కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి..


Sun,September 9, 2018 02:20 AM

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లాలో రాజకీయం వేడెక్కింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికలకు సమరశంఖం పూరించడంతో పాటు ఏకంగా 105మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో ఇందూరు కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. ఒకవైపు టీడీపీతో పొత్తు విషయం పై చర్చలు కొనసాగుతుండగానే.. టికెట్ల కోసం నేతల కొట్లాటలు షురూ అయ్యాయి. టికెట్ నాకొచ్చిందంటే నాకొచ్చిందంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇంకా అలాంటిదేమీ లేదని అధిష్ఠానం ప్రకటించింది. మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకోవడంతో ఇందూరు కాంగ్రెస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో ఎవరికి వారే టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ అర్బన్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌కు టికెట్ వచ్చిందనే ప్రచారం ఊపందుకున్నది. మరోవైపు నరాల రత్నాకర్, కేశ వేణు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. బోధన్‌లో మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డికి మార్గం సుగమం కాగా, నిజామాబాద్ రూరల్‌లో అరికెల నర్సారెడ్డి, నగేశ్‌రెడ్డి, భూమ్‌రెడ్డి తదితరులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు డాక్టర్ భూపతిరెడ్డి కూడా నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశిస్తున్నారు. ఆర్మూర్‌లో ఆకుల లలిత, రాజారాం యాదవ్, బాల్కొండలో ఈరవత్రి అనిల్.. ఇలా ఎవరికి వారే టికెట్ల కోసం పోటీ పడుతున్నారు.

అపార రాజకీయ అనుభవం ఉన్న మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో జిల్లాలో చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆయన వెంట నడిచేందుకు సిద్ధ్దమయ్యారు. ఈనెల 12న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పెద్ద ఎత్తున తన అనుచరగణంతో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. జిల్లాలో మంచి పేరు, గుర్తింపు ఉన్న సురేశ్‌రెడ్డి మూడు తరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. కీలక బాధ్యతలు నిర్వర్తించారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన మరుసటి రోజే ఆయన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తాను కేసీఆర్ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి మరోమారు సీఎంగా కేసీఆర్‌కే కొనసాగాలని, ఈ ప్రగతిరథం ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదనే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో దగ్గరుండి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామం ఇందూరు జిల్లా కాంగ్రెస్ శిబిరంలో తీవ్ర కలకలం రేపింది. టీడీపీతో పొత్తు నేపథ్యంలో చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారు. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్‌లో భారీగా వలసలు కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

222
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...