ఆశీర్వదించండి.. మరింత అభివృద్ధి చేస్తా


Thu,November 15, 2018 12:55 AM

భీమ్‌గల్: తనకు మరో మారు ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం కల్పిస్తే మరింత అభవృద్ధి చేసి చూపిస్తానని టీఆర్‌ఎస్ బాల్కొండ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం భీమ్‌గల్ మండలం పురాణీపేట్, బాబాపూర్, బాబానగర్ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో తొలిసారి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రశాంత్‌రెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. మహిళలు బోనాలతో, దళితులు డప్పుల్లతో, గంగపుత్రులు వల గొడుగులతో స్వాగతం పలికారు. అనంతరం ఆయా గ్రామాల్లో వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. గత నాలుగున్నర ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు. గత ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసినట్లు చెప్పారు.

చంద్రబాబు రూపంలో పొంచి ఉన్న ప్రమాదం...
తెలంగాణ వనరులపై ఆశచావని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రూపంలో మరో మారు తెలంగాణకు ప్రమాదం పొంచి ఉందని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్న చంద్రబాబుకు, పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. తెలంగాణను అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కల్లు మండుతున్న చంద్రబాబు, బొడ్డులో కత్తి పెట్టుకుని తెలంగాణలో అడుగు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. నేరుగా వస్తే అతని ఆటలు తెలంగాణలో చెల్లవని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ప్రజల మందుకు వస్తున్నాడన్నారు. ప్రజలు అలాంటి కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి బ్రేకులు పడతాయని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టును ఆపాలని ఇప్పటికే 30 ఉత్తరాలు రాసిన చంద్రబాబు, మరోమారు గెలిస్తే ఆ ప్రాజెక్టును అడ్డుకుంటాడని అన్నారు. మంచిగవుతున్న తెలంగాణను ఆగం చేసే కార్యక్రమాలు ప్రారంభయ్యాయని, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేసీఆర్ మరోమారు సీఎం అయితేనే ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు సాఫీగా సాగుతాయన్నారు. 24గంటల కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు పనులు, 21 ప్యాకేజీ ద్వారా రైతులకు సాగు నీరందించే కార్యక్రమాలతో పాటు జరుగుతున్న అభివృద్ధి పథకాలు ఆగకూడదంటే ప్రజలు కారుగుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిచిన తాను అనేక అభివృద్ది కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. మరోమారు కారు గుర్తుకు ఓటు వేసి బ్రహ్మాండమైన మెజార్టీ అందించాలని ప్రజలను కోరారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. అప్సర్, తోటశంకర్, మోయిస్ తదితరులు పాల్గొన్నారు.

205
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...