నేనున్నాను..!


Fri,September 21, 2018 01:46 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : నేనున్నానంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులకు ఎంపీ కవిత అభయమిచ్చారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు తొలిసారిగా విచ్చేసిన కవిత పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. జిల్లాలోని ఐదు స్థానాల్లో అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలుపించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని వారికి పిలుపునిచ్చారు. ఎంపీ కవిత భేటీ తర్వాత ఇందూరు గులాబీ దళంలో కొత్త జోష్ కనిపించింది. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం ఇచ్చి అండగా ఉంటామని ఆమె భరోసా ఇవ్వడంతో నాయకత్వంలో జోష్ కనిపిస్తోంది. అక్కడక్కడ అసంతృప్తులను ఆమె బుజ్జగించారు. కలిసికట్టుగా ముందుకు సాగాలని, టీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆమె వారందరినీ కార్యోన్ముఖుల్ని చేశారు. ఈ సందర్బంగా నాయకులు ఎంపీ కవిత నాయకత్వంపై పూర్తి నమ్మకం, విశ్వాసంతో ఉన్నామని, ఆమె నిర్దేశనంలో ముందుకు సాగుతామని సమావేశంలో తన మనోభావాలను వెల్లడించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకొని రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ఇందూరు టీఆర్‌ఎస్‌కు సముచిత స్థానాన్ని దక్కేలా చూడాలని ఆమె కోరారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్ నియోజవకర్గాల్లో ఎంపీ కవిత ముఖ్య కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బుధవారం అర్ధరాత్రి వరకు ఆమె జిల్లాలో పర్యటించారు.

రెండ్రోజుల పాటు జిల్లాలో పర్యటించిన ఎంపీ కవిత గులాబీ శ్రేణులకు కర్తవ్య బోధ చేశారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై సమగ్ర అవగాహన ఉన్న ఎంపీ కవిత, ముఖ్య కార్యకర్తలు, నాయకులకు సమయం ఇచ్చి మాట్లాడారు. వారితో చర్చించారు. కొంతమంది అసంతృప్తులను ఆమె బుజ్జగించారు. కలిసికట్టుగా ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరికీ సముచిత ప్రాధాన్యతనిచ్చి గౌరవించుకునే బాధ్యత తనదేనని వారికి హామీ ఇచ్చారు. నిజామాబాద్ అర్బన్‌లో మరోసారి పది డివిజన్ల చొప్పున, అవసరమైతే ఐదురోజులు ప్రత్యేకంగా సమావేశం కావాలని ఆమె భావిస్తున్నారు. పార్టీ శ్రేణలు ఏ విధంగా ప్రజలకు వద్దకు వెళ్లాలి? ప్రభుత్వ పథకాల గురించి, చేసిన అభివృద్ధి గురించి ఎలా వివరించాలి అనే అంశాలపై ఆమె క్షుణ్ణంగా వారికి వివరించారు. అరవై ఏళ్లుగా జరగని అభివృద్ధి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల కాలంలో ఏ విధంగా అభివృద్ధి చేశామో వారికి అర్థమయ్యే రీతిలో వివరించాలని ఆమె సూచించారు. సబ్బండవర్ణాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో.. అన్ని మతాలను గౌరవిస్తూ వారి మనోభావాల మేరకు ప్రభుత్వం చేసిన కృషిని ఎలా వివరించాలో చెప్పారు. అన్నికులాలు ఆత్మగౌరవంతో బతికేలా ప్రభుత్వం తీసుకున్న చొరవ,కృషిని అన్ని వర్గాలకు తెలియజేయాలని చెప్పారు.

రెట్టించిన ఉత్సాహంలో గులాబీదళం...
జిల్లాలోని అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలుపించుకోవడమే లక్ష్యంగా ఎంపీ కవిత తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. సిట్టింగులకు అభ్యర్థిత్వాలు ఖరారైన తర్వాత ఆమె తొలిసారిగా జిల్లాకు వచ్చారు. రాగానే పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో చేయాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేశారు. అందరికీ నేనున్నాననే భరోసానిచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటలా ఉన్న ఇందూరులో మళ్లీ పార్టీ సత్తాను చాటేలా ఎన్నికల్లో పనిచేయాలని ఆమె ఇచ్చిన పిలుపు కార్యకర్తల్లో, నాయకుల్లో స్ఫూర్తిని నింపింది. అభ్యర్థులందరి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కలిసికట్టుగా సమన్వయంగా ముందుకు సాగాలని కోరారు. తల్లివేరు లాంటి పార్టీని మనమంతా కలిసి కాపాడుకోవాలని, ఆమె చెప్పిన తీరు కార్యకర్తలను ఆకట్టుకున్నది. పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఇస్తామని, ఆ భాధ్యత తనదేనని ఎంపీ చెప్పడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ కనిపించింది. రెట్టించిన ఉత్సాహంతో ఇక కదన రంగంలోకి దిగేందుకు వారంతా సమాయత్తమయ్యారు. ప్రతిపక్షాలు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో.. ఎంపీ కవిత రంగ ప్రవేశం చేసి ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అంతా తానై వ్యవహరించి ఇందూరు టీఆర్‌ఎస్‌కు మరోసారి అఖండ విజయాన్ని సాధించే పెట్టే బృహత్తర పనిని భుజానికెత్తుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌లో నూతనోత్తేజం కనిపిస్తుండగా.. ప్రతిపక్షాల్లో కలవరం మొదలైంది. తామింకా యుద్దానికి సన్నద్ధం కాకముందే అటు టీఆర్‌ఎస్ ప్రజాక్షేత్రంలో దూసుకుపోవడంతో వారిలో రోజురోజుకు ఆందోళన పెరుగుతున్నది. మరోపక్క కాంగ్రెస్, బీజేపీల నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. పల్లెలకు పల్లెలు టీఆర్‌ఎస్‌తోనే మేము అంటు ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. జిల్లాలో ఎప్పడూ లేని విధంగా ఈసారి ఎన్నికల వాతావరణం విభిన్నంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వార్ వన్ సైడేననే ఇప్పటికే స్పష్టమైపోయింది.

282
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...