రక్తశుద్ధిపై చిత్తశుద్ధి


Mon,March 18, 2019 02:35 AM

ఖలీల్‌వాడీ: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఎంపీ కవిత కృషితో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం పేద రోగులకు వరంలా మారింది. కిడ్నీ వ్యాధిగ్రస్తుల పాలిట డయాలసిస్ కేంద్రం సంజీవనిగా నిలుస్తున్నది. ఈ సేవల కోసం గతంలో పడిన బాధలను వ్యయప్రయాసలను దూరం చేస్తున్నది. తెలంగాణ సర్కార్‌కు. సీఎం కేసీఆర్‌కు దీవెనలందిస్తున్నది. అందరికీ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తున్న దవాఖానలను ఆధునీకరిస్తూనే పేదలకు అవసరమైన అధునాతన పరికరాలను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఎంపీ కల్వకుంట్ల కవిత కృషితో డయాలసిస్ సెంటర్‌ను గతేడాది ఏర్పాటు చేశారు. రూ. 2 కోట్ల నిధులతో అత్యాధునిక వసతులు కల్పిస్తూ జిల్లాలో ఏ ప్రైవేట్ ఆస్పత్రుల్లో లేని విధంగా సింగిల్ డయాలసిస్ మిషన్లు తీసుకువచ్చారు.

దీంతో ఒక్క డయాలసిస్ పేషంట్‌కు ఒక్కసారి మాత్రమే చేయడం జరుగుతుంది. ప్రైవేట్ దవాఖానలో రెండు మూడు సార్లు డయాలసిస్ చేస్తారు. దీంతో శుద్ధి సక్రమంగా జరగదు. అందుకే సింగిల్ డయాలసిస్ మిషన్లను తీసుకువచ్చారు. రోజుకు నలభై మంది డయాలసిస్ వ్యాధిగ్రస్తులు డయాలసిస్‌ను చేయించుకుంటున్నారు. ఇప్పటి వరకు జిల్లా ప్రభుత్వ దవాఖానలో 43,800 మంది రోగులు సేవలు పొందారు. ఒక్క పేషంట్ ప్రైవేట్ దవాఖానలో డయాలసిస్ చేయించుకుంటే సుమారు రూ.30వేల నుంచి రూ. 40వేల వరకు ఖర్చవుతుంది. ఆరోగ్యశ్రీ ద్వారా కూడా సేవలందిస్తున్నారు.

డయాలసిస్ సేవలు రెండు రకాలు...
కిడ్నీలు సరిగ్గా పనిచేయని వారికి అందించే సేవలను డయాలసిస్ వైద్యం అంటారు. ఇందులో రెండు విధానాలు ఉంటాయి. ఒకటి పెరిటోనియల్. మనం తీసుకునే ఆహారంలో ఏదైన విష పదార్ధం కలిగి ఉండడంతో కిడ్నీలు ఫంక్షనింగ్ చేయని సమయంలో పెరిటోనియల్ పద్ధతిలో కడుపులోకి వ్యాక్సిన్లు పంపి క్లీన్ చేస్తారు. మరొక పద్ధతి ఏవీ ఫిస్టుల ద్వారా శరీరంలోని చేరిన చెడు పదార్థాలను తొలగించి అవసరమైన మోతాదులో కాల్షియం, సోడియం, పోటాషియం వంటి పదార్థాలను శరీరంలో నిలకడగా ఉంచి, మిగతా వాటికి రక్తాన్ని శుద్ధి చేసి శరీరం నుంచి తొలగిస్తారు. ఇలాంటి సేవలను ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా ఖర్చు లేకుండా పేదలకు అందిస్తోంది.

గత పాలకుల చిన్నచూపు...
గతంలో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు సర్కారు వైద్యాన్ని పట్టించుకున్నది లేదు. రోగులు విధి లేని పరిస్థితుల్లో కార్పొరేట్, ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోయారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ వైద్యానికి ధీటుగా నూతన హంగులతో అత్యాధునిక టెక్నాలజీతో మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేద రోగులకు ఆరోగ్య భరోసా కల్పిస్తున్నది. బంగారు తెలంగాణలో భాగంగా ప్రభుత్వ దవాఖానలను మల్టీ స్పెషాలిటీ దవాఖానలుగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. రోగులకు సరిపడే మందులను ఉచితంగా ఇస్తున్నది.

ఖర్చుతో కూడుకున్న పని...
మూత్రపిండాల వ్యాధి ఉన్న రోగి వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాలి. ఇది ఖర్చుతో కూడుకున్న పని. ఇది ప్రైవేట్ దవాఖానలో ఒక్క సిట్టింగ్‌కు రూ. 5వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్‌కు ముందు కార్పొరేట్ దవాఖానల్లో వేల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఆస్తులను సైతం అమ్ముకునే పరిస్థితి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం బృహత్తరమైన ఈ డయాలసిస్ సెంటర్లను ఏర్పాటుచేసి నిరుపేదలకు అండగా నిలుస్తోంది.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...