టీఆర్‌ఎస్ వెంటే ఇందూరు జనం


Tue,September 18, 2018 02:27 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఇందూరు జనం గులాబీ దళం వెంటే ఉంటామంటున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచార పర్వం ఓ వైపు వేగం పుంజుకుంటున్న తరుణంలో, పార్టీలో భారీగా ఇతర పార్టీల నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఏకగ్రీవ తీర్మానాలతో మేము మీవెంటేనంటూ సబ్బండవర్ణాలు సంఘీభావం తెలుపుతున్నాయి. అద్భుత పాలన అందించిన కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ ప్రమాణాలు చేస్తున్నారు. జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం ఓవైపు కొనసాగుతుండగా.. ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు చోటు చేసుకుంటున్నాయి. పల్లెలు, తండాలు ఏకమవుతున్నాయి. ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ, కారుకే ఓటేస్తామంటూ శపథం పూనుతున్నాయి. పట్టణం, పల్లె తేడా లేకుండా సకల జనులు టీఆర్‌ఎస్ పార్టీ వైపే చూస్తున్నారు. ప్రతిపక్షాల ఉనికి గల్లంతవుతున్నా క్రమంలో టీఆర్‌ఎస్ తన ఎన్నికల ప్రచారాన్ని మరింత దూకుడుగా నిర్వహిస్తున్నది. ఏక పక్షంగానే ప్రచారంలో దూసుకెళ్తున్నది. ప్రజలతో అభ్యర్థులు మమేకమవుతూ, టీఆర్‌ఎస్‌ను మళ్లీ దీవించండి అంటూ కోరుతున్నారు. ప్రతి చోట టీఆర్‌ఎస్ అభ్యర్థులకు అపూర్వ స్వాగతం లభిస్తున్నది. లభిస్తున్న ప్రజాదరణతో రెట్టించిన ఉత్సాహంతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షాలు ఏమి చేయలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.

ఆర్మూర్‌లో ఏకగ్రీవ తీర్మానాల జోరు..
టీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డికి మద్దతుగా జోరుగా కుల సంఘాల తీర్మానాలు. ఆర్మూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో ఈ మద్దతు ఇస్తామంటూ ఆర్మూర్‌కు చెందిన వివిధ కుల సంఘాల వారు సోమవారం తీర్మానాలు చేసి ఆశన్నగారి జీవన్‌రెడ్డికి అందజేశారు. ఆర్మూర్ మండలం విశ్వబ్రాహ్మణ కులస్తులు, ఎరుకల కులస్తులు జీవన్‌రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసి తీర్మాన ప్రతిని అందజేశారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని స్వయంగా కలిసి ఆయన ఎదుట తమ మద్దతు మీకే ఉంటుందంటూ ప్రతిజ్ఞ చేశారు. నందిపేట మండలంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు జోర్పుర్, మల్లరాం, కైల్పూర్ గ్రామాలు ఆర్మూర్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిని ఏకగీవ్రంగా గెలిపించుకుంటామని తీర్మానం చేసి ప్రతులను జీవన్‌రెడ్డికి అందజేశారు. నందిపేట్ మండల కేంద్రంలోని నాగ మంతెన మున్నూరుకాపులు 400మంది, ఐలాపూర్‌లో గౌడ సంఘం సభ్యులు, వెల్మల్‌లో గొల్ల, కుర్మ సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేసి తీర్మాన ప్రతులను టీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డికి అందజేశారు. నందిపేట్ మండలంలోని మైనార్టీలు 400 మంది, నందిపేట్ టౌన్‌లోని పద్మశాలీ సంఘం (6 పంథాలు) ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. మాక్లూర్ మండలంలోని నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలు దుర్గానగర్ కింది తండా, ఎల్యానాయక్ తండా వాసులు ఏకగ్రీవంగా ఆర్మూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డికి మద్దతు ఇస్తామని తీర్మానం చేసి తీర్మాన ప్రతులను నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డికి అందజేశారు.

అర్బన్‌లో గల్లీ గల్లీకి టీఆర్‌ఎస్..
ప్రచారం కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజామాబాద్ నగరంలోని 50వ డివిజన్ పరిధిలోకి వచ్చే చంద్రశేఖర్ కాలనీ, చేప బిల్డింగ్, దర్గా, కెనాల్ కట్ట, తారక్ రాంనగర్ తదితర ప్రాంతాల్లో వందలాది మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి అర్బన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా పాదయాత్ర నిర్వహించారు. తొలుత చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలోని హన్మాన్ మందింరంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే చౌరస్తాలో ఉన్న టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించి పాదయాత్రను ప్రారంభించారు. ఇంటింటికీ తిరుగుతూ, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. తనదైన శైలిలో వినూత్న ప్రచారంలో భాగంగా ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు కోసం క్లాత్ బ్యాగులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బీజేపీ నుంచి యువత బిగాల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. విఠలేశ్వర మందిరం పరిసరాల్లో ఉన్న మరాఠీలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ పార్టీకి సంఘీభావం తెలుపుతూ మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు.

బాల్కొండలో వేముల ప్రచార జోరు...
బాల్కొండ నియోజకవర్గంలో సోమవారం మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో రూ. 2.15 కోట్లతో చేపట్టిన పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమ్మర్‌పల్లి ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గురడికాపు కింది వాడకట్టు సంఘం సభ్యులు, మహిళలు, గొల్ల సంఘం, గౌడ సంఘం, గోసంగి సంఘం సభ్యులు ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రశాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ వెంటే ఉంటామని ఈ సంఘాల సభ్యులందరూ తీర్మానాలు చేసి ప్రశాంత్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామగ్రామానా ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తూ, టీఆర్‌ఎస్ వెంటే ఉంటామని ప్రకటించడం దేశంలోనే అరుదైన నిర్ణయాలు అన్నారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమం కోసం కృషిచేశారని, ఆయన మానవీయ పాలనతోనే ఏకగ్రీవంగా తీర్మానాలు చేసుకుంటూ ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మానాలలో ఆయన అభివృద్ధి, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

చేరికలతో షకీల్‌కు మేమున్నాంటూ భరోసా...
బోధన్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం సోమవారం ప్రారంభమైంది. సోమవారం బోధన్ పట్టణంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్ షకీల్ నివాస గృహం వద్ద టీఆర్‌ఎస్ బోధన్ నియోజకవర్గ బూత్ కమిటీల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఢంకా బజాయించి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు ముందు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఏ మాత్రం అభివృద్ధి చేయని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక పోతుందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రగతి రథచక్రాలను ఆపడానికి కుట్రలు పన్నుతోందని, అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రగతి రథచక్రాలు ముందుకు సాగాలంటే కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్లు రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్ షకీల్ , పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. మంత్రి పోచారం పాల్గొన్న బోధన్ టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్ షకీల్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు కొనసాగాయి.

బోధన్ ఎంపీపీ చైర్మన్‌గా ఉన్న కాంగ్రెస్ నాయకుడు బి. గంగాశంకర్ సోదరుడు గణపతి, మరో 15మందితో కలిసి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. లంగడపూర్‌కు చెందిన గణపతితో పాటు జిల్లా చరిత్ర పరిశోధకుడు సిద్ధా సాయిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీ బోధన్ మండల అధ్యక్షుడు, జాడీ జమాల్‌పూర్ గ్రామానికి చెందిన ఎం. బాలస్వామి సుమారు 20 మందితో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. భూలక్ష్మీ క్యాంపు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. రెంజల్ మండలం దండిగుట్ట తండాకు చెందిన ప్రజలు తామంతా టీఆర్‌ఎస్‌కే ఓట్లేస్తామంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు బోధన్‌లో జరిగిన సభలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి తమ ఏకగ్రీవ తీర్మానాన్ని దండిగుట్ట ప్రతినిధులు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం వకీల్‌ఫారం, అపందిఫారం గ్రామాలు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా సోమవారం ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. ఈ రెండు చోట్ల జరిగిన ఆయా గ్రామస్తుల సమావేశాల్లో మంత్రి పోచారం స్వయంగా పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తోనే ఉంటామని ఆయా గ్రామాల్లో తీర్మానాలు చేసిన ప్రజలు, ఆ తీర్మానాల ప్రతులను పోచారం శ్రీనివాసరెడ్డికి అందించారు. కోటగిరి మండలం ఠాక్లీ గ్రామంలో దళిత సంఘాలు, రజక సంఘం టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. మంత్రి పోచారం శ్రీనివాస్ తనయుడు పోచారం సురేందర్ రెడ్డి సమక్షంలో ఆ కుల సంఘాలు తీర్మానాలు ఆమోదించాయి.

250
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...