జనంతో మమేకం


Mon,September 17, 2018 02:39 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం ఆదివారం కోలాహలం కొనసాగింది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ప్రజల ఆశీర్వాదాలు తీసుకుంటూ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. అలుపు సొలుపు లేకుండా అవిశ్రాతంగా ఎన్నికల ప్రచారంలో లీనమవుతున్నారు. ఎర్రటి ఎండను లెక్క చేయకుండా ప్రజల చెంతకు చేరి మరోమారు టీఆర్‌ఎస్ పార్టీని ఆదరించాలని, ఆశీర్వాదించాలని కోరుతున్నారు. జనమంతా టీఆర్‌ఎస్‌కు జేజేలు పలుకుతున్నది. మీకండగా మేమున్నామంటూ భరోసా నింపుతున్నది. ఏకగ్రీవ తీర్మానాలతో పల్లె జనం ఓట్లన్నీ టీఆర్‌ఎస్‌కేనని స్పష్టం చేస్తున్నది. మన రాష్ట్రం , మన పార్టీ, మన పాలన కోసం మళ్లీ టీఆర్‌ఎస్‌కే పట్టం కడతామని ముక్త కంఠంతో నినదిస్తున్నది.
నగరంలో బిగాల పాదయాత్ర షురూ..
నగరంలో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం షురూ అయ్యింది. అర్బన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా తన ఎన్నికల ప్రచారానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. నగరంలోని 49వ డివిజన్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్లాస్టిక్ రహిత నగరంగా ఇందూరును తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్న బిగాల.. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ప్లాస్టిక్ వాడొద్దంటూ ప్రచారం చేస్తూనే తనే స్వయంగా శ్రద్ధతో తయారు చేయించిన క్లాత్ బ్యాగులను ప్రతి ఇంటికి చేరవేస్తున్నారు. బిగాల గణేశ్ గుప్తా చేపట్టిన ఈ వినూత్న ప్రచారానికి విశేష స్పందన లభించింది. ప్రతి ఒక్కరూ దీని గురించే చర్చించుకోవడం కనిపించింది.

పల్లెపల్లెనా ప్రశాంత్‌రెడ్డి విస్తృత ప్రచారం...
బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో ఆదివారం వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆయనకు మోర్తాడ్ మండల ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. బతుకమ్మ పాటలతో, ఆటలతో ప్రచారాన్ని హోరెత్తించారు. రజక సంఘం సభ్యులు ప్రశాంత్‌రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. రజక సంఘం ఏర్పాటు చేసిన వినాయక సంఘం వద్ద ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. మండల కేంద్రంలో పెద్ద ఎత్తున జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులతో ఆయన పాల్గొన్నారు.

షకీల్‌కు అండగా మైనార్టీలు...
బోధన్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఆదివారం బోధన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ సమక్షంలో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. పట్టణంలోని మూడవ వార్డుకు చెందిన ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. పట్టణంలోని 33వ వార్డుకు చెందిన మైనార్టీ మహిళలు, మైనార్టీ వర్గానికి చెందిన స్థానికులు చేరారు. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన 30మంది యువకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. బోధన్ మండలం అమ్దాపూర్, ఊట్‌పల్లి గ్రామాలకు చెందిన వారు పార్టీలో చేరారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలంలో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా గ్రామాలకు గ్రామాలే ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. ఆదివారం వర్ని మండలంలోని గోకుల్‌దాస్ తండా ప్రజలు తామంతా టీఆర్‌ఎస్ పార్టీ వెంట ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. రుద్రూర్ మండల కేంద్రానికి వెళ్లిన అక్కడ యాదవ సంఘం టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసి అందించింది. గ్రామంలోని యాదవులంతా టీఆర్‌ఎస్‌కే ఓట్లేస్తారని ఆ సంఘం నాయకులు పేర్కొన్నారు.

బాజిరెడ్డికి జై కొడుతున్న రూరల్ ప్రజానీకం..
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నిజామాబాద్ రూరల్ మండలంలో ఆదివారం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మండలంలోని సారంగాపూర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ జలాల్‌పూర్, పాల్దా, గుండారం, ఆకుల కొండూర్, తిర్మన్‌పల్లి, ఖానాపూర్ గ్రామాల మీదుగా పవర్ గార్డెన్ వరకు చేరుకుంది. 1000 మందితో ప్రారంభమైన బైక్ ర్యాలీలో బాజిరెడ్డి గోవర్ధన్ కార్యకర్తలతో ఉత్సాహంగా బైక్ నడుపుతూ సభా ప్రాంగణం వరకు వచ్చారు. సారంగాపూర్‌లో టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. పవర్ గార్డెన్‌లో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బైకుపై వెళున్న బాజిరెడ్డికి ఆయా గ్రామాల ప్రజలు, అడుగడుగునా కార్యకర్తలు స్వాగతం పలికారు.

జీవన్‌రెడ్డికి సబ్బండవర్ణాల మద్దతు..
ఆర్మూర్ టీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో జీవన్‌రెడ్డినే గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఆర్మూర్ పట్టణంలోని ముదిరాజ్ కుల సంఘ సభ్యులు 1200మంది, రాజారాంనగర్ కాలనీలో చెందిన 200 మంది మైనార్టీలు, సైదాబాద్ కాలనీకి చెందిన 500 మంది మైనార్టీలు ఏకగ్రీవ తీర్మానాలు అందజేసీ టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ జీవన్‌రెడ్డి గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మాన ప్రతులు అందజేశారు. ఆర్మూర్ మండలంలోని పెర్కిట్‌లో మున్నూరు కాపు కుల సంఘ సభ్యులు 500 మంది, గోవింద్‌పేట్ గ్రామంలోని గౌడ సంఘ సభ్యులు 300 మంది, గోవింద్‌పేట్ గ్రామంలోని మాల, మాదిగ సంఘ సభ్యులు, స్వర్ణకార సంఘ సభ్యులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఏకగీవ్ర తీర్మానాల ప్రతులను జీవన్‌రెడ్డికి అందజేశారు.

పెర్కిట్‌లోని గుండ్ల సంఘం సభ్యులు, ఆర్మూర్ లారీ, హైచర్, గూడ్స్ డ్రైవర్స్, క్లీనర్ అసోసియేసన్ సభ్యులు, పిప్రి గ్రామంలోని టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరి జీవన్‌రెడ్డి గెలుపునకు కృషి చేస్తామని పేర్కొన్నారు. నందిపేట్ మండలంలోని సిద్దాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, తల్వేద గ్రామంలోని కమ్మరి సంఘ సభ్యులు, లక్కంపల్లి గ్రామంలో విశ్వకర్మ సంఘ సభ్యులు టీఆర్‌ఎస్ పార్టీ వెంటే నడుస్తామని జీవన్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానాలు అందజేశారు. మాక్లూర్ జరిగిన బూత్ కమిటీ కార్యకర్తల సమావేశంలో ఆర్మూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీ వీజీగౌడ్ పాల్గొన్నారు.

175
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...