కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం


Sat,March 16, 2019 12:45 AM

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: పార్లమెంటు ఎన్నికల శంఖారావంలో భాగంగా కరీంనగర్ తర్వాత సీఎం కేసీఆర్ రెండో సభ ఇందూరులోనే జరగబోతున్నదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పాల్గొనే భారీ బహిరంగ సభా స్థలాన్ని ఎంపీ కవితతో కలిసి మంత్రి శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని సీఎం కేసీఆర్ ఈనెల 19న ఇందూరు వేదికగా పూరిస్తారన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి పనులు మొదలైనట్లు చెప్పారు. పనులన్నీ చురుగ్గా, మంచి ప్లానింగ్‌తో జరుగుతున్నాయని, సభకు వచ్చే వారందరికీ తాగునీటి సౌకర్యం కల్పించడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయన్నారు. ఈ బహిరంగ సభకు దాదాపు 2లక్షల పైచిలుకు ప్రజలు హాజరవుతారని. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలు ప్రధాని మోదీ మీద తీవ్ర కోపంతో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్లు పాలించిందని, ఇరవై ఏళ్లు బీజేపీ వాళ్లు పాలించారన్నారు. కానీ, తెలంగాణకు ఏమీ లాభం లేకుండా పోయిందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు ఎట్లా ఇస్తారని, తెలంగాణలో కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు నిధులు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. దేశంలో తెలంగాణ ప్రజలు భాగం కాదా? తెలంగాణ రాష్ట్రం దేశంలో భాగం కాదా? మరీ తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వరన్నారు. దీనిపై ప్రధాని మోడీపై తెలంగాణ ప్రజలు కోపంగా ఉన్నారని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ వచ్చి ఇవన్నీ విడమరిచి చెప్పి ఎందుకు టీఆర్‌ఎస్ పార్టీకి పదహారుకు పదహారు ఎంపీ స్థానాలు ప్రజలు గెలిపించాలో వివరిస్తారని తెలిపారు. ఎంఐఎంకు ఒక స్థానాన్ని గెలిపించుకొని పదహారు స్థానాలు మొత్తం టీఆర్‌ఎస్ పార్టీ వాళ్లే గెలవాలని, గెలిచి ఢిల్లీలో ఎవరున్నా సరే వారిని శాసించి మన తెలంగాణకు రావాల్సిన నిధులను తెచ్చుకునే విధంగా తెలంగాణ ప్రజలు ఆలోచన, నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఎంపీ కవితను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చి పంపించాలనే కృతనిశ్చయంతో మేమందరం ఉన్నామని, ఎమ్మెల్యేలందరం కూడా ఒక సామాన్య కార్యకర్తలుగా పనిచేసి కవితకు రాష్ట్రంలోనే బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో కూడా ప్రజలకు ఇంకా తెలియని పరిస్థితిలో ఉన్నారని, తమ విజయానికి ఏమీ ఢోకా లేదని, సీఎం కేసీఆర్ మొదటి సభ కరీంనగర్‌ను ఎంచుకొని, రెండో సభ నిజామాబాద్‌ను ఎంచుకున్నారని తెలిపారు. ఇక్కడి నుంచి సీఎం కేసీఆర్ ప్రజలకు మార్గనిర్దేశం చేయబోతున్నారని అన్నారు.

భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం
- ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా
బిగాల గణేశ్ గుప్తా మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే నిజామాబాద్ నుంచి పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేశామో, అదే నిజామాబాద్ గ్రౌండ్ నుంచి పార్లమెంటరీ నియోజకవర్గ సభను నిర్వహిస్తామన్నారు. ఎంపీ కవిత స్టార్ క్యాంపెయినర్ కాబట్టి, ఆమెకు ఒక ఇమేజ్, మహిళల్లో ఒక ప్రత్యేకత ఉన్నదన్నారు. కచ్చితంగా ఎంపీ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు.

50వేల మందిని తరలిస్తాం : ఎమ్మెల్యే బాజిరెడ్డి
బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఈనెల 19న నిర్వహించే బహిరంగ సభకు నిజామాబాద్ రూరల్ నుంచి 50వేల మంది ప్రజలు తరలిస్తామన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేకు ఎంతటి మెజార్టీ వచ్చిందో అంతకంటే రెండింతలు ఎంపీ కవితకు రాబోయే ఎంపీ ఎలక్షన్‌లో రాబోతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీగౌడ్, నగర మేయర్ ఆకుల సుజాత, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ గడ్డం సుమనారెడ్డి, రెడ్‌కో చైర్మన్ ఎస్‌ఏ అలీం, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు దాదన్నగారి విఠల్‌రావు, తారీఖ్ అన్సారీ, జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, కార్పొరేటర్ కడారి శ్రీవాణి, నాయకులు సత్యప్రకాశ్, సుజిత్‌సింగ్ ఠాకూర్, రాజారాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...