కొత్తపల్లిని మరో ఎర్రవల్లిగా మారుస్తా


Fri,September 21, 2018 01:46 AM

కోటగిరి : గత పాలకులు అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని దేవునిగుట్ట తండా, కొత్తపల్లి గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి, కోటగిరి మండల కేంద్రంలోని కోటగల్లీ, రచ్చగల్లీలో కురుమ, రజక భవనాల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దేవునిగుట్ట తండాలో ప్రచార రథంలో తిరిగి పరిశీలించారు. అనంతరం జగదాంబ మందిర్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గిరిజనుల కోరిక మేరకే తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశామన్నారు. సింగూర్ జలాలను తీసుకొచ్చి నిజాంసాగర్ ఆయకట్టు పంటను కాపాడుతామన్నారు. నిజాంసాగర్ కాలువల పురనరుద్ధ్దరణకు ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసిందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలకు దేశ విదేశాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. కొత్తపలి ్లగ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, మరో ఎర్రవల్లిగా మారుస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. తండాలో 25 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరు కాగా, కొత్తపల్లి గ్రామంలో అవసరమైన ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు తండాలో గిరిజనులతో కలిసి మంత్రి పోచారం నృత్యం చేశారు.

ఆరిద్ర పురుగులు వచ్చ పోతుంటాయ్..
ఎన్నికల సమయంలో ఆరిద్ర పురుగులు వచ్చి పోతుంటాయ్.. ఓట్ల కోసం మళ్లీ కొత్త బిచ్చగాళ్లు గ్రామాల్లోకి వస్తుంటారు.. కాబట్టి వాళ్లు చెప్పే మాయమాటలకు మోసపోవద్దని, ఓట్ల కోసం వచ్చే కొత బిచ్చగాళ్లను తరిమి కొట్టాలని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్తపల్లి తండాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆరిద్ర పురుగు లాగా వచ్చి మళ్లీ ఎన్నికల ముగిసిన తర్వాత మాయమైపోతారన్నారు. అలాంటి వాళ్లను నమ్మవద్దని సూచించారు. స్వాతంత్రం వచ్చిన 71 ఏళ్లలో 50 ఏళ్లు కాంగ్రెస్, 15 ఏళ్లు టీడీపీ రాష్ర్టాన్ని పాలించిందన్నారు. కానీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందన్నారు. కొంత మంది నాయకులు దుర్బుద్ధితో మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లుగా.. ఇళ్ల పేరుతో దోచుకున్నారని మండిపడ్డారు. ప్రజల గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వారి డిపాజిట్లు గల్లంతు కావడం తథ్యమరన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయరంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. 65ఏళ్ల పాటు అధికారంలో ఉన్న నాయకులు ఇలాంటి పథకాలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలే బుద్ది చెప్తారని మంత్రి పోచారం అన్నారు. కార్యక్రమాల్లో ఆర్డీవో గోపీరాం, ఇన్‌చార్జి తహసీల్దార్ విఠల్, ఎంపీడీవో మహ్మద్ అతారుద్దీన్, ఎంపీపీ మోరె సులోచన, టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు హెచ్.స్వరూప, రైతు సమన్వయ సమితి కోఆర్డ్డినేటర్ కొల్లూర్ కిశోర్, శంకర్‌పటేల్, వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, సుదర్శన్, అశోక్‌రెడ్డి, చలపతి, కృష్ణారెడ్డి, కిరణ్‌గౌడ్, బీర్కూర్ గంగాధర్, నీరడి గంగాధర్, ఏఈ నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.

238
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...