నామినేషన్ల జోరు


Thu,November 15, 2018 12:56 AM

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ జోరందుకున్నది. బుధవారం ఒక్కరోజే జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు మొత్తం 10 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 12 నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ అయిన విషయం తెలిసిందే. తొలిరెండు రోజులు రెండు మాత్రమే నామినేషన్లు దాఖలు కాగా... 14న బుధవారం మంచి ముహూర్తం ఉన్నందున అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ముందుకు వచ్చారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి, బాల్కొండ నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఆశన్నగారి జీవన్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్ నుంచి బిగాల గణేశ్‌గుప్తా నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ఇంకా నామినేషన్లు ఎవరూ వేయలేదు. బాన్సువాడ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేయగా.. కాంగ్రెస్ అసమ్మతి నేత మాల్యాద్రిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నిజామాబాద్ అర్బన్ నుంచి ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా చక్రధర్ శర్మ నామినేషన్ వేయగా.. బుధవారం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బిగాల గణేశ్ గుప్తా నామినేషన్ వేశారు. అంతకు ముందు ఆయన కుటుంబ సమేతంగా విఠలేశ్వర ఆలయం, అయ్యప్ప ఆలయం, శ్రీకన్యకా పరమేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రత్యేకంగా తయారు చేయించిన అంబాసిడర్ కారును స్వయంగా నడుపుతూ నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. ఆయన వెంట మేయర్ ఆకుల సుజాత, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఎనగందుల మురళి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు తారీఖ్ అన్సారీ తదితరులు ఉన్నారు. బిగాల గణేశ్‌గుప్తా తండ్రి కృష్ణమూర్తి సైతం టీఆర్‌ఎస్ తరపునే ఓ సెట్ నామినేషన్ వేశారు. కృష్ణమూర్తి వెంట బిగాల మహేశ్ తదితరులు ఉన్నారు. ఇక్కడ నుంచి బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా హెచ్‌ఎం ఇస్మాయిల్ మహ్మద్ నామినేషన్ దాఖలు చేశారు. బీఎస్పీ నుంచి రాశమల్లు రమేశ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆర్మూర్‌లో ఆశన్నగారి జీవన్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన సతీమణి రజితారెడ్డితో కలిసి అంతకు ముందు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇక్కడ నుంచి అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సింధూకర్ చరణ్‌కుమార్ నామినేషన్ వేశారు. బాల్కొండ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అధికార అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ,మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు.ప్రశాంత్‌రెడ్డి తన సతీమణి నీరజా రెడ్డి,వేల్పూర్ ఎంపీపీ కొండ గోదావరి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, ఎంజే దవాఖాన వైద్యుడు డాక్టర్ మధుశేఖర్‌తో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. బోధన్ నియోజకవర్గంలో శివసేన అభ్యర్థిగా పసులోటి గోపీకిషన్ నామినేషన్ వేశారు.

290
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...