పోలింగ్ @ 71.79%


Fri,April 12, 2019 01:48 AM

బోధన్, నమస్తే తెలంగాణ: అక్కడక్కడా ఈవీఎంల మోరాయింపు, చెదురుమదురు ఘటనల మినహా బోధన్ నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగగా పలు చోట్ల కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. నియోజకవర్గంలో మొత్తం 246 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 గంటల వరకు కేవలం 12.13 శాతం పోలింగ్ మాత్రమే నమోదుకాగా ఒంటి గంట వరకు 39.20 శాతం పోలింగ్ మాత్రమే నమోదయింది. సాయంత్రం 3 గంటలకు 53.09 శాతం, సాయంత్రం 5 గంటలకు 61.01 శాతం పోలింగ్ నమోదయింది. తుది పోలింగ్ 71.79 శాతంగా నమోదయింది. నియోజకవర్గంలో మొత్తం 2,06,244 మంది ఓటర్లు ఉండగా, 1,48,360 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించు కున్నారు. వీరిలో పురుషులు 70,324 మంది, మహిళలు 78,036 మంది ఉన్నారు.

ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం..
ఎడపల్లి: మండలంలోని ఎంఎస్‌సీ ఫారం, ఠానాకలాన్ గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. కుర్నాపల్లి, మంగల్‌పాడ్ గ్రామాల్లో నీడ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు ఒకచోట క్యూలైన్ ఒకచోట ఉండడంతో ఓటర్లు ఎండలో నిలబడాల్సి వచ్చింది.

పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్సీ..
జాన్కంపేట్, ఠానాకలాన్, పోచారం గ్రామాల్లో పోలింగ్ సరళిని ఎమ్మెల్సీ ఆకుల లలిత పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక టీఆర్‌ఎస్ నాయకులతో చర్చింగా.. మండలంలో కవితకు 5 వేలకు పైగా మెజారిటీ వస్తుందని ఆమెతో వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సామాజిక పోరాట సమితి అధ్యక్షుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

మొరాయించిన ఈవీఎంలు...
బోధన్ రూరల్: బోధన్ మండలం సాలూరా, కల్దుర్కి గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రరంభమైంది. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సాలూరలో రెండు గంటలు, కల్దుర్కిలో 45 నిమిషాల పాటు ఈవీఎంలు పని చేయలేదు.

అమ్దాపూర్ గ్రామస్తుల ఆగ్రహం..
అమ్దాపూర్ గ్రామంలో ఈవీఎంలు ఏర్పాటు చేసిన ముందు భాగం నుంచి ఓటర్లును పంపించకుండా 12వ నంబర్ ఈవీఎం వద్ద నుంచి నుంచి ఎంట్రెన్స్ ఏర్పాటు చేయడంపై గ్రామస్తుల మండి పడ్డారు. ఎక్కువ సంఖ్యలో ఈవీఎంలు ఉండడంతో ఓటు వేయాలనుకున్న గుర్తులు కనిపించలేదని, ఎవరికి ఓటు వేశామో తెలియలేదని పలువురు వాపోయారు. సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీపీ గిర్దావర్ గంగారెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సంజీవ్‌కుమార్ పోలింగ్ కేంద్రానికి చేరుకొని అధికారులను నిలదీశారు.

దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
శక్కర్‌నగర్: బోధన్ పట్టణంలో పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగుల కోసం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంటి నుంచి తీసుకువచ్చేందుకు రవాణా సౌకర్యంతో పాటు ప్రతి కేంద్రానికో వీల్‌చైర్, సహాయకుడిని నియమించారు. పలు పోలింగ్ కేంద్రాలను ఐసీడీఎస్ సీడీపీవో లలితాకుమారి సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పలు పోలింగ్ కేంద్రాలను ఆర్డీవో కె.గోపీరాం తనిఖీ చేశారు. ఓటర్లకు ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును ఏసీపీ రఘుతో పాటు, ఎస్‌హెచ్‌వో నాగార్జున గౌడ్ పర్యవేక్షించారు.

79శాతం పోలింగ్..
రెంజల్: మండలంలో 79.29 శాతం పోలింగ్ నమోదైనట్లు తహసీల్దార్ అసదుల్లాఖాన్ తెలిపారు. మొత్తం 34 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, కందకుర్తిలో 123, దూపల్లిలో 154, 155, రెంజల్‌లో 142 కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును బోధన్ రూరల్ సీఐ షాకిర్ ఆలీ, రెంజల్ ఎస్సై శంకర్ పర్యవేక్షించారు.

నవీపేటలో ప్రశాంతంగా..
నవీపేట: మండలంలోని మొత్తం 54 పోలింగ్ కేంద్రాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండల కేంద్రంలోని బాలుర పాఠశాల కేంద్రంలో ఓ పార్టీకి చెందిన ఏజెంట్ ప్రచారం చేస్తున్నడాని మరో వర్గం నాయకులు అభ్యంతరం చెప్పడం కొంత ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సీఐ శ్రీనాథ్‌రెడ్డి అక్కడకు చేరుకొని ఇరు పార్టీలకు చెందిన నాయకులను బయటకు పంపించడంతో వివాదం సద్దు మణిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శివతండాకు చెందిన ఓ బాలింత చిన్నారిని ఎత్తుకొని వచ్చి ఓటు హక్కును వినియోగించకుంది. మండలంలో 74.47 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...