నిధులిచ్చినా.. నిర్లక్ష్యం..!


Thu,February 14, 2019 03:04 AM

-ముందుకు సాగని బాసర నాలుగువరుసల రోడ్డు నిర్మాణ పనులు
-కాంట్రాక్టు ఏజెన్సీ నిర్లక్ష్యంతోఎక్కడి పనులు అక్కడే
-మార్చి 31తో ముగియనున్న పనుల గడువు
-25 శాతమే పనులు మాత్రమే పూర్తి
-కాంట్రాక్ట్ రద్దుకు ఈఎన్‌సీకి అధికారుల లేఖ
-ఇబ్బందులు ఎదుర్కొంటున్నవాహనదారులు, ప్రయాణికులు
నవీపేట: జానకంపేట్ నుంచి ఫకీరాబాద్ వరకు రూ.55 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు విస్తరణ పనులు నత్త నడకన కొనసాగుతున్నాయి. రోడ్డు నిర్మాణ కాంట్రాక్టు పొందిన సరళ ఏజెన్సీ నిర్లక్ష్యం కారణంగానే పనులు ముందుకు సాగడం లేదని సంబంధిత అధికారులు తెలిపారు. దక్షిణ భారత దేశంలోనే ప్రసిద్ధి గాంచిన చదువుల తల్లి కొలువుదీరిన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం రాష్ట్రంతో పాటు దేశ నలు మూలల నుంచి బాసరకు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ కవిత, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని బాసర రోడ్డు విస్తరణకు ప్రభుత్వం నుంచి రూ.55 కోట్లు మంజూరు చేయించారు. 10 నవంబర్ 2016న అప్పటి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

కాగా, పనులు దక్కించుకున్న సరళ ఏజెన్సీ కొద్ది రోజుల పాటు రోడ్డు విస్తరణలో భాగంగా జానకంపేట్ నుంచి ఫకీరాబాద్ వరకు 14.5 కిలోమీటర్ల పొడువు పనులను చేపట్టి, రోడ్డు పొడవునా 73 కల్వర్టులు నిర్మించాల్సి ఉంది. కానీ, సదరు సంస్థ రోడ్డుకు వన్‌సైడ్ మాత్రమే కంకర వేస్తూ బీటీ వదిలి పెట్టింది. కాంట్రాక్టర్ కల్వర్టుల కోసం తవ్విన గుంతలను అలాగే వదిలి వేయడంతో బాసర తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తున్నది. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా, కాంట్రాక్టు పొందిన సరళ ఏజెన్సీ కుంటి సాకులు చెబుతూ పనుల్లో వేగం పెంచడం లేదు. దీంతో ఈ రోడ్డు గుండా నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డును తవ్వి అలాగే వదిలి వేయడంతో గుంతల్లో పడి వాహనదారులు మరణిస్తున్నారు. ప్రమాదానికి గురై మరణించిన వారిలో నాందేడ్ జిల్లా కేంద్రానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి హోంకార్ భరత్ చౌదరి, బీడీ కమీషన్ దారుడు రాజేశ్వర్(నవీపేట), సోలంకి ఉత్తం(బాసర), ఎల్లిగడ్డల సచిన్‌తో పాటు మరో ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మరో 16 మంది గాయపడ్డారు.

25 శాతమే పనులు పూర్తి...
పనులు ప్రారంభమై 27 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం 25శాతం పనులు మాత్రమే పూర్తి చేయడంపై వాహనదారులు, ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సదరు నిర్మాణ కంపెనీ నిర్లక్ష్యంతోనే పనుల్లో జాప్యం జరుగుతున్నది. ఇప్పటి వరకు కేవలం కల్వర్టులు మాత్రమే పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టారు. మిగతా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి.
మార్చి 31తో ముగియనున్న గడువు...
బాసర నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం మార్చి 31 నాటికి పూర్తిచేయాలి. గడువు సమీపిస్తున్నా సదరు కంపెనీకి చలనం లేకుండా పోయింది. బాసర రోడ్డు విస్తరణ పనులను 28 నెలల అగ్రిమెంట్ కింది సంబంధిత కంపెనీ ఒప్పందం చేసుకొని పనులు ప్రారంభించింది. ఇప్పటి వరకు 26 నెలలు గడిచినా రోడ్డు నిర్మాణంలో వేగం పుంజుకోవడం లేదు. దీంతో ప్రమాదాలు నిత్య కృత్యంగా మారాయి.

భక్తుల అవస్థలు...
చదువుల తల్లి జ్ఞాన సరస్వతి దర్శించుకునేందుకు బాసరకు వచ్చే భక్తులు ఈ రోడ్డు గుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ చేరుకుంటున్నారు. సంబంధిత నిర్మాణ కంపెనీ రోడ్డును ఎక్కడ పడితే అక్కడ తవ్వి అలాగే వదిలి పెట్టడంతో వాహనాలు ఆ గుంతలో పడుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి బాసర గోదావరి నదిలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు తెస్తుంటారు. ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తూ భక్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. దీనికి తోడు సంబంధిత అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా రోడ్డు నిర్మాణంలో పెద్దగా పురోగతి కనిపించడం లేదు.
రోడ్డు నిర్మాణంలో తీవ్ర జాప్యం చేస్తున్న సదరు నిర్మాణ ఏజెన్సీ కాంట్రాక్టును రద్దు చేయాలని ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ)కి ఆర్‌అండ్‌బీ అధికారులు లేఖ రాశారు. గడువు నెల రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, రోడ్డు విస్తరణ పనుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం లేదని అధికారులు లేఖలో పేర్కొన్నారు. పై అధికారుల నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సదరు నిర్మాణ ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ అంజయ్య తెలిపారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...