టీఆర్‌ఎస్‌తోనే ప్రగతి


Tue,September 18, 2018 02:26 AM

బోధన్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో అభివృద్ధిని చూడలేక, పరుగులు పెడుతున్న ప్రగతి రథ చక్రాలను అడ్డుకోవటానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని, ఆ కాంగ్రెస్‌కు బుద్ది చెప్పి వాతలు పెట్టడానికే సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దుచేసి ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రగతిరథ చక్రాలు ఆగకూడదంటే ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కకుండా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలో సోమవారం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్ షకీల్ నివాసం వద్ద నిర్వహించిన టీఆర్‌ఎస్ బోధన్ నియోజకవర్గ బూత్ కమిటీల కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మహ్మద్ షకీల్ అధ్యక్షత వహించిన ఈ సభలో మంత్రి మాట్లాడుతూ.. 50ఏళ్ల పాటు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రజలకు ఏమిచేసిందని ఓటేయాలని ప్రశ్నించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కోటి ఎకరాలను సాగులోకి తేవాలని కాళేశ్వరం, పాలమూరు, డిండి ప్రాజెక్టులను నిర్మిస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని, మొత్తం 126 కేసులు వేశారన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టి బుద్ధిచెప్పాలన్నారు. రాష్ట్రాన్ని ఎలా పాలించాలన్న విజన్‌గాని, ప్రజలకు ఏం చేస్తే మంచి జరుగుతుందోనన్న ఆలోచనగాని ఆ పార్టీకి లేదని, అధికారం కోసం కాంగ్రెస్ నాయకులు తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేయడం, 105మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించడంతో కాంగ్రెస్ నాయకులు బెంబేలెత్తిపోతున్నారని ధ్వజమెత్తారు. రైతులు, పేదల కోసం సీఎం కేసీఆర్‌లాగా దేశంలో ఎవరూ ఆలోచించి ఉండరని, అలాంటి కేసీఆర్‌కు సమానమైన నాయకుడు కాంగ్రెస్‌లో ఒక్కరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కేసీఆర్ రాష్ట్రంలో విద్యుత్ సమస్యను పరిష్కరించారని, రైతులకు 24గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారన్నారు. రైతు ఏదేని కారణంతో మరణిస్తే... ఆ కుటుంబానికి అండగా ఉండాలన్న లక్ష్యంతో కేసీఆర్ రైతుబీమా పథకం ప్రవేశపెట్టారని, ఇలాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు. ఈ పథకం కింద 30లక్షల మంది రైతులకు 700 కోట్ల రూపాయల ప్రీమియాన్ని ప్రభుత్వం బీమా కంపెనీకి చెల్లించిందన్నారు.

రైతు మరణించిన పది రోజుల్లోగా ఆ రైతు నామినీ బ్యాంక్ ఖాతాలో రూ.5 లక్షల పరిహారం జమవుతుందన్నారు. రైతు బీమా పథకం ప్రవేశపెట్టిన నెల రోజుల్లో 1,098 మంది రైతులు మరణించారని, వారిలో 900మందికి మూడు రోజుల్లోనే బీమా సొమ్ము చెల్లించినట్లు తెలిపారు. రైతుబంధు పథకం కింద మొదటి విడతలో రూ.4 వేలు పెట్టుబడి ఇచ్చామని, రెండో విడత కింద నవంబర్‌లో ఎకరాలకు రూ.4 వేలు చెల్లిస్తామన్నారు. ఇందు కోసం ఇప్పటికే తన ఖాతాల్లో డబ్బు జమచేయమని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. కాంగెస్ ప్రభుత్వాలు ఏనాడైనా రైతును ఆదుకున్నాయా, రైతుబీమా, రైతుబంధు లాంటి పథకాల ఆలోచనలు వచ్చాయా అంటూ ఆయన ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడులు ఇవ్వక, వారికి కరెంట్ ఇవ్వకుండా వారు ఆత్మహత్యలు చేసుకునేందుకు కాంగ్రెస్ పాలకులు దారి చూపారన్నారు. కాళేశ్వరం నీటితో వచ్చే జూన్ 1వ తేదీ నాటికి నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు నింపుతామని, రైతులకు సాగునీటికి ఢోకా లేకుండా చేస్తామని పోచారం అన్నారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు హామీలు ఇవ్వని అనేక పథకాలను అమలు చేశారన్నారు.

సమావేశంలో డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ, బోధన్ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, టీఆర్‌ఎస్ నాయకులు వి.మోహన్‌రెడ్డి, బుద్దె రాజేశ్వర్, వీఆర్ దేశాయ్, పార్టీ బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట్ మండలాల అధ్యక్షులు సంజీవ్‌కుమార్, డి.శ్రీరామ్, భూమ్‌రెడ్డి, వి.నర్సింగ్‌రావు, పార్టీ నాయకులు రజితాయాదవ్, ఎం.అప్పిరెడ్డి, శ్యామ్‌రావు, కరీముద్దీన్, ఆబిద్ అహ్మద్ సోఫి, ఈవీ రంగారావు, తెలంగాణ శంకర్, మాణికేశ్వరరావు, గణపతిరెడ్డి, ఎ.సుదర్శన్‌గౌడ్, తూము శరత్‌రెడ్డి, ఎం.ఎ.రజాక్, పాలావార్ సాయినాథ్, గుమ్ముల అశోక్‌రెడ్డి, శంకర్‌నాయుడు, జాడె సతీష్‌కుమార్, ఎత్తేశామ్, బోధన్ మాజీ మున్సిపల్ చైర్మన్ సునీతా దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తాం
1994లో అప్పటి టీడీపీ పార్టీకి, ఆ పార్టీ నాయకుడు ఎన్టీ రామారావుకు అనుకూలంగా వీచిన గాలి కంటే ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు రెట్టింపు గాలి వీస్తోందని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి 105సీట్ల కంటే ఎక్కువ సీట్లు రాష్ట్రంలో వస్తాయని, పోరాటాల ద్వారా తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు తెలంగాణ బిడ్డలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 సీట్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు వస్తాయని కాంగ్రెస్ చేయించిన సర్వేలోనే తేలినట్లు ఆ పార్టీ నాయకులు అంటున్నారని, దీన్ని బట్టి రాష్ట్రంలో ఆ పార్టీకి మూడు, నాలుగు సీట్ల కంటే ఎక్కువరావని ఎద్దేశాచేశారు.

ఢంకా బజాయించి ఎన్నికల ప్రచారం షురూ...
బోధన్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ ఆమేర్ ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. సోమవారం బోధన్‌లో జరిగిన నియోజకవర్గ బూత్ కమిటీల కార్యకర్తల సమావేశంలో ఎన్నికల ప్రచారం ప్రారంభానికి సూచనగా వేదికపై ఏర్పాటుచేసిన ఢంకాను ఆయన బజాయించారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ ఢంకాను కార్యకర్తల కరతాళ ధ్వనులు, జయజయ ధ్వానాల మధ్య బజాయించి ఎన్నికల ప్రచారం శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్భంగా షకీల్‌ను ఉద్దేశించి మంత్రి పోచారం మాట్లాడుతూ... మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి మంత్రిగా ఉండి కూడా బోధన్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కంటే కేవలం నాలుగున్నర ఏళ్లలో షకీల్ ఎమ్మెల్యేగా ఎక్కువ అభివృద్ధి చేశారని కొనియాడారు. షకీల్ ఈసారి డబుల్ మెజార్టీతో ఘన విజయం సాధిస్తారన్నారు.

ఏం చేశారని సుదర్శన్‌రెడ్డికి అవకాశమివ్వాలి : మహ్మద్ షకీల్
కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి తనకు చివరిసారిగా ఈసారి అవకాశం ఇవ్వాలంటూ దిగజారి ఎన్నికల ప్రచారంలో ప్రజలను అడుగుతున్నారని, ఈసారి అవకాశం ఇస్తే మళ్లీ రాజకీయాల్లో ఉండనంటూ చెప్పుకుంటున్నారంటూ బోధన్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్ షకీల్ ఆమేర్ ఎద్దేవాచేశారు. ఇప్పటివరకు గెలిచిపినందుకు ప్రజలను సగం బొంద పెట్టా.. ఇప్పుడు మళ్లీ గెలిస్తే పూర్తిగా బొంద పెడతా... అన్నట్టుగా ఆయన తీరు ఉందని విమర్శించారు. 15ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సుదర్శన్‌రెడ్డి నియోజకవర్గంలో చిన్న పని చేయలేదని, ప్రజల కష్టాలో ఏనాడూ పాలుపంచుకోలేదని ధ్వజమెత్తారు. ప్రజల పరిస్థితి పక్కనబెడితే, సొంత పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు కష్టమొచ్చినా.. ఏనాడూ ఆదుకోలేదని, ఒక్క రూపాయి కూడా ఏ కార్యకర్తకు సహాయం చేయలేదని, ఈ విషయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలే చెప్పుకుంటుంటే బాధ వేస్తోందన్నారు. 15 ఏళ్ల పాటు బోధన్ నుంచి గెలిచిన సుదర్శన్‌రెడ్డి బోధన్‌లో కనీసం ఇల్లు కట్టలేదని, సొంత ఇల్లు ఉంటే కార్యకర్తలకు ఎక్కడ భోజనం పెట్టాలో... నీళ్లు తాగించాలోనన్నదే ఆయన బాధన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని టీడీపీ హయాంలో ప్రైవేట్‌పరం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండి , ఇప్పుడు ఫ్యాక్టరీ కోసమంటూ ర్యాలీలు ఎందుకని సుదర్శన్‌రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో మంత్రిగా వైజాగ్, రాజమండ్రి, కర్నూల్ కాంట్రాక్టర్ల నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్న సుదర్శన్‌రెడ్డి చెప్పే మాటలను ఎవరూ వినబోరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సుదర్శన్‌రెడ్డికి తెలంగాణ బిడ్దలంతా ఓడిస్తారని, ఆ చివరి అవకాశం ఇవ్వరని షకీల్ ఉద్ఘాటించారు.

164
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...