కులవృత్తులకు జీవం పోసిన కేసీఆర్


Thu,February 14, 2019 03:01 AM

కామారెడ్డి, నమస్తే తెలంగాణ: ఆదరణ కోల్పోతున్న కుల వృత్తులకు సీఎం కేసీఆర్ జీవం పోస్తున్నారని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా రూ. 1.05 కోట్లతో నియోజకవర్గంలోని 21 మంది లబ్ధిదారులకు బుధవారం టాటా ఏస్ వాహనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని జనహిత భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం టీఆర్‌ఎస్ సర్కారు కృషి చేస్తున్నదని అన్నారు. నాలుగు సంవత్సరాల్లో మత్స్య అభివృద్ధి పథకం కింద నియోజకవర్గ పరిధిలో 13 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల భవనాలకు రూ. పది లక్షల చొప్పున మంజూరు చేసినట్లు చెప్పారు. రూ.7 కోట్లతో 1406 మందికి టీవీఎస్ మోపెడ్‌లు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. ఉచితంగా చేపపిల్లల విత్తనాలను అందించడంతో పాటు పెంపకం కోసం వనరులను కల్పిస్తున్నట్లు వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి కాగానే చెరువులు, కాల్వల ద్వారా చేపల పెంపకానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, కుల వృత్తుల వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, అందులో భాగంగానే కామారెడ్డి నియోజకవర్గంలో 300 మందికి రూ. 50 వేల చొప్పున వందశాతం సబ్సిడీ రుణాలు అందించినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి మాట్లాడుతూ.. మత్స్యకారులకు 75 శాతం సబ్సిడీతో వాహనాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. గత సంవత్సరం నియోజకవర్గంలో రూ. 36లక్షల 28వేలు వెచ్చించి వందశాతం సబ్సిడీపై ఐదు లక్షల చేప పిల్లలను పంపిణీ చేశామని తెలిపారు. రూ.కోటీ 30 లక్షలతో చేపల మార్కెట్ నిర్మాణానికి మత్స్య శాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ఐఎఫ్‌డీసీ పథకం ద్వారా సంచార చేపల అమ్మకానికి రెండు వాహనాలు, ఇన్సులేటెడ్ ట్రక్కులు మూడు, మహిళా మత్స్యకార సహకార సంఘాలకు ఐదు యూనిట్ల రివాల్వింగ్ ఫండ్ మంజూరు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పిప్పిరి సుష్మ, జిల్లా మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణిమ, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు సాయిబాబా, మార్కెట్ కమిటీ చైర్మన్ గోపీగౌడ్, మత్స్యకార సొసైటీ డైరెక్టర్ నామాల శంకర్, మత్స్యకారులు పాల్గొన్నారు.

137
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...