జిల్లాలో బంద్ పాక్షికం


Tue,September 11, 2018 01:02 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: పెరిగిన డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ విఫలమైంది. ముందస్తుగా ఇచ్చిన బంద్ పిలుపుతో కేవలం ప్రైవేట్ విద్యాసంస్థలు మాత్రమే సెలవులు ప్రకటించాయి. నిజామాబాద్ రీజియన్ పరిధిలోని కామారెడ్డి, నిజామాబాద్, బాన్సువాడ, బోధన్, ఆర్మూర్ ఆర్టీసీ డిపోల నుంచి ఉదయం 8గంటలలోగా ఆయా రూట్లలో బస్సులు యథావిధిగానే నడిచాయి. బోధన్ డిపో పరిధిలో 8నుంచి 9గంటల పాటు కొంతసేపు మాత్రమే బస్సులు నిలిపివేశారు. కాగా, అన్ని రోడ్డు మార్గాలు బస్సు ప్రయాణాలతో కిటకిటలాడాయి. ఇదిలా ఉండగా ముందస్తు బంద్ సమాచారంతో ప్రయాణికులు ముందు జాగ్రత్తగా ప్రయాణాలను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. దీంతో ప్రయాణ ప్రాంగణాల్లో జనం రద్దీ కొంత తగ్గినట్లు కనిపించింది. మొత్తం మీద బంద్ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. బాల్కొండ నియోజకవర్గంలో ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన బంద్ పాక్షికంగా కొనసాగింది. భీమ్‌గల్, బాల్కొండ, వేల్పూర్, ఏర్గట్ల, మోర్తాడ్, ముప్కాల్ మండలాల్లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. కమ్మర్‌పల్లి, ముప్కాల్ మండలాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు షాప్‌లు మూసి ఉంచారు. పలు మండలాల్లో కాంగ్రెస్, ఏఐకేఎంఎస్ నాయకులు ర్యాలీలు నిర్వహించారు. పలుచోట్ల వారిని అదుపులో తీసుకున్నారు.

బోధన్‌లో వ్యాపార సముదాయాలు బంద్..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ బోధన్ పట్టణంలో కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన భారత్‌బంద్ పూర్తిగా విజయవంతమైంది. తెల్లవారుజాము నుంచి కాంగ్రెస్, సీపీఐ, సీపీఐఎంల్, న్యూడెమెక్రసీ రాయలవర్గం, చంద్రన్న వర్గం నాయకులు, కార్యకర్తలు పట్టణంలో తిరుగుతూ వ్యాపార సంస్థలు, దుకాణాలను బంద్ చేయించారు. బంద్ సందర్భంగా బోధన్ ఆర్టీసీ డిపో నుంచి బస్సులు తిరగలేదు. పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. సినిమా థియేటర్లలో మార్నింగ్ షోను రద్దు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు బంద్‌ను పాటించాయి. రెంజల్ మండలం సాటాపూర్‌లోని తెలంగాణ చౌరస్తాలో బంద్ సందర్భంగా రాస్తారోకో చేశారు. బోధన్ మండలం సాలూర గ్రామంలో బంద్ జరగింది. ఈ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆటో రిక్షాకు తాడును కట్టి లాగుతూ పెట్రో,డీజిల్ ధరల పెరుగుదలను నిరసించారు. వర్ని, రుద్రూర్, కోటగిరి మండల కేంద్రాల్లో బంద్ విజయవంతంగా జరిగింది. నవీపేట్‌లో పాక్షికంగా జరిగింది. వర్నిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో జరుగగా, ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లో ఎలాంటి బంద్ పాటించలేదు. మాక్లూర్ మండల కేంద్రంలో పాక్షికంగా బంద్ పాటించారు. బస్సులు యధావిధిగా నడిచాయి. వ్యాపార లావాదేవీలు కొనసాగాయి.

కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం...
కేంద్ర ప్రభుత్వం పెట్రో,డీజిల్ ధరలు గత నాలుగు, ఐదు నెలలుగా రోజు రోజుకి పెంచడంతో కాంగ్రెస్ నాయకులు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రూరల్ మండలాల్లో దుకాణాలు, పాఠశాలలు బంద్ పాక్షికంగా చేపట్టారు. పెరిగిన ఇంధన ధరలకు నిరసనగా డిచ్‌పల్లి మండలం కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు చేపట్టిన భరత్ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో దుకాణాలు మూయించారు. పాక్షికంగా బంద్ కొనసాగింది. ఇందల్వాయి మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుట్ట గంగాధర్ కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇంధన ధరలకు నిరసనగా ఆటోను తాడుతో లాగి బస్టాండ్ ఆవరణలో ధర్నా చేపట్టారు. అనంతరం వారిని మండల ఎస్సై రాజశేఖర్ అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తలించారు. ధర్పల్లి మండలంలో ధర్నా నిర్వహించిన సీపీఐఎంఎల్ నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలించి అరెస్టు చేశారు. సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్, సీపీఐఎంఎల్ పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్ట్ఠి బొమ్మను దహనం చేసి ధర్నా నిర్వహంచారు. జక్రాన్‌పల్లి మండలంలో బంద్ ప్రభావం చూపలేదు. మోపాల్ మండల కేంద్రంలో కరణ్‌రెడ్డి, అరికెల రాజన్న ఆధ్వర్యంలో పాఠశాలలు, వ్యాపార సమూదాయాలను మూసివేశారు. కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించడానికి ప్రయత్నించగా, ఎస్సై వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.నిజామాబాద్ రూరల్ మండలంలో భారత్ బంద్ పాక్షికంగా కొనసాగింది.

180
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...