ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టీఎన్‌జీవోస్ జేఏసీదే కీలకపాత్ర


Wed,November 14, 2018 01:43 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో టీఎన్‌జీవోస్ నాయకత్వంలోని ఉద్యోగుల జేఏసీదే కీలకపాత్ర పోషించిందని టీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అన్నారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని పీపీ గంగారెడ్డి గెస్ట్‌హౌస్‌లో మంగళవారం టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి ఉద్యోగుల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నాల్గున్నర ఏళ్ల కాలంలో ఉద్యోగ సంక్షేమానికి సంబంధించిన 43శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ, తెలంగాణ ఇంక్రిమెంట్, ఈహెచ్‌ఎస్ అమలు, 42 రోజుల సకల జనుల సమ్మె కాలానికి వేతన సెలవు, మహిళలకు ఐదు రోజుల స్పెషల్ లీవ్, అప్పటికప్పుడు డీఏ మంజూరు, బదిలీలు చేపట్టడం వంటి డిమాండ్లను నెరవేర్చిందన్నారు. ఉద్యోగుల ఐక్యతను చాటుతూ గత మార్చి 26న సరూర్ నగర్‌లో సకల ఉద్యోగుల మహాసభ నిర్వహించామన్నారు. తమ యూనియన్ తరపున ప్రభుత్వం దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లామని, ఫలితంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, కాంటింజెంట్ ఉద్యోగులైన పార్ట్‌టైం స్వీపర్స్, ఆశవర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, యూఆర్‌ఏఎస్ ఏఎన్‌ఎంలు, యూపీహెచ్‌లో పనిచేసే ఏఎన్‌ఎంలు, కాంట్రాక్టు లెక్చరర్లు, గోపాలమిత్ర కార్యకర్తల వేతనాలు పెంచేలా కృషిచేశామన్నారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని తెలిపారు.తెలంగాణ ఉద్యోగుల సమస్యలను కొన్ని ఉద్యోగ సంఘాలు సమైక్యవాదుల వంచనచేరి తప్పుదోవ పట్టించి ఉద్యమ సంస్థలకు కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఉద్యోగ సంఘాల నాయకుల మాటలను నమ్మకూడదని సూచించారు. నాల్గున్నర ఏళ్ల పాటు ఎలాంటి సమస్యలను పట్టించుకోకుండా ఆరోపణలు చేసే ఉద్యోగ సంఘాల నాయకులకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల సంక్షేమాభివృద్ధి కోసం పాటుపడుతున్న టీఎన్‌జీవోస్ నాయకత్వాన్ని ఉద్యోగులందరూ బలపరుస్తున్నారని, అందుకే పలు ఉద్యోగ సంఘాల నాయకులు సమైక్య వాదులకు తలొగ్గి ఇష్టారాజ్యంగా అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం జేఏసీపై నిందలు మోపుతూ పబ్బం గడుపుకుంటున్నారని, అలాంటి సంఘాల నాయకుల మాటలను ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీఎన్‌జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, రాష్ట్ర మహిళా చైర్‌పర్సన్ రేచల్, కేంద్ర సంఘం కార్యదర్శి కొండల్‌రెడ్డి, అమృత్‌కుమార్, బడి నరహరి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు దయానంద్, సెక్రెటరీ వెంకట్‌రెడ్డి, రమణారెడ్డి, నారాయణరెడ్డి, రవీందర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, జాఫర్, అలీఫ్, తాలుక అధ్యక్షుడు సుమన్‌కుమార్, సునీత, పుష్ప, వసుమతి, గొండస్వామి, ప్రసాద్, సుధాకర్, వివిధ శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

188
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...