మాది రైతు ప్రభుత్వం


Thu,September 20, 2018 01:09 AM

కోటగిరి : రైతుల సంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, రైతులు సాగునీటి విషయంలో ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని కొడిచెర్ల గ్రామంలో శివగంగ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి బుధవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రైతులను దృష్టిలో పెట్టుకొని నిజాంసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీరు సరిపోకపోతే అవసరం మేరకు సింగూరు నుంచి జలాలు విడుదల చేయిం చి పంటలను కాపాడుతామని ఫోన్ ద్వారా హామీ ఇచ్చారన్నారు. మొదటి విడత ఈ నెల 14న విడుదల చేసి పంటలకు సాగు నీటిని అందిస్తున్నామని 23 వరకు అందించి, రెండో విడత అక్టోబర్ 1నుంచి 10 వరకు నిజాంసాగర్ నీటిని పంటలకు అందిస్తామన్నారు. రెండు విడతలో దాదాపు 90 శాతం పంట పూర్తి అవుతందని ఒకవేళ కొంత శాతం మిగిలితే సింగూర్ నుంచి జలాలను తీసుకొచ్చి సాగర్ ద్వారా పంటలను కాపాడుతామన్నారు. జుక్కల్, బాన్సువాడ, బోధన్ మూ డు నియోజకవర్గాల్లోని పంటలకు సాగు నీరందించి కాపాడుతామని సీఎం భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. అక్టోబర్ 1నుంచి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో 260 కొనుగోలు కేంద్రాలు, కామారెడ్డి జిల్లాలో 205 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. కొడిచెర్ల గ్రామ సమీపంలో మంజీర నదిపై ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.11.20కోట్లు మంజూరు చేసిందని ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని ఫిబ్రవరి వరకు పనులు పూర్తి కావాలన్నారు. మంజీర నదిపై నీటి నిల్వకు పరిసరా ప్రాంతాల్లో భూగర్భజలాలు మరింతగా పెరగడానికి రూ. 135 కోట్లతో కొడిచెర్ల, సుంకిని, బీర్కూర్, బాన్సువాడ వద్ద చెక్‌డ్యాంలు నిర్మించనున్నామని పేర్కొన్నారు.

మంత్రికి ఫోన్ చేసిన సీఎం..
కొడిచెర్ల గ్రామంలో మంత్రి సమావేశం లో మాట్లాడుతుండగానే హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ మంత్రి పోచారానికి ఫోన్ చేశారు. సిం గూరు నుంచి 1.5 టీఎంసీ నీటి విడుదలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రైతులకు ధైర్యంగా చెప్పండని అవసరమైనంత మేరకు నీటిని వదులుతామ సీఎం భరోసా ఇచ్చారని మంత్రి సమావేశంలో చెప్పారు. వచ్చే జూన్ నుంచి రైతులకు రెండు పంటలకు నిజాంసాగర్ ద్వారా నీటిని అందిస్తామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటికే కాళేశ్వరం పనులు పూర్తికావచ్చయని తెలిపారు.

రైతుబంధు పథకం ఎంతో మేలు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో ఎంతో మేలు చేకూర్చిందని మంత్రి పోచారం అన్నారు. రాష్ట్రంలో 58లక్షల మంది రైతుల బీమాకు సంబంధించిన ప్రీమియం డబ్బులను ఎల్‌ఐసీ సంస్థకు ప్రభుత్వమే రూ.1000 కోట్లు చెల్లించిందన్నారు. ఆగస్టు 15నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 1100 మంది రైతులు మృతి చెందారని ఇప్పటికే 900 మంది రైతుల వారి నామినీల ఖాతాలో బీమా డబ్బులు రూ.5 లక్షలు చొప్పున వారం రోజుల్లో జమ అయ్యాయని గుర్తు చేశారు.

ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు..
మిషన్ భగీరథ పథకం కింద రెండునెలల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీటిని అందించే కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి పోచారం అన్నారు. ఇప్పటికే గ్రామాల్లో పనులు పూర్తి అయ్యాయని వెల్లడించారు.

నిజాంసాగర్ కాలువ పునరుద్ధరణ ...
టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ప్రాజెక్టు నుంచి చివరి ఆయకట్టు వరకు రూ. 19 కోట్లు వెచ్చించి కాలువ పునరుద్ధరణ పనులు చేపట్టామని కాలువలకు సీసీ లైనింగ్ చేయించామన్నారు. మళ్లీ కొత్తగా జల్లాపల్లి నుంచి కొడిచెర్ల వరకు కిలో మీటరు కాలువ లైనింగ్ కోసం రూ.70.39లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. కొడిచెర్ల మంజీర నదిలో నీటి నిల్వకు చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.35 కోట్లు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. దీంతో పాటు సుంకిని, బాన్సువాడ, బీర్కూర్ వద్ద కూడా చెక్‌డ్యాం కోసం రూ. 1.30 కోట్లు మంజూరు అయిందన్నారు. ఎంపీపీ మోరె సులోచన, నీటి పారుదల శాఖ ఈఈ నాగేశ్వారరావు, ఆర్డీవో గోపీరాం, మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, ఏఎంసీ మాజీ చైర్మన్ శంకర్‌పటేల్, వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, తహసీల్దార్ విఠల్, ఎంపీడీవో మహ్మద్ అతారుద్దీన్, నాయకులు బీర్కూర్ గంగాధర్, నీరడి గంగాధర్, కాశాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

212
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...