విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తోడుగా..


Wed,September 19, 2018 02:53 AM

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సమరశంఖం పూరించిన అనంతరం తొలిసారిగా మంగళవారం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జిల్లాకు వచ్చారు. మంగళవారం బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా జాగృతి నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందూరు రాజకీయాలపై ఎంపీ కవిత తనదైన ముద్ర వేశారు. గత సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ పరిధిలోని అన్ని స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకొని ఓ చరిత్ర సృష్టించింది. ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిచిన కవిత, జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. చెప్పని హామీలెన్నో అమలయ్యాయి. ఈ క్రమంలోనే మళ్లీ ఎన్నికలు రానే వచ్చాయి. సిట్టింగులకే అభ్యర్థిత్వాలు ఖరారు కావడంతో రెట్టించిన ఉత్సాహంతో అభ్యర్థులంతా జనంతో మేమకమవుతున్నారు. ప్రజల దీవెనలు మరోసారి కోరుతున్నారు.

మళ్లీ పాత రికార్డును పునరావృతం చేసేందుకు ఎంపీ కవిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముందస్తు ఎన్నికల వేడి జిల్లాలో రాజుకుంటున్న తరుణంలో ఆమె తొలసారిగా జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఆది దేవుడు.. విఘ్నేశ్వరుడి ఆశీస్సులకే తన పర్యటనను పరిమితం చేస్తున్నారు. ఏ పనిని మొదలు పెట్టినా ముందుగా అందరికీ గుర్తొచ్చేది గణేశుడే. చేపట్టే పని నిర్విఘ్నంగా పూర్తి కావాలని, విఘ్నాలన్నీ తొలిగి విజయం సాధించాలని విఘ్నేశ్వరున్ని వేడుకొని ముందుకు సాగుతారు. ఆ దేవదేవుడిని ఆశీస్సులు తీసుకుంటారు. ప్రస్తుతం వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో టీఆర్‌ఎస్ ఎన్నికల బరిలోకి దిగింది. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు తీసుకునే క్రమంలో తన రెండు రోజుల పర్యటనను ఎంపీ కవిత ప్రత్యేకంగా దీనికోసమే కేటాయించారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి ఆమె వినాయక మండపాల సందర్శన, ప్రత్యేక పూజలు చేయడాన్ని ఆరంభించారు. బాల్కొండలోని భీమ్‌గల్‌లో పలు వినాయకుని మండపాలను ఎంపీ కవిత సందర్శించారు. అక్కడి ప్రజానీకంతో మమేకమై భక్తిశద్ధ్రలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆర్మూర్‌లో వినాయక మండపాలను సందర్శించారు. ఎంపీ కవిత వినాయక మండపాల వద్దకు వచ్చి తమతో పాటు పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం స్థానిక ప్రజలకు సంతోషాన్నిచ్చింది.

బుధవారం గణేశ్ మండపాలను దర్శించి పూజలు చేసి ఆమె ఆశీస్సులు తీసుకోనున్నారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్ నియోజకవర్గాల్లో వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. స్థానిక ప్రజలతో మమేకం కానున్నారు. ప్రతిపక్షాల విఘ్నాలను అధిగమించి టీఆర్‌ఎస్ మరోసారి ఘనవిజయం సాధించేలా గణేశుడిని ప్రార్థించనున్నారు ఎంపీ కవిత. వేరే ఇతర కార్యక్రమాలను లేకుండా కేవలం గణేశ్ మండపాల దర్శనం, పూజా కార్యక్రమాలకే ఆమె ప్రాధాన్యతనిచ్చారు. మళ్లీ ఇందూరులో టీఆర్‌ఎస్ అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించేలా ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే బూత్ కమిటీల సమావేశాలను నిర్వహించిన ఎంపీ కవిత.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించే క్రమంలో ఓ ప్రణాళికాబద్ధ్దంగా ఎలా ముందుకు పోవాలో.. ప్రజలకు మరింత చేరువ ఎలా కావాలో వివరించారు. ఈ మేరకు బూత్ లెవల్ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో వారికి కేటాయించిన విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాయనే విషయాన్ని వారి అనుభవంలోకి వచ్చిన సందర్భాన్ని తెలియపరుస్తున్నారు. మరోపక్క జిల్లాలోని టీఆర్‌ఎస్ అభ్యర్థులు,తాజామాజీ ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ఈ ఐదు నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా ఎంపీ కవిత తనదైన శైలిలో అభ్యర్థులకు, కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఎంపీకి ఘన స్వాగతం .. భారీ బైక్ ర్యాలీలు..
ఎన్నికల సమరశంఖం పూరించిన అనంతరం ఎంపీ కవిత మంగళవారం తొలిసారిగా జిల్లాకు వచ్చారు. సాయంత్రం ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో గణేశ్ మండళ్ల సందర్శన,ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఆమె రాక సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ జాగృతి, ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి ,తాజా మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి బైకులతో ర్యాలీ తీశారు. ఎంపీ కవితకు ఘనంగా స్వాగతం పలికారు.

223
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...