపక కేంద్రాలు..
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో 10 అగ్నిమాపక కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాటిలో నిజామాబాద్ పరిధిలో నిజామాబాద్ నగరం, నిజామాబాద్ రూరల్ పరిధిలోని ఇందల్వాయి, ఆర్మూర్, బోధన్‌లో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, మద్నూర్‌ల్లో అగ్నిమాపక కేంద్రాలతో పాటు భీంగల్, గాంధారి మండలాల్లో మరో రెండు ఔట్‌పోస్టులు పనిచేస్తున్నాయి.

147
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...