అధినేత వస్తున్నారు!


Sat,November 17, 2018 01:29 AM

-ఈనెల 22న ఆర్మూర్‌లో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ
-ప్రచార షెడ్యూల్ విడుదల
-ఆ తర్వాత జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వారీగా..
నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా నిర్వహించే ప్రచార సభల్లో భాగంగా ఎన్నికల సమరశంఖాన్ని ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఆరంభించనున్నారు. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లిన సందర్భంగా హుస్నాబాద్ సభ తర్వాత సీఎం కేసీఆర్ ఇందూరులోనే భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్‌లోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఈ భారీ బహిరంగ సభ విజయవంతమైంది. ఇక నియోజకవర్గాల వారీగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ప్రచార సభను ప్రారంభించనున్నారు కేసీఆర్. ఈనెల 22న ఆర్మూర్‌లో జరిగే ప్రచార సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఆ తర్వాత క్రమంలో జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా సీఎం కేసీఆర్ ప్రచార సభలు ఉంటాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత సాధారణ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిచిన టీఆర్‌ఎస్ కొత్త చరిత్రను సృష్టించింది. ఇపుడూ అదే ఊపుతో ముందకు సాగుతోంది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జిల్లాపై ప్రత్యేక నజర్ పెట్టారు. అన్నీ తానై దగ్గరుండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందేలా ఆమె వ్యూహ రచనచేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎంతో ప్రత్యేకంగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్మూర్‌లో అంటే సీఎం కేసీఆర్‌కు మొదటి నుంచి సెంటిమెంటు. గత సాధారణ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి జీవన్‌రెడ్డికి తొలి టికెట్‌ను ప్రకటించారు. ఇపుడు ముందస్తు ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాల వారీగా నిర్వహించే ప్రచార సభలను జిల్లా నుంచి తొలిగా ఆయన ఆర్మూర్‌ను ఎన్నుకున్నారు. ఇక్కడ నుంచి ఆ తర్వాత వరుసగా జిల్లాలోని నియోజకవర్గాల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలో రానున్నది.

జిల్లాపై కేసీఆర్ చెరగని ముద్ర
ఉద్యమ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, పోరాట బంధం, జిల్లా నేతలతో కొనసాగిన ఆత్మీయ బంధం ఎంతో బలమైనది, విలువైనది. జిల్లా పై ఆయనకు ఉన్న ప్రత్యేక అభిమానాన్ని, బాధ్యతను చాటుకుంటూనే ఉన్నారు. ఆయన పోరాట నేతృత్వంలో ఎమ్మెల్యేలుగా ఎదిగిన వారిని ఆయన తన కన్న కొడుకుల్లా చూసుకుంటారు. ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌ను తమ తండ్రి సమానుడిగా భావిస్తారు. ఇందూరు జిల్లాకు ఏం కావాలో గుర్తించి చేసి పెడుతున్న ప్రియతమ ముఖ్యమంత్రిగా ప్రజల్లో మనసుల్లో నిలిచిపోతున్నారు. అభివృద్ధిలో తెలంగాణ ఓరియంటేషన్‌లో కేసీఆర్ జిల్లాకు అందించిన పథకాలు ఆయనదైన ప్రత్యేక మార్కుగా నిలిచిపోతాయి. సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తుండడంతో సీఎం కేసీఆర్‌కు జిల్లా పై మరింత ప్రత్యేక మమకారం ఏర్పడింది. ఎంపీ కవిత అడిగిందే తడువుగా జిల్లా అభివృద్ధికి విరివిరిగా నిధులు మంజూరు కావడంతో రాష్ట్రంలోనే ఇందూరుకు ప్రత్యేక స్థానం దక్కుతోంది. అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి ఎంపీ కవిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ తనదైన ముద్రను జిల్లా పై వేసే క్రమంలో సఫలీకృతులవుతున్నారు.

అంకాపూర్ అంటే ఆది నుంచి అభిమానం
ఆర్మూర్ నియోజక వర్గాన్ని కేసీఆర్ ప్రేమతో చూసుకుంటారన్న పేరు ఉంది. ఇక్కడ ఫుడ్ పార్కు మంజూరు చేశారు. పనులు జరుగుతున్నాయి. రైతులకు, యువత ఉపాధికి ఇది దోహదపడుతుంది. పలు ఎత్తిపోతల పథకాలు మంజూరు చేశారు. ఆర్మూర్‌ను రెవెన్యూ డివిజన్ చేసి దశాబ్దాలుగా ప్రజలు చేస్తున్న డిమాండ్ నెరవేర్చారు. అంకాపూర్ రైతులు ఆదర్శ రైతులని కేసీఆర్ అభినందిస్తుంటారు. అంకాపూర్ గ్రామమంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆయన సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయనే స్వయంగా కారు నడుపుకుంటూ అంకాపూర్ వచ్చి పంటలను సందర్శించారు. రైతులతో మాట్లాడారు. మీరు ఎవరు అని అప్పట్లో రైతులు అడిగితే నేను విలేకరిని, మీరు పంటలు బాగా పండించడాన్ని పరిశీలించడానికి వచ్చానని చెప్పారు. నాయకుడిగానే కాకుండా రైతుగా అంకాపూర్‌ను కేసీఆర్ చూస్తారనడానికి ఇది నిదర్శనం. ఆర్మూర్‌లో ప్రముఖ ఆధ్మాత్మిక క్షేత్రమైన సిద్ధుల క్షేత్రాన్ని అభివృద్ధి పరిచారు. ఇక్కడి ప్రభుత్వ దవాఖానను వంద పడకల దవాఖానాగా మార్చారు. గత ఎన్నికల్లో ఆశన్నగారి జీవన్ రెడ్డికి రాష్ట్రంలోనే తొలి టికెట్ ప్రకటించారు. రాముడికి హనుమంతుడు ఎలాగో కేసీఆర్‌కు జీవన్ రెడ్డి అలాంటి వాడని ఎంపీ కవిత తరచూ పేర్కొంటారు. జీవన్ రెడ్డిపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం.

261
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...