స్వరాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట


Tue,September 11, 2018 01:02 AM

వర్ని: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే వ్యవసాయానికి ప్రాధాన్యత వచ్చిందని, సీఎం కేసీఆర్ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించి రైతాంగ అభ్యున్నతికి కృషిచేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండలంలోని వ్యవసాయ విత్తన సాంకేతిక పరిజ్ఞాన కళాశాలలో రూ.2.90కోట్లతో నిర్మించిన హాస్టల్, భోజన శాలను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫుడ్ టెక్నాలజీ కోర్సుకు ప్రాధాన్యత ఉందని, దేశంలో ఫుడ్ టెక్నాలజీ కళాశాలలు కేవలం 13 ఉండగా, అందులో ఒకటి బాన్సువాడ నియోజకవర్గంలో ఉండడం మన అదృష్టం అన్నారు. ఫుడ్ టెక్నాలజీ కోర్సు పూర్తి కాగానే వంద శాతం ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఫుడ్ టెక్నాలజీ కళాశాల ఆమోదంతో పాటు పీజీ, పీహెచ్‌డీ కోర్సులు అప్పుడే మంజూరు చేయబడ్డాయని, చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఇక్కడ పీహెచ్‌డీ వరకు అవకాశం ఉందని సూచించారు. అగ్రికల్చర్ కోర్సు పూర్తి చేసుకుని 18ఏళ్లలోనే విద్యార్థులు ఉద్యోగం సంపాధించిన ఘనత ఒక్క వ్యవసాయశాఖలో చూశామని, రాష్ట్రంలో 2,638 ఏఈవో పోస్టులు ఉండగా, 1526పోస్టులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. పైరవీలకు తావులేకుండా కళాశాలలో ప్రవేశాలు కల్పిస్తున్నామని, కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగాల ఎంపికలో బంధుప్రీతికి, పైరవీలకు తావు ఇవ్వకుండా ప్రతిభ గల విద్యార్థులనే ఎంపిక చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ సమాజ సేవకు అంకితంకావాలి..
పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదని, భూమి మీద ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్కరూ సమాజానికి పనికి వచ్చే ఏదో ఒక మంచి పని చేయాలని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండల కేంద్రంలోని సత్యనారాయణపురం గ్రామస్తులు రూ.కోటితో నిర్మించిన వైకుంఠధామాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత జన్మలో పుణ్యం చేసుకుంటేనే మానవ జన్మ లభిస్తుందన్నారు. కోటి రూపాయలతో వైకుంఠధామాన్ని అన్ని సౌకర్యాలతో నిర్మించిన గ్రామస్తులను ఆయన అభినందించారు. నిర్మాణానికి ప్రభుత్వ అంచనాలతో రూ.3కోట్ల వరకు ఖర్చవుతుందని, కోటి రూపాయలతో నిర్మాణం పూర్తి చేసిన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ గుత్ప విజయ భాస్కర్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారోజి గంగారం, టీఆర్‌ఎస్ వర్ని, రుద్రూర్ మండలాల అధ్యక్షులు మేక వీర్రాజు, పత్తి లక్ష్మణ్, రుద్రూర్ రైతు సమితి కన్వీనర్ తోట శంకర్, కోటగిరి ఎంపీపీ సులోచన, వర్ని వైస్ ఎంపీపీ సంజీవ్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ అరికెల సాయిరెడ్డి, సొసైటీ చైర్మన్లు నేమాని వీర్రాజు, పత్తి రాము, నాయకులు బజ్యానాయక్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

202
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...