ఓటెత్తారు..


Fri,April 12, 2019 01:49 AM

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసాయి. ఈవీఎంల మొరా యింపు.. ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావ డం.. ఎర్రటి ఎండ వేధించినప్పటికీ వాటిని లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఈ నియోజకవర్గం నుంచి 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 ఈవీఎంలతో నిర్వహించిన పోలింగ్ మొత్తానికి సజావుగా ముగియడంతో జిల్లా అధికార యంత్రాం గం ఊపిరి పీల్చుకుంది. సాయంత్రం 6 గంటల వరకు నమోదైన పోలింగ్‌ను బట్టి 68.10 శాతం పోలింగ్ నమోదైంది. 2014లో 68.87 శాతం పోలింగ్ నమోదు కాగా.. గతంతో పోల్చితే కొంత పోలింగ్ శాతం తగ్గింది. ఈవీఎంల మొరాయిం పు, సాంకేతిక లోపాలతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ దశలో అధికారులపై ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉదయం వేళల్లో ఈవీఎంల మొరాయిపుంతో పోలింగ్ మందకొడిగా సాగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ వేగం పుంజుకున్నది. సాయం త్రం 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా ఓట్ల గల్లంతుపై ఎలాంటి ఫిర్యాదులు జరగలేవు.

మొరాయించిన ఈవీఎంలు..
మోస్ట్ అడ్వాన్స్‌డ్ (ఎం-3) విధానంలో ఈవీఎంలతో తొలిసారిగా నిర్వహించిన ఈ పో లింగ్ కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 600 మంది ఇంజినీర్ల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. ఉదయం మాక్‌పోలింగ్ ని ర్వహించిన అధికారులు.. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియను ప్రారంభించాలి. కానీ, చాలాచోట్ల అనుకున్న సమయానికి పోలింగ్ ప్రా రంభం కాలేదు. ఈవీఎంలు మొరాయించడం, సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. దీంతో కొన్ని గ్రామాల్లో గంట, గంటన్నర పాటు ఆలస్యంగా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఉదయం ఈవీఎంల మొరాయింపుతో 9 గంటలకు పోలింగ్‌శాతం 3.60గా నమోదైంది. 11 గంటలకు 13.80, మధ్యాహ్నం ఒంటి గంటకు 38.10, మధ్యాహ్నం 3 గంటలకు 45.29, సాయంత్రం 5 గంటలకు 54.20 శాతంగా పోలింగ్ నమోదైంది. ఆరు గంటల సమయంలో కూడా కొంత మంది ఓటు వేసేందుకు రావడంతో అందరికీ ఓటు హక్కును కల్పించారు. ఈ క్రమంలో మొత్తం పోలింగ్ శాతాన్ని సేకరించేందుకు అధికారులు రాత్రి వరకు సమయం తీసుకున్నారు.

ఈవీఎంల అమరికతో ఇబ్బందులు..
పోలింగ్ బూత్‌ల్లో 12 ఈవీఎంలు పెట్టడంతో కొందరు ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. అధికారులను అడిగి ఓటువేశారు. ఒక్కో చోట ఒక్కో అమరికలో ఈవీఎంలు అమర్చారు. దీంతో కొంత ఓటర్లకు అసౌకర్యం ఏర్పడింది. ఇబ్బందులు పడ్డారు. వేసవితాపం తీవ్రంగా ఉండడం, కొంత మంది అనాసక్తి కారణంగా పోలింగ్ శాతం తగ్గినట్లు తెలుస్తోంది. నవీపేట మండలం పొతంగల్‌లో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా పోలింగ్ నిర్వహణకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రెండు, మూడు చోట్ల మినహా ఈవీఎంల మొరాయింపు ఎక్కడా తలెత్తలేదు. కమ్మర్‌పల్లిలో పోలింగ్ కేంద్రాన్ని టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పరిశీలించారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వేల్పూర్‌లో, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి చౌట్‌పల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హాసాకొత్తూర్, మోర్తాడ్‌లోని పోలింగ్ కేంద్రాలను, భీమ్‌గల్‌లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సీపీ కార్తికేయ పరిశీలించారు.

రూరల్ సెగ్మెంట్‌లో గంటల తరబడి క్యూలో..
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను, ఎన్నికల సరళిని రూరల్ నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్ అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఆర్మూర్ మండలంలోని కోమన్‌పల్లి గ్రామంలో ఈవీఎం కొద్దిసేపు మొరాయించింది. నందిపేట్, నందిపేట్ రూరల్, మాక్లూర్, ఆర్మూర్ రూరల్ మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోధన్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అనేకచోట్ల పోలింగ్ ప్రారంభంలోనే ఈవీఎంలో సాంకేతిక లోపలు తలెత్తాయి. పలు పోలింగ్ కేంద్రాల్లో అరగంట నుంచి గంటన్నర పాటు పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఓటర్లు ఇబ్బంది ఎదుర్కొన్నారు. బోధన్ మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని విలీనం చేయవద్దంటూ చెక్కి క్యాంపు గ్రామస్తులు ఓటింగ్‌ను బహిష్కరించారు. అనంతరం టీఆర్‌ఎస్ ప్రముఖుల జోక్యంతో గురువారం సాయంత్రం ఓటింగ్ ప్రారంభం కావడంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

నిజామాబాద్ అర్బన్‌లో పెరిగిన పోలింగ్..
2014 ఎన్నికలతో పోల్చితే ఈసారి నిజామాబాద్ అర్బన్‌లో పోలింగ్ శాతం పెరిగింది. అప్పుడు 51.86 శాతం మేర పోలింగ్ అయ్యింది. తాజాగా ఇది 60శాతానికి పైగా చేరుకుంది. మైనార్టీ కాలనీల్లో పెద్ద మొత్తంలో ముస్లింలు ఓటు వేసేందుకు బారులు తీరారు. నగరంలోని వినాయక్‌నగర్, గాయత్రీనగర్, కోటగల్లీ, ఖిల్లా రోడ్డు, ఆర్యనగర్ ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. భారీ ఎత్తున ప్రజలు క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటు వేయడానికి ఓటర్లు బారులు తీరారు. వృద్ధులకు, దివ్యాంగులకు వీల్‌చైర్లను సమకూర్చడంతో వారు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, సుమారు రెండు గంటల వరకు పోలింగ్ శాతం పెరగలేక పోయింది. 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎండ అధికంగా ఉండడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువగా రాలేదు. సాయంత్రం 4గంటల అనంతరం మళ్లీ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.

అర్వింద్ దాదాగిరీ..
నిజామాబాద్ నగరంలోని శంకర్‌భవన్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి తన అనుచరులతో వచ్చిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ దాదాగిరీ చేశారు. అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నా.. అనవసరంగా అధికారులతో, టీఆర్‌ఎస్ నాయకులతో ఆయన వాగ్వాదానికి దిగారు. కొంతమంది అర్వింద్ అనుచరులు టీఆర్‌ఎస్ కార్యకర్తలపై చేయిచేసుకోవడంతో గొడవ ముదిరింది. స్థానికంగా ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురిని సముదాయించారు. మధ్యాహ్నం వేళలో ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. సాయంత్రం వేళలో రైతులు, కూలీలు, కార్మికులు ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు.

జగిత్యాల, కోరుట్లలో పోలింగ్ ప్రశాంతం..
నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలోకి వచ్చే జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 5గంటల వరకే జగిత్యాలలో 61శాతం, కోరుట్లలో 59.05 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఒకటి, రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఓటింగ్ కార్డు ఉన్నప్పటికీ ఎన్నికల అధికారులు ఏదైనా ఐడీకార్డు కావాలని ఓటర్లను ఇబ్బంది పెట్టిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా.. ఏ ఐడీకార్డు అవసరం లేకుండా ఓటు వేయవచ్చని ఆయన సూచించారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...